ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జవహర్ నెట్టెంపాడు, నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల వారీగా సంబంధిత గ్రామాల పరిధిలో రైతుల నుంచి చేయాల్సిన భూసేకరణ గురించి కలెక్టర్ క్షుణ్ణంగా మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భూసేకరణ విషయంలో జోగులాంబ గద్వాల జిల్లా వెనుకబడిందని ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆయా మండలాల రెవిన్యూ అధికారులు సర్వే, ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక టీమ్ లుగా ఏర్పడి భూసేకరణ చేపట్టాలన్నారు. భూ సేకరణ అవార్డు పాస్ చేసి పంపిన వెంటనే ప్రభుత్వం రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, సర్వే ఏడి నూకరాజు, ఇరిగేషన్ ఈఈలు సంజీవ్ ప్రసాద్, శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ మండలాల తహసిల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.