దేశంలోనే తొలి సంఘటన  500 ఎకరాల్లో 50 వేల చెట్లు నే లమట్టం

Sep 13, 2024 - 09:26
 0  4

వినాయక చవితి శుభాకాంక్షల తో .......

వాతావరణ అసమతుల్యత కారణమని  అటవీ అధికారుల  అభిప్రాయం.

ఇలా జరిగితే 33% అడవుల విస్తీర్ణాన్ని చేరుకోవడం  గగనమే.  మానవ తప్పిదం ఉందేమో  దర్యాప్తు జరిపించాలి.

ప్రకృతి విపత్తే కారణమైతే  జాతీయస్థాయిలో  పరిష్కారం వెతకాలి ములుగు తాడ్వాయి అడవుల్లో అసాధారణ విధ్వంసం..

---- వడ్డేపల్లి మల్లేషము

సహజ అడవులతో పాటుగా  ఖాలీ స్థలాలు  ఇంటిదగ్గర బావుల వద్ద రహదారులకు ఇరువైపున  ప్రభుత్వ బీడు భూములలోనూ  మొక్కలు నాటడం ద్వారా  చెట్ల పెంపకానికి  ఎన్నో అవకాశాలు ఉన్నాయి .సామాజిక అడవుల పేరుతో ముఖ్యంగా ప్రభుత్వ భూములలో పెద్ద ఎత్తున  చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించిన సందర్భంలో పేద  రైతులు కార్మికులకు  ఉపాధి కలిగించిన సందర్భాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేకం.  రహదారులకు పక్కన పెద్ద మొత్తంలో  చెట్ల పెంపకాన్ని ప్రారంభించినప్పటికీ  అక్కడక్కడ విద్యుత్ లైన్ల కింద ఉన్న కారణంగా తిరిగి కొట్టివేయడం జరుగుతూ ఉండడంతో  అడవుల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం.  ఇటీవల ప్రభుత్వ అడవులు కూడా  అక్రమార్కుల  ఆగడాలకు కొంత శాతం బలవుతూ ఉంటే  మానవ అవసరాల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా చెట్లను నరికి వేస్తూ  తమ ప్రయోజనాలకు మాత్రమే  పాకులాడుతున్నారు తప్ప మళ్ళీ తిరిగి చెట్లను పెంచాలనే  సోయి లేకపోవడం కొనసాగుతున్నటువంటి  స్వార్థ ప్రక్రియ . కుంటలు వాగులు, చెరువులలో  అనాదిగా  చెట్లను మనం చూసి ఉన్నాము  కానీ ఇటీవల కాలంలో  నిరంతరము నీటితో నిండి ఉండేటువంటి కుంటలు చెరువులలో ఉన్నటువంటి ముఖ్యంగా తుమ్మ చెట్లు  నిత్యం నీటితో ఉన్న కారణంగా వేళ్ళు  నాని బలహీనమై చెట్లు ఎండిపోతూ  పడిపోతున్న సందర్భాలను కూడా మనం గమనిస్తే  చాప కింద నీరు లాగా ఏరకంగా చెట్ల  శాతం క్రమంగా తగ్గుతుందో అర్థం చేసుకోవచ్చు.  ఏ మేరకైతే అడవుల్లో చెట్లను నరికి వేస్తున్నారో  ప్రజా ప్రయోజనం కోసం వినియోగిస్తున్న సందర్భంలో  అంతకు మించిన స్థాయిలో  అటవీ సిబ్బంది ద్వారా తిరిగి  పెద్ద మొత్తంలో చెట్లను పెంచే ప్రయత్నం చేసినట్లయితే  రాబోయే తరాల కైనా అవి ఉపయోగపడతాయి అని  సమయస్ఫూర్తి నేటి సిబ్బందికి అధికారులకు అలాగే ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది.  ప్రభుత్వ పాలసీ ప్రకారంగా 33 శాతం అడవులు ఉండాలని దేశవ్యాప్తంగా అటవీ విధానంలో  నిర్ధారించినప్పటికీ  ఇప్పటివరకు దాదాపుగా ఏ రాష్ట్రం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదంటే మానవ తప్పిదము, నిర్లక్ష్యము,  అక్రమార్కుల స్వార్థం అంటే అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుసుకోవాలి.  ఇo దుకు సంబంధించి అటవీ అధికారులు ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది పాలకులు కూడా అటవీ అధికారుల  సూచనల మేరకు  అడవుల శాతాన్ని పెంచడానికి తగినటువంటి చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే  పర్యావరణం మనకు దోహదం చేస్తుంది. తగిన స్థాయిలో వర్షాలు కురుస్తాయి వాతావరణం సమతుల్యంగా ఉండడానికి  ఆస్కారం ఉంటుంది  .ఇటీవల 30, 31 ఆగస్టు 1 సెప్టెంబర్  మూడు రోజుల్లోనూ ఆ తర్వాత కూడా  తుఫాను కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలు సుడిగాలి కారణంగా  ఒక్క రోజే 500 ఎకరాల్లో 50 వేల చెట్లు నేలమట్టం అయినట్లుగా  ములుగు జిల్లా తాడువాయి అడవుల్లో జరిగిన సంఘటన  తలచుకుంటే గుండె చెరువు కాక మానదు.  అది మన  అభివృద్ధికి , ప్రకృతి విధ్వంసానికి , పర్యావరణ స్వేచ్ఛకు ఎంతో పెద్ద ఆటంకమని అందరం గుర్తించి  జాతీయ విపత్తుగా  భావిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా  కాపాడుకునే అవకాశం ఉంటుంది .
    . తాడువాయి అడవుల్లో ఏం జరిగింది ?
