రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప బతకలేని  భూమిలేని పేదల గూర్చి  ముందు కార్యాచరణ ప్రకటించాలి.

Jun 23, 2024 - 13:47
 0  5

పెట్టుబడిదారులు భూస్వాములకు ప్రకటించే  రాయితీలను   రద్దు చేయాలి.

ఉత్పత్తిలో భాగస్వాము లయ్యే సాధారణ ప్రజలను ప్రాతిపదికగా తీసుకోవాలి ప్రభుత్వాలు.

--వడ్డేపల్లి మల్లేశం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రపంచముతో పోటీపడే స్థాయిలో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రపంచంలోనే  ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తామని  ఆ వైపుగా పరిపాలన చేస్తామని పాలకులు హామీ ఇస్తున్నారే తప్ప  ప్రపంచంతో పోటీ పడే ముందు  ఈ దేశంలోని  ఆశేష పేద వర్గాల గురించి ఆలోచించిన సందర్భం లేదు.  ముఖ్యమంత్రి ,ప్రధానమంత్రి ఇంకెవరైనా ఈ దేశంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ఎన్నికల సందర్భంలో కానీ  రైతులు  విద్యా వైద్యం గురించి  మాట్లాడుతున్నారే తప్ప  పిడికెడు మెతుకులకు నోచని భూమిలేని  పేద వర్గాల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించిన దాఖలా అంతగా కనపడదు.

 కానీ  ప్రకటించే రాయితీలు ప్రలోభాలు వాగ్దానాలు మాత్రం  పేదల కోసమే తమ ప్రభుత్వం అన్నట్లు  కనిపిస్తుంది ఆచరణలో మాత్రం నిండుతున్న.  రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని గతంలో ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో హామీ ఇస్తే  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రపంచము ని వ్వేరా పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని రైతుల ఆదాయాన్ని  పెంచడానికి  రైతుబంధు కార్యక్రమాన్ని ప్రకటించినట్లు చెప్పి  భూస్వాములకు మాత్రమే అప్పజెప్పి  పేద వర్గాలకు  అంతంత మాత్రం  సహకరించిన తీరు మనకు తెలియదా?  ఆ పథకం యొక్క లక్ష్యం భూస్వామ్య వర్గ ప్రయోజనం  అందులో భాగంగా  చిన్న కమతాల వారికి  మేలు జరగవచ్చు కానీ ఆనాడు ఈనాడు ఏనాడైనా  భూమి ఉన్న వాళ్లకు అనేక రకాల సహకారం చేస్తున్నారు భూమిలేని మాకు ఏ రకమైన సహకారం ఇస్తున్నారు మా సంగతి ఏమిటి? అని ప్రశ్నించిన సందర్భం అనేకం . భూమిలేని పేదల ప్రశ్నకు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర సమాధానం లేకపోవడం విడ్డూరం, విచారకరం .

 జావా,     కూరగాయలు, పాలు, రొయ్యలు ,వంటి     చిరు వ్యాపారంతో రోడ్డు మీద బతికే  వెతలతో జీవించే  ఎన్నో బతుకులకు ఆసరా లేదు.  నా అనేవారు లేక  వలస కార్మికులు  చేతివృత్తుల వాళ్లు  చెమట వడిస్తేనే కానీ పూట గడవని కోట్లాదిమంది ఈ దేశంలో ఇప్పటికి  భూమి లేకుండా ఇండ్లు లేకుండా బ్రతుకుతున్నారు.  కనీస అవసరమైనటువంటి ఇండ్ల సౌకర్యాన్ని కల్పించలేదు,  భూస్వామ్య వర్గం దగ్గర ఉన్నటువంటి మిగులు భూములను లెక్కించి పేద వర్గాలకు పంచలేదు.  ప0 చకపోవడమే కాకుండా భూమిలే నటువంటి వాళ్లకు ఏ రకమైన ప్రయోజనం కల్పించిన పథకాలు కూడా అమలు కావడం లేదు. ఎంతసేపు  భూములు ఉన్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వ పథకం  రుణమాఫీ  పేరుతో కార్యక్రమాలు కొనసాగుతుంటే  పెట్టుబడేదారులు సంపన్న వర్గాలు ఉద్యోగ వర్గాలకు కూడా రుణమాఫీని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలు ఎంత లోపం?  

 పిడికెడు మెతుకులు లేని వారిని పక్కనపెట్టి  పంచభక్ష భోజ్య పరమాన్నములతో కులుకుతున్న వాళ్లకు  పట్టము కట్టినట్లు ప్రభుత్వ విధానం ఉంటే  ప్రజలు ఆగ్రహంతో  ఉద్యమాలలోకి రాకుండా  ఊరుకుంటారా  ?ఇల్లు లేని వాళ్లు, భూమిలేని వాళ్లు, ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు,   వృద్ధాప్యంతో జీవితాలు గడవడం కష్టం అవుతున్న వాళ్లు,  అల్పాదాయ వర్గాల మీద ప్రత్యక్ష ప్రత్యేక సర్వే చేయడం ద్వారా  కనీసం ఈ దేశంలో  వాళ్ల సంఖ్య బాగోగులను  బయట పెట్టవలసిన అవసరం ఉంది.  ఎందుకంటే సంపన్న వర్గాలు ఉద్యోగులు, మధ్యతరగతి వ్యాపార వాణిజ్య పెట్టుబడుదారులు ఎప్పుడు కూడా పేదల గురించి అసలే ఆలోచించరు. వాళ్లకు పేదవాళ్ళు ఉన్నారనే విషయం కూడా అర్థం కాదు.  అక్కడక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు బుద్ధిమంతులనే వాళ్ళు కూడా ఇప్పటికీ ఈ దేశంలో పేదవాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యపడుతున్నారంటే వాళ్ళ సోయి లేని తనం ,బాధ్యతారాహిత్యం అర్థం చేసుకోవచ్చు.  

