అశ్లీల సన్నివేశాలు గల సినిమాలు సీరియల్లకు పాటలు, మాటలు రాయమని రచయితలు బహిష్కరించాలి
అశ్లీల సన్నివేశాలు గల సినిమాలు సీరియల్లకు పాటలు, మాటలు రాయమని రచయితలు బహిష్కరించాలి
అర్ధ నగ్న దృశ్యాల సీరియళ్లు, కార్యక్రమాలకు జడ్జిలుగా వ్యవహరించమని తెగేసి చెప్పాలి. అంగాంగ ప్రదర్శనలకు అంగీకరించమని మహిళా నటులు నిరసించాలి.* డబ్బు కోసం దేనికైనా సిద్ధమంటే ఎలా?
వడ్డేపల్లి మల్లేశం
11...01...2025
లక్ష్యం కోసం పని చేసే వాళ్ళు, డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వాళ్ళు, మాట కోసం కట్టుబడి ఉండేవాళ్లు, మాటలు తక్కువ పని ఎక్కువ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాళ్ళు, చేసే ప్రతి పనిలో లక్ష్యం ఆలోచన ఆచరణ ఒకేరకంగా ఉండాలని తలపోసేవాళ్ళు, సిద్ధాంతం ఆచరణ ఒకేలా ఉండాలని ఆశపడే వాళ్ళు ఇలా విభిన్న రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మన చుట్టూ కనిపిస్తారు. " కొందరు డబ్బుల కోసం పనిచేస్తే, మరికొందరు విలువల కోసం పనిచేస్తారు .డబ్బులు ఇస్తే చాలు ఎంత నీచమైన పని అయినా చేయడానికి సిద్ధపడతారు. హత్యలు చేయడం, హత్యలకు పురి కొ లపడం, కుట్రలు కుటిల ఎత్తుగడలతో కుటుంబాలు సంసారాలను కుల దోయడం వంటి అనేక రకాల వ్యాపకాలు నిత్యం మన చుట్టూ కనపడుతూనే ఉన్నాయి. అయినా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు ఉన్నప్పటికీ న్యాయం చట్టం ధర్మం సామాజిక చింతన బాధ్యత కర్తవ్యం నైతిక విలువలు నీతి నిజాయితీ వంటి అంశాలు ఇంకా మాన మానవ జాతిని పెనవేసుకుని ఉన్నాయి కనుక ఈ వ్యవస్థ కొంత అస్థిరంగా నైనా కొనసాగుతున్నది. " అయితే ఇదే జీవితం కాదు కదా మార్గాలు లక్ష్యాలు ఆశలు, ఆకాంక్షలు ఆచరణ వంటి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి వ్యక్తి ఆశిస్తే మంచిది. కానీ తాత్కాలిక ప్రయోజనాలు ప్రలోభాలు స్వార్థ చింతనకు రాజీ పడి వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటే ఎలా? ఇలాంటి పరిస్థితులు ఉద్యోగ వర్గాలలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. లంచాలకు మరిగి అత్యాశతో ఇతరుల సొమ్మును కాజేయడానికి పాటుపడుతూ అక్రమార్జన చేస్తున్న వాళ్లు మన చుట్టూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో పెట్రోలు డబ్బాలతో ప్రజల చేత దాడులకు గురై మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్న వారిని కూడా మనం చూడవచ్చు. అంటే అక్రమములో కూడా సక్రమ జీవన విధానం పైన దాగివున్న మంచితనం స్మరణకు వస్తేనే కదా!
ఇక రాజకీయ రణక్షేత్రంలో మరింత నీచమైన పరిస్థితులను మనం గమనించవచ్చు .అధికారంలో కొనసాగాలని, ఆ అధికారాన్ని పదికాలాలు శాశ్వతం చేసుకోవాలని,10 తరాల వరకు సరిపోయే సంపాదనను అక్రమంగా ఆర్థించాలని మొదటి రోజు నుండి అత్యాశ.....ఇక ప్రజాసేవలో పనిచేయడం ఎలా సాధ్యం? రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అవినీతిలో అగ్ర భాగాన నిలబడడమే కాదు త మ అనుచరులుగా ఉన్నటువంటి ఉద్యోగుల పైన అదుపు లేకుండా వారిని కూడా అవినీతిపరులుగా ప్రోత్సహిస్తున్న విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. అవినీతి ఉద్యోగులకు ఇంత ధైర్యం ఎక్కడిది అంటే రాజకీయ రాకాసుల రాబందుల అండ.
