సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే
పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:
సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ కె సీతారామా రావు
సూర్యాపేట:- సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ కే సీతారామరావు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని యం.జి. రోడ్డు సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతి రావు పూలే 200 వ జయంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే. సీతారామా రావుతో మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత కలిసి పాల్గొని, జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సీతారామరావు మాట్లాడుతూ మహనీయుడు జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని ఉద్బోధించారు. ఆ కాలంలో కుల, మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి, ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆ రోజుల్లో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నా మని అన్నారు. కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని మహాత్మా జ్యోతి రావు పూలే బోధించిన సిద్ధాంతాలని తెలిపారు. ఆ కాలంలోనే మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు.
పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరోసారి స్మరించుకొని, మంచి సమాజ నిర్మాణం కోసం వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపు నిచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ మహిళల విద్య కోసం పూలే కృషి చేశారని, మొదటిగా తన సహచరికి విద్య నేర్పి తద్వారా సమాజంలో విద్య అందరికీ అందేలా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవరావు, డిఎస్పి ప్రసన్న కుమార్, డిటిడిఓ శంకర్, డిఎంఓ నాగేశ్వర శర్మ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహులు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి కొల్లి లత, టీఎన్జీవోస్ జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ళ అన్నపూర్ణ, డాక్టర్ కృష్ణ బంటు, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, వసంత సత్యనారాయణ పిల్లే, చల్లమల్ల నరసింహ, వై వెంకటేశ్వర్లు, చింతలపాటి చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల హస్సేన్, నిద్ర సంపత్, మడిపడిగ సైదులు, కే.వెంకటేశ్వర్లు, బెల్లంకొండ రామ్మూర్తి, శ్రీకాంత్, జీడి బిక్షం, బయ్య మల్లి కార్జున్ , కోట గోపి, యాతాకుల రాజయ్య, పలు వార్డుల కౌన్సిలర్లు,జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.