 బుద్ధిజీవులు మేధావులు విద్యావంతులతో పాటు ప్రభుత్వ పక్షాన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి  ప్రజల బాగోగు లను సర్వే చేసి  వీధి బతుకులు గడుపుతున్న,  మసిబారుతున్న,  పొగ చూరుతున్నటువంటి జీవితాల గురించి ఆలోచించకపోతే ఎలా?  కంకులు కాల్చేవాళ్లు, ప ల్లి కాయ కాల్చుకొని అమ్మే వాళ్ళు, ఇతర కాయలు గడ్డలు వేర్లను కాల్చి అమ్మేవాళ్ళు  సగం పొగ ఆకాశంలోకి పోతుంటే మిగతా సగం కడుపులోకి వెళ్తున్న  అనారోగ్యాల పాలవుతున్న  ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఉన్నదని తమకోసం పనిచేస్తుందని  నమ్మలేని ఊహించలేని అమాయక స్థితిలో ఇప్పటికి కోట్లాది ప్రజానీకం  కొట్టుమిట్టాడుతుంటే  ఈ పాలన ఒక పాలనేనా? ఆ ప్రజల బతుకులు బతుకులేనా ?

ఆదాయం సంపదలో ఇప్పటికే కోట్లాది మంది ప్రజల మధ్యన  అసమానతలు తాండవిస్తుంటే  సంపన్న వర్గాలకు పన్ను రాయితీలు ఇవ్వడం , రుణాలు మాఫీ చేయడం,  పెట్టుబడి దారి పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజాధనం కొద్ది మంది సంపన్న వర్గాలకు మాత్రమే చేరుతుంటే  ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్లు  ముఖ్యంగా ఇoడ్లు, భూమి కనీస అవకాశాలు అవసరాలు లేని  అమర్త్యసేను పరిభాషలో మానవాభివృద్ధికి దూరంగా బతుకుతున్న  ప్రజల గురించి ఆలోచించని పాలకులకు  కనువిప్పు కావలసిన అవసరం ఎంతో ఉన్నది.

తక్షణ చర్యలు  :-

ఒక రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా  భూమిలేని పేద వర్గాల గురించినటువంటి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.  కోట్లాది  రూపాయల ప్రజాధనాన్ని కొన్ని వర్గాలకు మాత్రమే కట్టబెడుతున్నటువంటి  వికృత ధోరణికి స్వస్తి పలకాలి.  ఇప్పటివరకు అక్రమంగా మాఫీ చేసినటువంటి   పెట్టుబడిదారుల బకాయిలను తిరిగి వసూలు చేసే ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.  భూస్వామ్య వర్గానికి పరిమితమైనటువంటి  భూ కమతాలను నిర్ధారించి మిగులు భూములను పేద వర్గాలకు పంపిణీ చేయాలి ఈ దేశంలో భూమిలేని పేదలు అనే మాట లేకుండా  చర్యలు తీసుకోవాలి . భూ పంపిణీ జరిగేంతవరకు భూమిలేని పేద వర్గాలకు  ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి.  ఒకే వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  అందిస్తున్నటువంటి డబుల్ ప్రయోజనాలను  రద్దు చేయాలి  అనివార్యమైన అత్యవసరమైన సందర్భాలను వ్యవస్థలను వ్యక్తులను కుటుంబాలను సమూహాలను ప్రధానంగా చేసుకొని  సర్వే సాగాలి సర్వే మేరకు కార్యం చరణ  అమలు జరగాలి.

  అంతకు మించిన స్థాయిలో భూమిలేని కార్మికులు పేదవర్గాలు  బజారు బతుకులు గడుపుతున్నటువంటి  ప్రజల పట్ల పాలకులకు గౌరవము,  శ్రమను ఆరాధించే తత్వము, ఉత్పత్తిలో భాగస్వాములవుతున్న  వారి బాధ్యతను గుర్తించడం ద్వారా  పాలకవర్గాలు తమ సంస్కారాన్ని ప్రకటించి   పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి.  పరిపాలన సంస్కరించబడాలి,  ప్రజా సంపద పేద వర్గాలకే ముందు వరుసలో అందాలి.  ఆ ప్రయత్నం జరగకుంటే ప్రజల ఆగ్రహానికి  పోరాటానికి  ఏ పాలకవర్గమైన బలి కాక తప్పదు,  అది చరిత్ర చెప్పిన సత్యం. అయితే  పాలకుల నిర్బంధము అణచివేత రాజ్యమేలుతున్న  కారణంగా అప్పుడప్పుడు ఉద్యమాలు  ఆగినప్పటికీ అది   వ్యూహం మాత్రమే కానీ  ప్రజల ఓటమి కాదు అని గుర్తిస్తే మంచిది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333