కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధనుంజయ్ రెడ్డి కి వేధింపులు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధనుంజయ్ రెడ్డి కి వేధింపులు.
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న పాలకులు.
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగితే ఊరుకునేది లేదు.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.
హైదరాబాద్, మే 8
ప్రభుత్వ పరిపాలన తీరును ఎండగడుతూ వార్తలు రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి జర్నలిస్ట్, ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇంటిపై పోలీసులు దాడి చేశారని వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అన్నారు. గురువారం హైదరాబాదులోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకులను దేశవ్యాప్తంగా పాలకులు తమ పలుకుబడిని ఉపయోగించి గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛను కాలరాస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగితే జర్నలిస్ట్ యూనియన్లకు అతీతంగా ఒకటై పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు,మేధావులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించబోమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న రాజకీయ నాయకులే వీలైనప్పుడల్లా జర్నలిస్టులపై దాడులకు తెగబడడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించినందుకు ఎంతో మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బేషరతుగా ధనుంజయ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.