కన్నీటికి కాలం చెల్లిన వేళ మానసిక క్షోభకు గురి చేయడం అంటే అహంకారాన్ని ప్రదర్శించడమే
కన్నీటికి కాలం చెల్లిన వేళ మానసిక క్షోభకు గురి చేయడం అంటే అహంకారాన్ని ప్రదర్శించడమే.* పెద్దరికం కనుమరుగవుతున్న వేళ వృద్ధులను అవమానించడం అనాగరికమే.* నీకు కూడా తల్లి తండ్రి అక్క చెల్లెల్లు ఉన్న సంగతి మరిచిపోతే ఎలా ?*ఇది స్త్రీలకు, పురుషులకు సర్వత్ర వర్తిస్తుంది సుమా!
వడ్డేపల్లి మల్లేశం
13....01....2025
మానవ జీవన యానంలో ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు, కష్టసుఖాలు, అవమానాలు ప్రశంసలు అనివార్యం అని తెలుసుకుంటే వాటిని సమతూకంలో చేర్చుకోవడానికి తగిన మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది . అవగాహనే లేకుంటే తప్పులను సవరించుకోవాలనే ఆలోచన రాదు కదా !కుటుంబ బంధాలు మానవ సంబంధాలు ఇరుగుపొరుగు వారితో కలయిక అనేవి అనివార్యమైన వేళ వీటిని కాపాడుకోవడానికి కృషి చేసే క్రమంలో వేస్తున్న తప్పటడుగులు, ఇబ్బందులకు బలి కావడం, నోరు జారడం, ఇతరులను మానసిక క్షోభకు గురి చేయడం, అవమానపరిచిన సంఘటనలు మన జీవితంలో అనుభవంలో కోకోల్లలు. కుటుంబ సభ్యుల మధ్యనే అలాంటి తప్పుడు నడకలు ముఖ్యంగా వృద్ధులైన పెద్దలు తల్లిదండ్రులు ఇతరుల పట్ల కుటుంబ సభ్యులు ప్రదర్శిస్తున్న వైఖరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి వ్యస్టీ కుటుంబ వ్యవస్థ వైపుగా సమాజ పరిణామ క్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కనీసం తమ తల్లిదండ్రుల పట్ల కూడా బాధ్యతను గుర్తించడానికి సమయం లేదు అంటూ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు చనిపోయిన రాలేమని, వచ్చి మాత్రం ఏం చేస్తామని, చల్లటి కబురు పంపిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. సమాజాన్ని వాణిజ్య ధోరణి పట్టిపీడిస్తున్న క్రమంలో ఆస్తులు అంతస్తులు లాభాలు ప్రయోజనాలు స్వార్థపూరిత వాతావరణంలో పెరుగుతున్న చిన్నపిల్లల నుండి మధ్య వయస్కుల వరకు కూడా మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ముఖ్యమని తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా దీనిని చట్టబద్ధం చేసే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో దానిని ఎక్కడికి అక్కడ బట్టబయలు చేయాల్సిన అవసరం కొంతమంది పైన, బుద్ధి జీవులు, మేధావులు, సామాజిక వేత్తల పైన ఉన్నది. ఆ రకంగా కాకుంటే రాబోయే సామాజిక వ్యవస్థ ఈ మాత్రం కనీసమైన పద్ధతిలో కూడా కొనసాగే ఆస్కారం ఉండకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, దురుసుగా మాట్లాడడం, కఠిన వైఖరి అవలంబించడం, పక్షపాత ధోరణిలో వ్యవహరించడం, వృద్ధులైన పెద్దల పట్ల అవమానకర ధోరణిని ప్రదర్శించడం... అదేదో బయటి వాళ్లు కాదు సుమా! కన్న కొడుకు, తోడుగా వచ్చిన కోడలు, వాళ్ల కడుపున పుట్టిన పిల్లలు, వీళ్ళ గుణాలకు దగ్గరివాళ్ళు.
"భర్తను గౌరవించలేని భార్య..... భర్త కృషిని, జీవన గమనాన్ని, సామాజిక నేపథ్యాన్ని, సామాజిక బాధ్యతను కనీసంగా పరిగణించలేని సందర్భంలో భర్త తల్లిని తండ్రులను బంధువులను గౌరవిస్తుందని ఎలా ఆశించగలం?.అంతేకాదు తన వైఖరిని బలోపేతం చేసుకోవడానికి చట్టబద్ధంగా మార్చడానికి అనుచ ర గణాన్ని పోగు చేసుకునే క్రమంలో కన్న పిల్లలను కూడా తన వైపు తి ప్పుకోవడానికి ప్రయత్నించి కుటుంబ జీవనంలో పగుళ్లు ఏర్పడి అర్ధాంతరంగా అదృశ్యమైనటువంటి సంసారాలను కుటుంబాలను మనం ఇప్పటికీ రోజు పత్రికల్లో కథనాలలో టీవీ ప్రసారాలలో చూస్తూనే ఉన్నాం. "అలాగే భార్యను గుర్తించలేని కుటుంబాలు కూడా. ఇది సామాజిక గమనానికి, ఉన్నత ఆలోచనల వైపుగా సమాజాన్ని ఎదిగించాలనుకునే సామాజికవేత్తల ఆలోచనకు, సమసమాజ స్థాపన వైపుగా ఆరాటపడుతున్న వాళ్ల ఆకాంక్షలకు భిన్నమైనది. ఇది వాంఛనీయం కాదు.ఈ మూఢాచారాలు, మూర్ఖపు ఆలోచనల మధ్య కన్నీళ్లతో కరిగిపోతున్న చివరి దశలో కూడా తల్లిని, తండ్రిని, అత్త ను, మామను, ఇంట్లోని వృద్ధులను వివక్షతకు గురి చేస్తున్నటువంటి నీచ మనస్తత్వం అహంకారం కాక మరేమిటి? సామాజిక పరిణామ క్రమంలో మనము ఆ స్థానానికి చేరుకోవడం అనివార్యమే కదా! అప్పుడు మన పిల్లలు మన పట్ల చూసే చూపు, ప్రదర్శించే ధోరణి, హింసించే మాటలు, అలుపెరుగని అవమానాలను ఊహించుకుంటే మనకు ఇప్పుడే మన మీద మనకే జాలి కలుగుతుంది..... కాదు కాదు జీవితం అంటే అందులో వృద్ధాప్య దశ అంటే అసహ్యం అనిపిస్తున్నది నిజం కాదంటారా?
