సంకుచిత మనస్తత్వం విడిచిపెడితేనే విశ్వ కుటుంబ భావన సాధ్యమవుతుంది.
సంకుచిత మనస్తత్వం విడిచిపెడితేనే విశ్వ కుటుంబ భావన సాధ్యమవుతుంది.*
స్వార్థ చింతన వల్లనే విశాల ప్రపంచం కుగ్రామమయిందoటే పెద్దరికాన్ని చాటుకోవడానికి సాధన చేయాల్సిందే కదా! --
మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమేష్ చంద్ర లహోటి .
----వడ్డేపల్లి మల్లేశం
వైయక్తిక జీవితాల సమాహారమే సామాజిక జీవితం అయితే ఆరోహణ అవరోహణలు, భిన్న దృక్పదాలు, సంఘర్షణలు, వైరుధ్యాలు సామాజిక జీవితంలో సహజం. వీటన్నింటినీ అదిగమించడం ద్వారా మెజారిటీ ప్రజానీకం ఆశించే ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయడం ద్వారా ప్రజలను ఒప్పించాలి కష్టాల నుండి తప్పించాలి. ఇదే క్రమంలో పాలకులతో పాటు ప్రజల యొక్క సామాజిక బాధ్యత కూడా ఎక్కువే .మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చేసిన సూచన సామాజిక జీవితాన్ని అర్థవంతంగా ఫలవంతంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది.అదే సందర్భంలో సంకుచిత మనస్తత్వం, స్వార్థపూరిత ఆలోచనలు, ప్రపంచం గురించి తోటి వాళ్ల గురించి కూడా విశాల హృదయంతో ఆలోచించకపోవడం వంటి దుర్గుణాలు మాత్రమే కాకుండా తనను తాను మాత్రమే గౌరవించుకొని అహంభావాన్ని ప్రదర్శించే కుళ్ళు లక్షణాల కారణంగా సమాజంలో మెజారిటీగా సంకుచిత మనస్తత్వం విస్తరించి అనేక వైరుధ్యాలకు కారణమవుతున్నది .ఈ క్రమంలోనే దుష్పరిణామాలు, దురాలోచనలు, అనాలోచిత చర్యలు సమాజంలో విస్తరిల్లిన కారణంగా శాంతియుత సమాజం కేవలం కలగానే మిగిలిపోతున్నది. వ్యక్తితో ప్రారంభమైనటువంటి ఒక ఆలోచన దాని పరిధి ఎంత విస్తృతమైతే యావత్ సమాజానికి అనువర్తింపజేసినట్లయితే అంత విశాల హృదయంతో ప్రపంచం వర్ధిల్లుతుంది.
ఆ సానుకూల దృక్పథం, సదాశయం, మానవీయ విలువలు, ఆలోచన సరళి, అంకితభావం, శ్రామిక మనస్తత్వం, సేవా దృక్పథం, సమాజంలో కలిసి ఇతరులతో పంచుకోవడం, స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉండకపోవడం వంటి లక్షణాలు ఎంత పరిధిలో ఆవరిస్తే అంతస్థాయిలో విశ్వ కుటుంబ భావన పరివ్యాప్తమవుతుంది. ఈనాడు యుద్ధాలు సంఘర్షణలు అమానవీయ సంఘటనలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న స్వార్థపూరిత తరుణంలో విశాల ఆలోచనలకు పదును పెట్టడం మాత్రమే పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో భారతదేశపు మాజీ చీఫ్ జస్టిస్ రమేష్ చంద్ర లహోటి తన భావాన్ని వ్యక్తం చేసిన తీరు నేటి రేపటి సమాజానికి భవిష్యత్తు ప్రపంచానికి ఎంతో దోహదపడుతుందనడంలో సందేహం లేదు." ఆలోచన, సిద్ధాంతము, ఆచరణ రూపము దాల్చినప్పుడు మాత్రమే దాని ఫలాలు సమాజం అందుకుంటుంది. అందుకే ఇలాంటి సందేశాలు సంకేతాలు సూచనలు సామెతలు సూక్తులు భవిష్యత్తు తరాలు ఎప్పుడైనా స్వీకరించాలి."
