మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా
జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఎన్నికల చట్టాల అమలుపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం & స్పష్టమైన ఆదేశాలు
మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్., ఆదేశించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., పాల్గొన్నారు.
ఎన్నికల నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్, ఫలితాల అనంతరం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, రిస్క్ ఎలిమెంట్స్‌పై ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టాలని, మున్సిపాలిటీ వారీగా సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజు మాత్రమే కాకుండా, విజేత ర్యాలీలపై కూడా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
అలాగే ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు ఎక్సైజ్ చట్టాలు, మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు తావు లేకుండా చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ప్రణాళికలు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, పోలీసు బలగాల వినియోగం వంటి అంశాలను డీజీపీ కి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల డీఎస్పీ మొగిలయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎలక్షన్ సెల్ ఎస్సై కె.టి. మల్లేష్, డీసీఆర్బీ ఎస్సై సుకూర్ తదితరులు పాల్గొన్నారు.