ప్రతి కుటుంబంలో పెద్దమనుషులు ఇంటిముందు కనిపించి, ఇంటికి వచ్చిన వాళ్లను పలకరించి,ఆశీర్వదించి, యోగక్షేమాలు అడిగేవారు కుటుంబానికి అండగా ఉండేవారు. వాళ్ళ ఆలోచనను కుటుంబంలోని అణువణువునా నింపేవారు. ఆ అవకాశం, ఆలోచన,అలవాటు క్రమంగా కనుమరుగవుతున్నది. పెద్దవాళ్లకు ఇంటి ముందు స్థానం లేకుండా పోతున్నది, చాటుమాటున, ఇంటి వెనుక ,పందిరి కింద, పరమ అసహ్యకరమైన పరిస్థితుల మధ్యన కంటికి కనపడకుండా ఉన్నప్పుడు వారి పెద్దరికం ఇంకెక్కడిది? కన్న తల్లిదండ్రులతో పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అవసరాలను సమకూర్చి, ఆత్మీయంగా పలకరించుదామని కన్న కొడుకు ప్రయత్నించినా అతనికి ఆటంకాలు కల్పించే వాళ్ళు ఎందరో! కుటుంబంలోనే అడుగడుగునా ఆత్మీయతకు ఆకాంక్షలు అన్ని ఇన్ని కావు. దీనిని అనాగరికం, కుసంస్కారం, కుళ్ళుబోతు తనం అనకుండా ఉండలేము కదా!
స్త్రీలు పురుషులు ఆలోచించుకోవాల్సిందే :- కుటుంబాలలో అక్కడో ఇక్కడో కాదు సుమారు అంతట ఈ రకమైనటువంటి దుందుడుకు ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కొందరు చూసి చూడనట్లు ఊరుకుంటారు, కొందరు నిలదీసి ప్రశ్నిస్తారు, మరికొందరు అవమానభారంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ వికృత అనుభవాలకు స్త్రీలు పురు షులు ఇద్దరు కూడా కారణమే. అంతేకాదు వాళ్ళ పిల్లలను పెంచి పోషించిన తీరుకు బాధ్యత కూడా వహించాలి. పిల్లలు కూడా వృద్ధుల పట్ల కుటుంబ సంబంధాలను బంధుత్వాలను కాపాడుకునే క్రమంలో తమకేమీ పట్టనట్లు, వారితో తమకు సంబంధం లేనట్లు, కనీసం చావు వార్తల సందర్భంలో కూడా పలకరించడానికి మనసొ ప్పకుండా ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచన గల వాళ్లు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఇలాగే చూస్తూ ఊరుకుందామా? ఎక్కడికక్కడ ప్రశ్నించకపోతే ఎలా? కొన్ని ఇబ్బందులు, అలకలు, అవమానాలు ఉంటాయి కాదనలేము కానీ ఈ రోత లక్షణాల వలన అనేక కుటుంబాలు వీధిపాలు కావడం, మాట్లాడుకోకుండా ఉండడం, శాశ్వతంగా శత్రు స్థానం లోకి వెళ్లిపోవడం వంటి అనేక పరిణామాలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమే కదా! ఇదేనా మనం కోరుకున్నటువంటి సామాజిక వ్యవస్థ. "అందుకే ప్రభుత్వాలు మానవ సంబంధాలను కుటుంబ బంధాలను సవరించడానికి చట్టబద్ధత కలిగినటువంటి కమిటీలను మండల స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ కమిటీల పరిశీలనకు వచ్చిన అంశాలను పరిశీలించి సవరించడానికి, వ్యక్తుల మధ్యన పొరపొచ్చాలను సమసి పోయేలాగా చూడడానికి, బంధాలు పునరుద్ధరించడానికి,కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది.ఆ క్రమంలో జరిగిన తప్పులను కూడా సమీక్షించుకోవడం వీలవుతుంది కనుక ఇలాంటి చట్టబద్ధ కమిటీలకు ప్రభుత్వాలు శ్రీకారం చూస్తే మానవ సంబంధాలను మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది. అంతేకాదు వివక్షతకు, అవమానాలకు, నిందలకు గురవుతున్నటువంటి వృద్ధ తల్లిదండ్రులు ఇతరులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది ఆలోచించండి!!!!"
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )