అల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ మొయిజ్ భాయ్ కేనా...!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి
హైదరాబాద్ మహా నగరం మరోసారి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికల సమరానికి ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్షంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా సన్నద్దమవుతున్నాయి. అయితే మరోసారి బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి హస్తం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది . ఇందులో భాగంగా ఇప్పటికే, వివిధ డివిజన్ లలో విజయావకాశాలు ఉన్న యువకుల పేర్లను సిద్దం చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, అల్లాపూర్ డివిజన్ రేస్ లో కాంగ్రెస్ యువ నాయకుడు మొయిజ్ పేరు తెరమీదకు వచ్చింది. మొయిజ్ , సాదా సీదా నాయకుడు కాదు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నుంచి ఎదిగొచ్చిన నేత. ఎన్ ఎస్ యు ఐ నేతగా జంట నగరాలలో మొయిజ్ బాగా పాపులర్. జేఎన్ టీ యు విద్యార్థులు గతంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు , వారికి అండగా నిలిచిన చరిత్ర మొయిజ్ కు ఉంది. అంతేకాదు మడమ తిప్పకుండా పోరాటం చేసి జేఎన్ టీయూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మొయిజ్ పరిష్కరించారు. ఈ సంగతి జంట నగరాల్లోని సమస్త విద్యార్థి లోకానికి తెలిసిన సంగతే.
ఆ తరువాతి కాలంలో ఎన్ ఎస్ యు ఐ నుంచి యువజన కాంగ్రెస్ లోకి మొయిజ్ ఎంట్రీ ఇచ్చారు. యువజన కాంగ్రెస్ నేతగా సభ్యత్వ నమోద కార్యక్రమంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇతర పార్టీల విద్యార్థి విభాగాల నుంచి వస్తున్న పోటీని తట్టుకుంటూ జంట నగరాల్లో యువజన కాంగ్రెస్ బలోపేతానికి మొయిజ్ కృషి చేశారు. దీంతో , అంతిమంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ను ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో తన వంత పాత్రను సమర్థవంతంగా పోషించారు మొయిజ్. అంతేకాదు ఎనుమల రేవంత్ రెడ్డి , మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ కు పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి రాత్రింబవళ్లు మొయిజ్ శ్రమించారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం అంతా కలియతిరిగి...ఎక్కడెక్కడ లోటు పాట్లు ఉన్నాయో గుర్తించి , వాటిని సరి చేసిన వ్యూహకర్త మొయిజ్. అంతేకాదు పోలింగ్ కేంద్రాల మేనేజ్ మెంట్ లోనూ మొయిజ్ సిద్ధహస్తుడు. ఇటీవల ఒక వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైతే...దూరాన ఉన్న మొయిజ్ ను గుర్తు పట్టి, దగ్గరకు పిలిపించుకున్నారు. తెలంగాణ రథ సారథి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత మొయిజ్ ఎంత దగ్గరివాడో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. కాగా సమర్థవంతుడైన కాంగ్రెస్ నాయకుడిగానే కాదు.....అనునిత్యం ప్రజల్లో ఉండే నేతగానూ మొయిజ్ కు పేరుంది. అల్లాపూర్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా...నేనున్నానంటూ ముందుకు వెళ్లడం మొయిజ్ నైజం. ఈ నైజమే...మొయిజ్ ను ప్రజలకు దగ్గర చేసింది. కాగా అల్లాపూర్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం తనకు వస్తే, తప్పకుండా బరిలోకి దిగుతానని మొయిజ్ అంటున్నారు. అంతేకాదు అల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని మొయిజ్ పేర్కొన్నారు.