గాంధీతో గోడు చెప్పకున్న న్యాయవాదులు
➖ ప్రజల వద్దనే జిల్లా కోర్టు ఉండాలని వినతి
జోగులాంబ గద్వాల 12 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కోర్టు సముదాయానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ గద్వాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు.
జిల్లా కోర్టు ఆవరణ నుంచి ర్యాలీగా బయలుదేరిన న్యాయవాదులు గాంధీచౌక్‌కు చేరుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా చూడాలని వారు మహత్మమా గాంధీజీకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గట్టు సురేష్ మాట్లాడుతూ, కొద్దిమంది ప్రయోజనాల కోసం లక్షలాది ప్రజల సౌకర్యాలను పణంగా పెట్టడం సమంజసం కాదన్నారు.
జిల్లా కోర్టు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవాల్సిందేనన్నారు.అనంతపురం గుట్టల వద్ద కోర్టు నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నది అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదని, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు అందుబాటులో ఉండే స్థలం కోసం మాత్రమే తమ పోరాటమని గట్టు సురేష్ స్పష్టం చేశారు.
శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆందోళన కొనసాగుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగుతుందని బార్ అసోసియేషన్ నాయకులు కావాలి నరసింహులు, రాజశేఖరరెడ్డి, ఖాజా మొయినుద్దీన్, రవి ప్రకాష్ గౌడ్, నాగరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, రమేష్, శివప్రియలతో పాటు పలువురు జూనియర్ న్యాయవాదులు ప్రకటించారు.