ఉన్నత విద్యారంగం ఇంత నిర్లక్ష్యానికి గురైతే ఎలా?
విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీపై ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని విద్యార్థి, ప్రజా సంఘాలు ప్రతిఘటించాలి.
ప్రమాణాలు దిగజారుతున్నా ప్రభుత్వానికి భర్తీ ప్రక్రియ ఎందుకు గుర్తుకు రాదు ?*
---వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 12 విశ్వవిద్యా లయాలలో 2013 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆచార్యుల నియామకాలు జరిగితే గత 12 సంవత్సరాలుగా నియామకాలు లేక బోధన కు o టుబడి పరిశోధనకు వస్తున్న పరిశోధక విద్యార్థులకు గైడ్లు దొరకని పరిస్థితి ఒకవైపు ఎదురైతే ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య జాతీయ ప్రమాణాలకు దిగువన ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఒకప్పుడు భారతదేశంలోనే విశిష్ట స్థానంలో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం తో సహా అన్ని విశ్వవిద్యాలయాలకు సరైనటువంటి బోధనా సిబ్బంది లేక ఖాళీలను భర్తీ చేయక మరొకవైపు వీటి నిర్వహణకు సంబంధించి బడ్జెట్లో నిధులను కేటాయించకపోవడంతో అప్పట్లో విశ్వవిద్యాలయాలలో బాత్రూంలు మరుగుదొడ్లు మూత్రశాలల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని అనేక పత్రికల్లో వచ్చిన విషయాన్ని మనం గమనించవచ్చు. గత 11 సంవత్సరాలుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఏనాడు కూడా ఆచార్యుల భర్తీ ప్రక్రియ కొనసాగించకపోవడం, సంవత్సరాల తరబడిగా వీసీ పోస్టులు ఖాళీగా ఉంచడం వంటి అసంబద్ధ విధానాల వలన రాష్ట్రంలోని ఉన్నత విద్య అటుకెక్కినది. మొత్తం 12 విశ్వవిద్యాలయాలకు గాను మంజూరైన పోస్టులు 2878 కాగా అందులో కేవలం 753 మంది మాత్రమే ఆచార్యులుగా పనిచేస్తున్నారు అంటే మిగతా 2125 పోస్టులు దశాబ్ద కాలంగా భర్తీ చేయకుండా కొనసాగుతున్నది అంటే విద్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలతో సహా కలుపుకుంటే 85 శాతం ఖాళీలు ఉన్నట్లు తేలినా రాష్ట్ర ప్రభుత్వానికి నియామక ప్రక్రియను వేగవంతం చేయడం పైన దృష్టి లేకపోవడం నియామక ప్రక్రియ నిర్లక్ష్యానికి గురి కావడం ఆందోళన కలిగించే విషయం .
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పైన పాలకులు దృష్టి సారించకపోవడం, మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం ప్రతిఏటా నిధులను మంజూరు చేయకపోవడంతో పాటు ఖాళీల భర్తీ చేయని కారణంగా విద్యాబోధన కుంటుపడుతూ ఉంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చి ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసి పేదలకు అందకుండా పెట్టుబడిదారుల కోసమే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిన విషయం విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ప్రతిఘటించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఒకవైపు ప్రాథమిక స్థాయి నుండి పాఠశాల విద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోతే ప్రభుత్వ రంగంలో విద్య కొనసాగాలని, కామన్ స్కూల్ ను ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ రంగంలో ఫీజుల జులుమును నిర్మూలించి ఉచిత విద్య అందించాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతించడం పెద్ద నేరమైతే ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కూడా నిర్లక్ష్యానికి గురి చేయడం అంటే ప్రభుత్వ విద్య పేద వర్గాలకు అందకుండా చేయడo, పుండుపైన కారం చల్లినట్లు ఉందికదా!
విశ్వవిద్యాలయాల నిర్వహణ ఇటీవలి కొన్ని పరిణామాలు
గత 12 ఏళ్లుగా నియామక ప్రక్రియ లేనటువంటి విశ్వవిద్యాలయాలలో ఉప కులపతుల నియామకం కూడా అంతంత మాత్రమే కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ మాసంలో వీసీ లను నియమించడం జరిగింది. ఇక ఆచార్యుల యొక్క నియామక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యా మండలి 2024 డిసెంబర్లో ఒక నిపుణుల కమిటీని వేయగా ఆ కమిటీ సుదీర్ఘ కసరత్తు అనంతరం 2025 జనవరి మాసాంతంలో రూపుదిద్దుకొని ఫిబ్రవరి మాసంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. బోధనా సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించి ఎంపిక క్రమంలో స్క్రీనింగ్ టెస్ట్ అంటే వడబోత నిర్వహించాలని, గతంలో ఉన్నటువంటి యూజీసీ మార్గదర్శ కాల అనుసరించి విశ్వవిద్యాలయాలే తమ ఆచార్యులను నియామకాలు చేసుకోవాలని కమిటీ సూచించినట్లు తెలుస్తూ ఉంటే నివేదిక అంది నెల దాటినా ఇప్పటివరకు దానిపైన ఎలాంటి చర్యలు ప్రభుత్వం ప్రకటించలేదు. జాతీయస్థాయితో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల ర్యాంకు పతనమయ్యే ప్రమాదం ఉన్నదని అంతేకాకుండా పరిశోధన కూడా కుంటుబడి
లక్ష్యాలను చేరుకోవడంలో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని నిపుణులు విద్యావేత్తలు మేధావులు ఆందోళన వ్యక్తం చేయడం పైన ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించడం చాలా అవసరం .
పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నట్లు సంస్కృతిపరిరక్షణ, పరిశోధన, ప్రతిభను సాధించడానికి పట్టుకొమ్మలైనటువంటి విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేయడానికి సరైన పెద్ద మొత్తంలో నిధులను బడ్జెట్లో కేటాయించడం కోసం ఆచార్యుల నియామక ప్రక్రియను వెంటనే ప్రభుత్వం ప్రారంభించేలా ఒత్తిడి చేయడానికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిపి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. అంతేకాదు సంస్కృతి సాంప్రదాయాలు సామాజిక అంశాలు రాజకీయపరమైన అస్థిర ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి పోరాడవలసిన అవసరం కూడా ఎంతగానో ఉన్నది. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో మెరుగైనటువంటి విద్యారంగ పరిస్థితులను సాధించడానికి వీలు పడుతుంది ఇదే సందర్భంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రద్దు చేసే వరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కూడా చాలా కీలకం. ఎందుకంటే ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వ విద్యా రంగం మరింత కుంటుపడే ప్రమాదం ఉంటుంది అప్పుడు పేద వర్గాలకు ఉచిత విద్య మొక్కుబడిగా మాత్రమే మిగిలే ప్రమాదం ఉన్నది .ఇదే విషయంపైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విభాగపు అధిపతి ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ కాశీం గారు గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుల భర్తీని డిమాండ్ చేస్తూ నిరసనగా విద్యార్థులతో ఎండలో ఆరుబయట తరగతులు నిర్వహించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఆ రకంగా ప్రతి కళాశాలలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వంకు చలనం వస్తుంది .ప్రభుత్వ పెద్దల ఖర్చులకు ప్రయాణాలకు అధికారిక కార్యక్రమాలకు ఆడంబరాలకు చేస్తున్న ఖర్చు కోట్లల్లో ఉంటే విద్యా రంగానికి మాత్రమే నిధులను అరకొ రగా కేటాయించడం అంటే విద్య పైన పాలకుల నిర్లక్ష్యమే కారణం కదా !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )