వేముల శ్రీను తెలంగాణ వార్త ప్రతినిధి నకిరేకల్ నల్లగొండ

Jan 23, 2026 - 19:46
 0  1
వేముల శ్రీను తెలంగాణ వార్త ప్రతినిధి నకిరేకల్ నల్లగొండ

పన్ను చెల్లింపు దారుల హక్కుల సంఘం నకిరేకల్ 

నల్లగొండ పట్టణంలో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ విద్యావేత్త కప్పల రమేష్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

"ఇది రాజకీయ ప్రకటన కాదు. ఇది రాజ్యాంగం పేరుతో అడిగే న్యాయమైన ప్రశ్న. దేశ అభివృద్ధి ఖాతాల్లోకి డబ్బులు పోసేది పన్ను చెల్లింపు దారులే. కానీ ఆ పన్నుల భారం మాత్రం పేదలు, మధ్యతరగతి ప్రజలపై మాత్రమే పడుతోంది" అని అన్నారు.

పేదవాడు అన్నం కొన్నా, గ్యాస్ వెలిగించినా, ఔషధం కొనుగోలు చేసినా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉందని, మధ్యతరగతి వర్గం జీతం తీసుకున్న క్షణం నుంచే లోన్లు, బిల్లులు, పన్నులతో నలిగిపోతున్నాడని తెలిపారు.

అయితే కోట్లు సంపాదించే వారికి మాత్రం పన్ను సడలింపులు, మినహాయింపులు, చట్టాల మధ్య దారులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది సమానత్వమా? ఇది రాజ్యాంగబద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.

దేశంలో పేదరికం పెరుగుతున్నదానికి ప్రజలు పని చేయకపోవడం కారణం కాదని, ప్రజల ఆదాయాలను పెంచే అవకాశాలు ప్రభుత్వాలు కల్పించకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ఉద్యోగాలు లేకపోవడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, చిన్న వ్యాపారాలు ఊపిరాడకపోవడం వల్ల యువత తీవ్ర నిరాశకు గురవుతోందని తెలిపారు.

ఈ నిరాశ ఆవేదనగా మారి, చివరకు తీవ్రవాద ఆలోచనలకు దారితీస్తోందని పేర్కొంటూ  ఇది యువత తప్పు కాదని, ఇది పాలనా వైఫల్యమని కప్పల రమేష్ గారు స్పష్టం చేశారు.

డబ్బున్నవాడిని, డబ్బులేనివాడిని ఒకే గాటన కట్టి సమానంగా పన్నులు వసూలు చేయడం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని సృష్టిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా డా. బీ.ఆర్. అంబేద్కర్ మాటలను గుర్తుచేస్తూ

"సమానత్వం అంటే అందరికీ ఒకే భారం కాదు… అందరికీ సమాన అవకాశాలు" అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల హక్కుల సంఘం తరఫున ఆయన కింది డిమాండ్లు ప్రకటించారు:

 కోటి రూపాయలకుపైగా ఆస్తులు ఉన్నవారికి అధిక పన్నులు విధించాలి • మధ్యతరగతికి పన్ను భారంలో తక్షణ ఊరట కల్పించాలి • నిరుపేదలకు పూర్తిస్థాయి పన్ను మినహాయింపు అవకాశం ఇవ్వాలి

ప్రజల ఆదాయాలను పెంచే విధానాలు, రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం ఇవి డిమాండ్లు కాదని, ఇవి ప్రజల హక్కులని ఆయన స్పష్టం చేశారు.

పన్నులు వసూలు చేయడం ప్రభుత్వాల హక్కు అయినా, న్యాయం చేయడం వారి బాధ్యత అని పేర్కొంటూ  ప్రజలను వేదిస్తే వ్యవస్థ నిలబడదని, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తేనే దేశం ముందుకు సాగుతుందని అన్నారు.

ఇది హెచ్చరిక కాదని, ఇది ప్రజాస్వామ్య విజ్ఞప్తి అని పేర్కొన్న కప్పల రమేష్ గారు
ఈ ప్రశ్నలకు పాలకులు సమాధానం చెప్పకపోతే, ఇవే ప్రశ్నలు రేపటి ఉద్యమంగా మారతాయని హెచ్చరించారు.

పన్ను చెల్లింపు దారుల హక్కుల సంఘం నకిరేకల్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333