శిశు, మాతృ మరణాలపై సమీక్ష సమావేశం.
![శిశు, మాతృ మరణాలపై సమీక్ష సమావేశం.](https://telanganavaartha.com/uploads/images/202412/image_870x_6751b24db02b2.jpg)
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ సిద్ధప్ప అధ్యక్షతన ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో డీఎమ్ హెచ్ ఓ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో "శిశు మరణాలు" మాతృ మరణాలు జరగకుండా ఉండాలంటే వైద్య సిబ్బంది అందరూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు అన్ని రకాల వైద్య సేవలు క్రమం తప్పకుండా అందించాలని సూపర్ వైజర్ లను ఆదేశించారు. అదే విధంగా శిశు మరణాలు జరగకుండా ఉండాలంటే పుట్టిన శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే త్రాగించాలని, ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారము ఇస్తూ తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు తాగించాలని, పిల్లలను చలికాలంలో వెచ్చగా ఉన్ని వస్త్రంతో కప్పి ఉంచాలి. ఐదు సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అదేవిధంగా బాలింతకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్.రిజ్వానా తన్వీర్ మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో శిశువులు ఎవరైనా డయేరియా, నిమోనియా (తీవ్రమైన దగ్గు, వేగంగా శ్వాస తీసుకోవడం, పక్కటెముకలు ఎగరవేయడం, జ్వరము ఎక్కువగా ఉండటం) వ్యాధితో బాధపడుతూ ఉంటే అటువంటి శిశువులను సాధ్యమైనంత తొందరగా జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్. ప్రసూన రాణి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, తల్లిపాల గురించి, అనుబంధ ఆహారం గురించి, చేతుల పరిశుభ్రత గురించి, తల్లితండ్రుల పోషణ గురించి, ఓఆర్ఎస్ ద్రావణం గురించి, జింక్ మాత్రల గురించి, ఐ. ఎఫ్ .ఏ. సిరప్ గురించి, వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత గురించి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కలిగించాలని తెలిపారు. రిపోర్టింగ్ సూపర్వైజర్లు అందరూ రిపోర్టింగ్ ఫార్మేట్లను తప్పనిసరిగా నెలవారి సమీక్ష సమావేశంలో అందజేయాలని తెలిపారు. అనంతరం డిఎమ్ హెచ్ ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు న్యుమోనియా వ్యాధికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్ ప్రసూన రాణి, డాక్టర్ రాజు, డాక్టర్ తన్వీర్ రిజ్వాన, మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కే. మధుసూదన్ రెడ్డి, నరేంద్రబాబు, వరలక్ష్మి, తిరుమలరెడ్డి, శ్యాంసుందర్, రామాంజనేయులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిపోర్టింగ్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.