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ సిద్ధాంతాలకు నైతిక విలువలకు నీళ్లు వదిలి మానవత్వాన్ని అమ్ముకొని అవకాశాలు ఆస్తులను అక్రమంగా సొమ్ము చేసుకోవడానికి అడ్డదారిలో పోతున్న రంగాలు అన్నీ ఇన్ని కావు. ఎందుకు సినిమా టీవీ ప్రసారాలకు మాటలు పాటలు రాస్తున్న రచయితలు అంగాంగ ప్రదర్శన అంశాలకు సంబంధించి న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వాళ్లు అశ్లీల దృశ్యాలకు తమ సమ్మతిని తెలిపి వ్యతిరేకించని సమాజం ఎటువైపు పోయినా పరవాలేదు అనుకునేటువంటి మహిళా నటుల యొక్క అసభ్యకర సన్నివేశాలు ఈ సమాజాన్ని బ్రష్టు పట్టించడానికే కదా! ఈ రంగాల పైన ప్రభుత్వ అదుపు లేదా లేక ప్రభుత్వం అదుపు అవసరమని భావించడం లేదా?
సీరియళ్లు సినిమాలకు కథ మాటలు పాటలు రాస్తున్నటువంటి రచయితలు ప్రేక్షకులు చూడడానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి విలువలను పక్కన పెట్టి చౌకబారు ప్రచారంతో యువత నైతికంగా నిర్వీర్యం అయ్యే స్థాయిలో డబ్బు కోసం మాత్రమే పని చేసే ధోరణి ఇకనైనా మానుకోవాలి. నిర్మాతలు దర్శకులకు అశ్లీల దృశ్యాలకు సంబంధించి తమ రచనలను నిరాకరిస్తామని హెచ్చరించి తమ నిరసన తెలుపగలిగిన నాడు వాళ్లకు సామాజిక చింతన ఉందని నమ్మవచ్చు.
అర్ధనగ్న దృశ్యాలతో విచ్చలవిడిగా విహారం చేస్తూ చేతులలో ఆడిస్తూ పాడిస్తూ విన్యాసాలు చేస్తూ ఉంటే న్యాయ నిర్ణయతలుగా ఉన్నటువంటి పురుషులు స్త్రీలు కూడా చౌకబారు సన్నివేశాలకు ముగ్ధులై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గొప్పగా ప్రశంసించడం ఏ విలువ కోసం ఎవరి ప్రయోజనం కోసం? బ్రష్టు పట్టిపోతున్న సమాజాన్ని కొంతనైనా మేల్కొల్పాలనుకున్న, ప్రక్షాళన చేయాలన్న ఇలాంటి పరిస్థితుల్లో నటిస్తున్న చేస్తున్న వాళ్ళు తమ విచ్చలవిడి తనం నుండి విజ్ఞత వైపు రావడం కోసం ఇకనుండి ఇలాంటి దురాచారాలకు స్వస్తి పలుకుతామని చెప్పగలరా?. న్యాయ నిరునేతలు చిరునవ్వుతో ఎంతో సాధించినట్లు గొప్పగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వాళ్లు వ్యవస్థ మార్పులో మేము కూడా భాగస్వాములనే మని బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి అక్రమాలకు స్వస్తి పలకగలరా? సినిమాలు సీరియలలో మహిళా పాత్రధారులు పోషిస్తున్న పాత్రల్లో కుట్రలు కుతంత్రాలు అసాంఘికమైనటువంటి లక్షణాలతో పాటు అంద వికారంగా అర్థనగ్నంగా అశ్లీలంగా అంగాంగ ప్రదర్శనకు సిద్ధపడడం అంటే నాగరిక ప్రపంచాన్ని అపహాస్యం చేయడమే,! తమ తల్లిదండ్రులను కన్న పిల్లలను ఏ రకంగా మెప్పించగలరు ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది .ధమన నీతికి ,మూర్ఖపు ఆలోచనలకు, వెర్రి ప్రకటనలకు, వికృత చేష్టల ద్వారా ప్రదర్శనకు అలవాటు పడినటువంటి నటులు కళాకారులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారితే దానివల్ల వనగూరే దుష్ప్రభావాన్ని సమాజం మీదకి నెట్టడం భావ్యమేనా?
