గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి.
నిధులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 11 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుంటే వివిధ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను 16వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగంకు రూపొందించాల్సిన జిపిడిపి (గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్), బీపీడీపీ (బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్), డిపిడిపి (డిస్టిక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్)పై జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. గ్రామపంచాయతీలకు వివిధ పన్నుల ద్వారా వచ్చే జనరల్ ఫండ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, దాతల విరాళాలతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పక్కా ప్రణాళిక రూపొందించుకుంటేనే ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయిలో పనిచేసే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర జిపిడిపి రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సబ్ కి యోజన, సబ్కా వికాస్ సైట్ లో జిపిడిపి వివరాలను ఈనెల 30వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. వివిధ జాతీయ పంచాయతీ అవార్డులను పొందేలా గ్రామపంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేసుకునేందుకు జిపిడిపి దోహదపడుతుందన్నారు. ఇటీవల జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీలు జాతీయ పురస్కారాలు పొందేందుకు నిర్దేశిత సూచీలో 90 మార్కులు సాధించి నామినేట్ కావడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు జిపిడిపిల రూపకల్పనలో ఎంపీడీవోల సహకారం తీసుకోవాలని, వారి మార్గదర్శకత్వంలో ముందుకెళ్లాలన్నారు. అధికారుల అలసత్వంతో నిధులు వెనక్కి వెళితే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ వర్క్ షాప్ లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిపిఓ శ్రీకాంత్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఓ ముషాహిదా బేగం, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.