************
ప్రకృతికి భిన్నంగా భారతదేశంలోనే తొలిసారిగా ములుగు జిల్లా తాడువాయి ,ఎటూరునాగారం ప్రాంతాలలో జరిగినటువంటి అడవుల  విధ్వంసం  ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగించక మానదు.  ఇది  ప్రకృతి సిద్ధమని,  ఇలాంటి సంఘటనలు తప్పవని అనుకుంటే పొరపాటే అవుతుంది  ప్రకృతి సంపద అయినటువంటి అడవులను రక్షించుకునే క్రమంలో ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఆలోచించడం ద్వారా  అడ్డుకునే చర్యలకు భవిష్యత్ కార్యాచరణకు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  ములుగు జిల్లా తాడువాయి అడవుల్లో  31 ఆగస్టు 2024 రాత్రి సుడిగాలులు  భారీ వర్షం కారణంగా  సుమారు 500 ఎకరాల్లో 50 వేల చెట్లు నేల మట్టం కావడం విస్మయం కలిగిస్తున్న  అసాధారణ సంఘటన . .ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే ఆ ప్రాంతాన్ని  రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి తో పాటు  కాలేశ్వరం జోన్ అధికారులు భద్రాద్రి  కొత్తగూడెం అధికారుల  తో కూడిన  కమిటీ  4 సెప్టెంబర్ 2024 నాడు ఆ ప్రాంతాన్ని సందర్శించి  వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడం  దీనికి కావడానికి ప్రధాన కారణమని ఆ బృందం ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. . శనివారం   అడవుల్లో 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అదే  రోజు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో ఏటూరు నాగారం  అభయారణ్యం థా డువాయి అటవీ ప్రాంతాలలో భారీ మొత్తంలో చెట్టు విరిగిపడడం,  మేడారం రహదారికి ఇరువైపులా రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు  చెట్లు విరిగిపడి విధ్వంసం జరిగినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు . కాలినడకన  అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అధికారుల బృందం  కొన్నిచోట్ల చెట్లు విరిగి పడితే మరికొన్ని చోట్ల చెట్లు కూకటి వేల్ల తో సహా  పెకిలించబడ్డట్లుగా గుర్తించారు  .
        అధికారుల బృందం అభిప్రాయాలు
*******
అటవీ ప్రాంతాన్ని  పరిశీలించిన తర్వాత  పిసిసిఎఫ్  అభిప్రాయాలు వారి మాటల్లోనే " 50 సంవత్సరాల భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ కూడా జరగలేదు  భారీ వర్షాలు కురవడం అందుకు సుడిగాలి సహకరించడం  వంటి ప్రకృతి బీభత్సాల కారణంగా  జిల్లాలోని ఏటూరు నాగారం తాడు వాయి గోవిందరావుపేట మండలాల్లోని 500  ఎకరాలలో అడవి ధ్వంశమైనదని   ప్రధాన కారణం కూడా ఇక్కడి చెట్ల వేళ్ళు ఎక్కువ లోతుకు వెళ్లలేకపోవడమే కారణం కావచ్చు అని  ఆయన అభిప్రాయపడ్డారు.  ఫలితంగానే గాలులు వర్షం  ఒత్తిడికి తట్టుకోలేక  చెట్లు నేలపోలినట్లుగా భావిస్తున్నామని  మేఘాలు కూడా భూమికి దగ్గరగా రావడంతో తీవ్రమైన గాలి వర్షం  పడి ఉంటుందని  అది కూడా ఒక కారణంగా భావిస్తున్నట్లు ఆ అధికారి తెలియజేశారు .
      ఏది ఏమైనా జాతీయ స్థాయిలో జరిగిన ఈ సంఘటన జాతీయ విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అదే సందర్భంలో వాతావరణ శాఖ అధికారులతో అటవీశాఖ అధికారులు ప్రభుత్వ  బాధ్యులు  ఈ సంఘటన పైన ఉన్నత స్థాయి దర్యాప్తును ఏర్పాటు చేసి  తిరిగి ఎక్కడ జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని  పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, ప్రజాస్వామి కవాదులు  అభిప్రాయపడుతున్నారు.  ఇలాంటి సంఘటన ఎక్కడ గత 50 ఏళ్లలో భారత దేశంలో జరిగనప్పుడు మరింత లోతుగా పరిశీలిస్తే కానీ  నిజా నిజాలు  తెలియవు.  దీనిని ఒక సవాలుగా భావించి  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం  నివేదికను అందించడం ద్వారా  కేంద్ర ప్రభుత్వబాధ్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే  దీనిని ఒక ప్రత్యేక సంఘటనగా భావించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలుపరిశీలకులతో సమగ్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రకృతి బీభత్సమని, సహజంగా జరిగే ఒక ప్రక్రియ అని  సులభంగా తీసుకుంటే మాత్రం రాబోయే పరిస్థితులు  ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో  అడవుల శాతం 20  మాత్రమే ఉంటే  ఓకే రాత్రి వేల చెట్లు నేల కూలితే ఇక మన  స్థానం ఎక్కడికి దిగజారిందో ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
(  .ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  ) జీ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333