"ప్రజల ముందు బహిరంగంగా ప్రసారం చేస్తున్నామంటే విలువలకు కట్టుబడి, న్యాయానికి నిలబడి, ధర్మానికి మద్దతుగా, సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పటికే కోట్ల డబ్బు సంపాదించినటువంటి ఈ కళాకారులు నటులు నిర్మాతలు దర్శకులు అక్రమ సొమ్మును పది లపరుచుకోవడానికి, ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, మరింతగా అక్రమార్జనకు పాల్పడడానికి సమాజాన్ని పావుగా వాడుకునే క్రమంలో ప్రజలను బలి పశువులను చేస్తూ ఉంటే పిడికెడు మంది ప్రయోజనం కోసం సమాజం యావత్తు చిన్నాభిన్నం కావాల్సిందేనా? ప్రజలకు నచ్చని ప్రజలు మెచ్చని నిర్మాతలు దర్శకులు, కళాకారులకు మాత్రమే తోచిన పాత్రలో సన్నివేశాలు కథాంశాలు సీరియల్ ద్వారా ప్రజల పైన రుద్దడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తీసేవాళ్లు, రాసేవాళ్లు, పెట్టుబడి పెట్టే వాళ్ళు, నటించేవాళ్లు ఎంతకైనా దిగజారుతారు కావచ్చు కానీ ప్రేక్షకులుగా మనం దిగజారకూడదు కదా! మన నిరసనను ప్రతిఘటనను ప్రశ్నను ఆయుధంగా మలుచుకొని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి కవులు రచయితలు గాయకులు నిర్మాతలు దర్శకులు మిగతా సిబ్బందికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తద్వారా విలువలతో కూడుకున్నటువంటి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిఘటన అంతా మార్పు కోసం, ఈ కసి అంతా అవినీతిని బట్టబయలు చేయడం కోసం, కోపము ఆగ్రహము అంతా సమాజం బ్రష్టు పట్టిపోకుండా రక్షించుకోవడం కోసమే అని ఆలోచిస్తే మంచిది. మద్యపాన సారా ఉద్యమం మద్యం షాపుల పైన దాడులు మహిళల చేతిలో ధ్వంసం వంటి విప్లవాత్మకమైన ఆలోచనల నుండి పురుడు పోసుకున్నటువంటి నిరసనను సమాజం గ్రహించాలి. సీరియల్ సినిమాల నిర్మాతలు ఆలోచించాలి తమ వైఖరిలో మార్పు చేర్చుకోవాలి. కేవలం డబ్బు కోసం రాయడానికి, మాట్లాడానికి, పాడడానికి, నటించడానికి, అంగాంగ ప్రదర్శనకు, వికృత చేష్టలకు అంగీకరిస్తున్నటువంటి కళాకారులు నటులు సిబ్బంది పట్ల సమాజం కఠిన వైఖరి అవలంబించవలసిన సందర్భం ఇది.
ఇంత జరుగుతు కళ్ళముందే కన్నీరు పెట్టే దృశ్యాలు కనబడుతున్న ప్రభుత్వాలు మాత్రం మౌనంగా ఉంటున్నాయి. ఈ సమాజం నిర్ వీర్యమైతేనేమి? యువత నష్టపోతే నేమి? అనైతిక విలువలతో సమాజం దిగజారితే మాకేమి?అనే కోణంలో పాలకులు ప్రజా క్షేమాన్ని మరిచి స్వప్రయోజనాలకు పాల్పడుతూ ప్రజలు మత్తులో మునిగి తేలుతున్న సమయంలో తమ అధికారాన్ని అక్రమార్జనను కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కనుకనే చట్టానికి వ్యతిరేకమని తెలిసినా కూడా ఇలాంటి కార్యకలాపాలు అన్నీ నిస్సందేహంగా నిరంతరము కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలించి ప్రశ్నించడానికి సిద్ధపడి సమాయత్తం కావలసినటువంటి అవసరము నేడు యువత పైన, సమాజంలోని భిన్న వర్గాల పైన, మేధావుల పైన ఎంతగానో ఉన్నది. మహిళలు ఎందుకు ప్రశ్నించడం లేదు తమను బలి పశువులను ఎందుకు చేస్తున్నారని అడగడం లేదు. మార్కెట్ వస్తువుగా అందాల సరుకుగా ఆట బొమ్మలుగా నిత్యము కీర్తిస్తూ జపిస్తూ ప్రదర్శిస్తూ పోటీలకు ఆహ్వానిస్తుంటే ఇదే గొప్ప అవకాశం అని మహిళా లోకం అనుకుంటే ఎట్లా? మహిళా రచయితలు కవులు కళాకారులు మహిళా సంఘాలు కన్నెత్తి చూస్తే, గలమెత్తి ప్రతిఘటిస్తే ఈ ఊకదంపుడు విన్యాసాలు పనికిమాలిన చేష్టలు సంస్కృతిని దెబ్బతీసే అసహ్యకర ఆలోచనలను మట్టు పెట్టలేమా? అయితే ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఐక్య ఉద్యమాలకు ఆస్కారం ఎక్కడ? ప్రతిఘటన ఎక్కడ ప్రారంభం కావాలి? అనే బహుశా ప్రజలు చూస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. వీళ్లకు ప్రజా సంఘాలు నాయకత్వం వహించి వీళ్ళ ఆలోచనలకు జీవం పోసి ప్రజల అసహనాన్ని అగ్నిగా రాజేసి ఉద్యమ మంటలను ఎగతోయాలి. ఎక్కడికక్కడ మహిళలు యువత విద్యార్థులు బుద్ధి జీవులు, మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు నిరసన తెలపడం తమ హక్కుగా బాధ్యతగా భావించాలి. అలాంటి ఉద్యమాలు సమీప భవిష్యత్తులో వస్తాయని, రావాలని, ఆ మంటల్లో స్త్రీని బలి పశువును చేసే వికృత సంస్కృతి మాడిపోవాలని మనసారా కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )