రాజ్యసభ విధాన పరిషత్ లాగా  స్థానిక సంస్థల్లోనూ  వివిధ రంగాల నిపుణుల నియామకం

Mar 9, 2026 - 04:52
 0  0

రాజ్యసభ విధాన పరిషత్ లాగా  స్థానిక సంస్థల్లోనూ  వివిధ రంగాల నిపుణుల నియామకం.

వాంఛనీయం.చట్టసభలు ఒంటెద్దు పోకడ పోకుండా  కొంతవరకైనా అడ్డుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ నామినేటెడ్ సభ్యులు కూడా  రాజీ పడనంత వరకే.

---  వడ్డేపల్లి మల్లేశం 


భారతదేశంలో చట్టసభలుగా కొనసాగుతున్న గ్రామపంచాయతీ నుండి పార్లమెంటు వరకు  అన్ని సభలలోను  ప్రజా ప్రాతినిధ్యం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉండడం వల్లనే  దేశంలో ఉన్న పరిపాలన ప్రజాస్వామ్యం అని అనబడుతుంది. కానీ  ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన శాసన సభల, పార్లమెంటు సభ్యులు కానీ  పరోక్షంగా ఎన్నికైన  విధాన పరిషత్ రాజ్యసభ సభ్యులు కానీ  దేశ ప్రజల అవసరాలను భవిష్యత్తు సవాల్ల ను పూర్తిస్థాయిలో  పరిష్కరించకపోవడం, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడ మే కాకుండా  ఈ చట్ట సభలకు ఎన్నికైన వాళ్లు కూడా నేరస్తులు నేర ఆరోపణ కలిగిన వారు ఎక్కువగా ఉంటున్న కారణంగా  ఆ సభల యొక్క సభ్యుల ప్రయోజనం పూర్తిగా నెరవేరడం లేదు.   అంతేకాదు  దేశద్రోహులు  జాతీయస్థాయిలో అనేక నేరాలు చేసినటువంటి వాళ్లు కూడా చట్టసభలలో సభ్యులుగా కొనసాగడం వలన  ప్రజలు విశ్వాసంగా జీవించలేకపోతున్నారు  అంతేకాదు ఆ గణాంకాలను పరిశీలించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం లేకపోలేదు.

అందుకే రాజ్యాంగ నిపుణులు చట్ట సభల్లో నిపుణులను నామినేట్ చేయడం వల్ల ఈ అనర్తాలను అడ్డుకునే ఆలోచన చేశారు.  ఎన్నికల వ్యవస్థను నిర్వహించ డానికి ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం ఉన్నప్పటికీ  అడుగడుగునా డబ్బు ప్రమేయం, అవినీతి  చోటు చేసుకుంటున్న కారణంగా   నీతి బద్ధమైన పరిపాలన జాతీయస్థాయిలో  అందడం లేదు .పాలనా సంస్థలకు సమాంతరంగా మేధావులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు,అఖిలపక్షాలు, సామాజిక చింతన కలిగినటువంటి సంస్థలు  పనిచేస్తున్నప్పటికీ  ఈ వర్గాల పైన అణచివేత  కారణంగా కూడా సుపరిపాలన సాధ్యం కావడం లేదు.  ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా మెరుగైన పాలన  అందుతుందని ఒక అనవాయితీ ఉన్నప్పటికీ ఆ ఆనవాళ్లు ఈ దేశంలో లేకపోవడం బాధాకరం. ఎన్నికల యంత్రాంగం నిర్వహణ వరకు సక్రమంగా పనిచేసినప్పటికీ ఎన్నికవుతున్నటువంటి సభ్యులు  ప్రజా దృక్పథం కలిగి ఉండకపోవడం, ఎన్నికల్లో అవినీతి చోటు చేసుకోవడం, అక్రమ సంపాదన కోసమే పని చేయడం,  దేశ సంపదను కొ ల్లగొట్టే విషయం లోపల కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు అక్కడక్కడ  సహకరించడం, పెట్టుబడిదారీ వర్గాల యొక్క  రుణాలను ప్రభుత్వాలు  మాఫీ చేయడం వంటి చర్యల కారణంగా దేశ సంపద కొన్ని వర్గాలకే  అప్పనంగా కట్టబెట్టడం జరుగుతున్నది. ఆ రకంగా  పాలన జరగడాన్ని అడ్డుకునే శక్తులు లేకపోవడమే ఇందుకు  ప్రధాన కారణం. అయితే రాజ్యసభ,  రాష్ట్రాల  విధాన పరిషత్ సభలలో  ప్రజలతో ఎన్నికైన వాళ్ళు కాకుండా వివిధ వర్గాలకు చెందినటువంటి నిపుణులు మేధావులు శాస్త్రవేత్తలు  నామినేట్ చేయబడుతున్నప్పటికీ  వాళ్ల  వాణి అంతగా వినబడడం లేదు, లేదా వాళ్లకు  ఎన్నికైన సభ్యులు అవకాశం  ఇవ్వడం లేదు అని  ఆచరణలో తేలింది.

అయినప్పటికీ  నామినేటెడ్ సభ్యుల యొక్క నియామకం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత  సరళతరం చేయడానికి ఉద్దేశించినది కనుక  ఆ విధానాన్ని గ్రామీణ ప్రాంతపు స్థానిక సంస్థల వరకు కూడా  ఆచరించడం ద్వారా  ప్రజా ప్రతినిధులకు తోడుగా ప్రజాస్వామ్య  విశ్వాసాల పట్ల  ఆసక్తి కలిగినటువంటి బుద్ధి జీవులకు కూడా పాలనలో  భాగస్వామ్యాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. తద్వారా కొంత మేరకైనా మార్పు జరుగు తుంది.


 పాలనా సంస్థలలో నామినేటెడ్  సభ్యుల నియామకం

  కేంద్ర పార్లమెంటులోని ఎగువసభ అయిన రాజ్యసభలో  గరిష్టంగా 250 మంది సభ్యులు  ఉన్నప్పటికీ ప్రస్తుతం 245 మంది సభ్యులకు గాను  23 3 మంది సభ్యులను రాష్ట్రాల ఎమ్మెల్యేలు  పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటుంటే  పరిపాలనను మరింత ఫ లవంతం చేయడానికి, గాడిదప్పిన ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు కట్టడి చేయడానికి అనే ఉద్దేశంతో  రాజ్యాంగ నిబంధన మేరకు 12 మంది  సాహిత్యము, కలలు, శాస్త్రీయత,  సామాజిక సేవ, ప్రజాస్వామ్య దృక్పథం కలిగినటువంటి  వాళ్లను  రాష్ట్రపతి నామినేట్ చేయడం  అనాదిగా కొనసాగుతున్నది.  ఏదైనా ఒక అంశాన్ని  లోక్సభలో ప్రస్తావించిన తర్వాత  తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా తిరిగి అదే అంశం పైన చర్చించడానికి రాజ్యసభ  ఉపయోగపడుతుంది.  రాజ్యసభలో కూడా  తొందరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజా దృక్పథంతో చర్చించినటువంటి సందర్భంలో  ఈ నామినేటెడ్ సభ్యులు మేదో సంపత్తి కలిగిన  వివిధ రంగాల నిపుణులు  ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాన్ని అడ్డుకోవడానికి తమ  మేధస్సును అందించే  అవకాశం ఉంటుంది.కనుక  ఈ విధానం   గ్రామపంచాయతీ వరకు ఉన్నటువంటి పాలనా సంస్థలు అన్నింటిలో కూడా  చట్టబద్ధంగా అమలు చేసే చర్యలకు ప్రభుత్వాలు  చర్యలు తీసుకోవాలి. తద్వారా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మేధావులు బుద్ధి జీవులు, సామాజిక వేత్తలకు కూడా పాలనలో భాగస్వాములయ్యే  అవకాశo ఉంటుంది. 


 తెలంగాణ రాష్ట్రంలో రెండవ సభ అయినటువంటి విధాన పరిషత్ లో  40 మంది సభ్యులు ఉంటే అందులో 1/6   అంటే ఆరుగురు   వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులను గవర్నర్  నామినేట్ చేయడం  జరుగుతుంది.  వీళ్ళ పదవీకాలం కూడా విధాన పరిషత్ సభ్యుల పదవీకాలం  మాదిరిగానే కొనసాగుతుంది. జర్నలిస్టులు రచయితలు సాహిత్య రంగంలో నిష్ణాతులు  శాస్త్రవేత్తలు  సామాజిక సంఘసంస్కర్తలను ప్రధానంగా  నామినేటెడ్ విధానంలోఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో  గ్రాడ్యుయేట్లనుండి  జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు  పోటీ ద్వారా ఎన్నికైన విషయం తెలుసు.  వారు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం ద్వారా  మేధావి యొక్క  చాకచక్యాన్ని సమర్థించుకున్నారు. అలాంటి ఎన్నికైన వారికి తోడుగా మరి కొంతమంది  నిపుణులైన నామినేటెడ్ సభ్యులు గనుక ఉన్నట్లయితే  చట్టసభల పనితీరు రాష్ట్ర అవసరాలు  కూలంకషంగా చర్చించడానికి, గాడి తప్పుతున్న ప్రభుత్వ పాలనను సవరించడానికి ఆస్కారం ఉంటుంది కదా!

.ప్రస్తుతం ఉన్నటువంటి నామినేటెడ్ సభ్యులు  ఏ మేరకు పని చేస్తున్నారు  వాళ్ల వల్ల ఆ మార్పు సాధ్యమా అనే సందేహం కానీ అనుమానాల కానీ రాక మానవు.  అయితే అలాంటి ప్రశ్నించే, సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోతే  ఎన్నికైన వాళ్లలో  ఎక్కువమంది  నిరక్షరాశ్యులు, నేర చరిత్ర గల వాళ్లు,సామాజిక అవగాహన లేని వాళ్ళు ఉన్నప్పుడు  పరిపాలన గాడి తప్పుతుంది అనడంలో సందేహం లేదు. కనుక ఆ రకంగా ఎన్నికైన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు  మేధావులు చట్టసభలకు నామినేట్ చేయబడితే  చట్టబద్ధంగా పోరాడటానికి, నూతన విలువలను  పెంచి పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది.  గ్రామపంచాయతీలు,  మండల పరిషత్తులు,  జిల్లా పరిషత్తులు,  పురపాలక నగరపాలక సంస్థలు  అన్నింటిలో కూడా  ఈ నామినేట్ వ్యవస్థను  ఆవిష్కరించుకోవడం ద్వారా  గాడి తప్పు తున్న నేరపూరిత ప్రజాస్వామ్యాన్ని  పరిరక్షించడానికి కొంతవరకైనా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీసభ్యులు, మైనారిటీవిభాగం వంటి అంశాలలోనే ఆ అవకాశం వుంది. చట్టాసభల మాదిరి నియమించడం కీలకం. రాజ్యాంగ స్ఫూర్తి మాటల్లోనే కాకుండా  ఆచరణలో  అధికారాన్ని బాధ్యతను భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా   కొనసాగించడానికి ప్రయత్నాలు జరగాలి.అక్రమంగా దేశసంపద కొద్దిమందికి అప్పనంగా కట్టబెట్టే బదులు బాధ్యతా యుతంగా పనిచే సే వారికి వేతనాలు ఇస్తే నష్టం లేదు.

( ఈ వ్యాస రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333