మాజీ చీఫ్ జస్టిస్ మాటల్లో అర్థం, అంతరార్థం :-
"నాది ఇది నీది అనుకునే వాళ్లది సంకుచిత మనస్తత్వం ఆ హద్దులను అధిగమించిన వారికే ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న భావన కలుగుతుంది. బలపడుతుంది కూడా ". న్యాయ శాస్త్రంలో చట్టాలు ప్రధాన పాత్ర పోషిస్తే న్యాయము మానవీయ విలువలు నైతికత తోటి మనిషిని సాటి మనిషిగా చూసే కనీస వ్యక్తిత్వం కూడా పరిగణించదగిన అంశాలే." న్యాయపరమైన విచారణ, సమీక్షలు న్యాయస్థానాలలో కొనసాగుతున్న సందర్భంలో చట్టానికి లోబడి మాత్రమే విచారణ ఆలోచన చేయకుండా అప్పుడప్పుడు న్యాయమూర్తుల స్థానంలో ఉన్నవాళ్లు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి పరిణతి చెందిన తమ అనుభవాలను, జ్ఞానాన్ని, సామాజిక కోణాన్ని, మానవీయ విలువలను జోడించడం ద్వారా కొత్త విషయాలను సమాజానికి అందిస్తారు. అలాంటి సందర్భమే ఈ పైన తెలిపినటువంటి సానుకూల దృక్పధాన్ని పెంచి పోషించే సూక్తిగా మనం స్వీకరించాల్సి ఉంటుంది." రాజ్యాంగంలోని పీఠికలో న్యాయము అనే అంశం, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు విశాల ఆలోచన పరిధి అనేది ప్రధానమని అర్థమవుతుంది.
"స్వార్థపూరిత యాంత్రిక యుగంలో తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించే అవకాశం లేకుండా పోతున్న సమాజాన్ని యాంత్రికంగానే చూడడం జరుగుతున్నది. కళ్ళ ముందు జరుగుతున్న కటోర సత్యాన్ని కూడా పట్టించుకునే సందర్భాలు లేవు పైగా నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ కూడా ప్రకటించడానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళు కూడా నేరస్తులే అని న్యాయ శాస్త్రం చెబుతుంటే నీది నాది అని స్వార్థపూరితంగా ఆలోచిస్తూ సంకుచిత మనస్తత్వంతో గిరిగీసుకుంటున్న తరుణంలో ప్రధానంగా పేద ప్రజలకు న్యాయం సాధ్యమేనా?" ఆ హద్దులను కనుక చెరిపి వేయకుంటే, విశాల దృక్పథంతో ఆలోచించకుంటే చదివిన చదువు, అధ్యయనం, సామాజిక చింతన పనికిరానిదవుతుంది. స్వార్థపూరిత సంకుచిత మనస్తత్వాలను అధిగమించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన అలబడుతుంది. ఈనాడు ప్రపంచమం ఎంతో విశాలమైనది అయినప్పటికీ అది కు గ్రామములాగా కుంచించుకు పోవడానికి ప్రధాన కారణం స్వార్థమే అని సంకుచిత మనస్తత్వం అని వీరి మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వివిధ రంగాలలో నిపుణులు, సామాజిక తత్వవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, న్యాయ కోవిదులు, విద్యావేత్తలు ఎందరో తమ జీవితాలను దేశం కోసం ప్రపంచం కోసం ఫణంగా పెట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానుభావులు ఎందరో. అలాంటి వారి యొక్క చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా ఆచరణను జీర్ణించుకోవడం ద్వారా విశ్వ మానవ కళ్యాణం మన దైనందిన కర్తవమని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించగలిగే మార్పును తీసుకురావడానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మనకు బ్రతికే అర్హత ఉంటుంది.లేకుంటే జంతువులు పక్షులకైనా ఉన్నటువంటి పరోపకార తత్వం కూడా లేకుండా యాంత్రికంగా బ్రతికితే ఫలమే ము న్నది?
పాఠశాలలు కళాశాలలు విద్యాసంస్థల తో పాటు రాజకీయ శిక్షణ శిబిరాలలోనూ ఉద్యోగ సంఘాల సమావేశాలలోనూ ప్రతి చోటా స్వార్థాన్ని అణచివేయడానికి, విశాల హృదయాన్ని పెంపొందించడానికి, విశ్వ మానవ కుటుంబ భావనను అలవరసడానికి నిరంతరం సమాంతరంగా కృషి జరగాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. యాంత్రికంగా వాణిజ్య ధోరణిలో కొనసాగుతున్న విద్య వ్యాపారంగా మారిన తరుణంలో ఉన్నత తరగతుల వారికి కనీస మైనటువంటి విలువలకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికలు కూడా కను మ రుగవుతున్న వేళ జస్టిస్ రమేష్ చంద్రలహోటి గారి సూచన కారు చీకట్లో కాంతిరేఖ లాగా ఒక స్ఫూర్తిని, ప్రేరణను, దీక్షను ఇస్తుంది అనడంలో సందేహం లేదు. వ్యక్తులుగా ఆలోచిస్తూనే, సమూహాలుగా అవగాహన చేసుకుంటూనే జాతీయస్థాయిలో ఈ బావ న లను విస్తృతం చేసుకోవాలి. ప్రకటనలకు పరిమితమై ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినామనో, మన పోటీ అంతా ప్రపంచం తోనే అనో గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఆచరణలో ఆ విలువలను సాధించాలి. ఆత్మ శుద్ధి లేని ఆచారమదిఏల అన్నట్టు మనిషే ఎదగకుండా ఆర్థిక వ్యవస్థ పెరిగినట్లు చూపెట్టినా కూడా అర్థం లేదు కదా!
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడ, అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)