వృద్ధ తల్లిదండ్రులను, పెద్దలను  చిన్నపిల్లలుగా భావిస్తేనే వారికి భద్రత ఉంటుంది

Aug 22, 2025 - 18:26
 0  6

మాట మాటకు ప o తాలు పట్టింపులకు పోతే  వారిని మానసిక క్షోభకు గురి చేయడమే అవుతుంది. ఆత్మ న్యూనతకు గురై భవిష్యత్తు కానరాక  బలవన్మరణాలు జరగచ్చు.*
**************
--  వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---11....02....2025*********
కేవలం రాజకీయపరమైన అంశాలు  పాలనాపరమైనటువంటి  ప్రజల సమస్యలు ఇక్కట్లు  అసమానతలు అంతరాలు వివక్షత  ఆర్థిక చారిత్రక సాంస్కృతిక అంశాలే కాకుండా  కుటుంబ బంధాలు మానవ సంబంధాల వైఫల్యాలకు సంబంధించి  సామాజిక అంశాలను కూడా ప్రస్తావించుకోవడం సాహిత్య కారుల బాధ్యత.  సామాజిక అంశాలు లేకుండా సాహిత్యం   సంపూర్ణం కాదు ఎందుకంటే ప్రజల హితాన్ని కోరేది,  ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసేది, మానసిక పరిణతికి  తోడుపడేది సాహిత్యం అయినప్పుడు
సామాజిక, వ్యక్తిగత, కుటుంబ పరమైన అంశాలు కూడా సాహిత్యంలో భాగమే .  ప్రధానంగా ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా  దక్షిణాది తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ప్రాంతాలలో ఈ సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య  కుటుంబంలోని పెద్దలు తల్లిదండ్రులు వృద్ధుల పట్ల  వివక్షత చట్టబద్ధంగా కొనసాగించడం. ఒకవైపు పార్లమెంటరీ చట్టాల ప్రకారంగా  వృద్ధ తల్లిదండ్రుల పట్ల ఆత్మీయంగా  పోషణ రక్షణ చేయడానికి చట్టాలు బలంగా ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి కన్న కొడుకులు  కోడండ్లు  దుర్మార్గపు  పద్ధతిలో  హింసించడం, అవహేళన చేయడం,మానసిక క్షోభకు గురి చేయడం,  నీచంగా మాట్లాడడం, బానిసలుగా చూడడాన్ని మనం  నిత్యం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ అంశాల పట్ల ఎవరో ముందు వరసలో నిలబడకపోతే, ధైర్యం చేసి మాట్లాడకపోతే,పరిష్కారాన్ని వెదకకపోతే  ఎంతోకొంత ఊరట వృద్ధులకు లభించే ఆస్కారం ఉండదు. వారిని పలు సందర్భాలలో ఆత్మ న్యూనతకు గురి చేయడం  అవమానించడం అంటే  పరోక్షంగా వారిని ఆత్మహత్యలకు పురి కొ ల్పడమే అవుతుంది.  బలహీనమైనటువంటి సంబంధాల నేపథ్యంలో  కన్న పిల్లలే తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితులలో  ఆ వాదనకు మరింత బలం చేకూర్చే మాదిరిగా కుటుంబ సభ్యులు భార్యా పిల్లలు  వ్యవహరించడం ద్వారా  కుటుంబము నుండి వె లివేసినట్లుగా చూడడాన్ని మనం పసిగట్టవచ్చు.  కొంతమంది ఇప్పటికీ వృద్ధులైన తల్లిదండ్రులను ఇంట్లో ఉండనీయక,    బాధ్యతను మరిచి  ఎక్కడో మారుమూల ప్రాంతంలో విడిచిపెట్టి హాయిగా జీవిస్తున్న వాళ్లను కూడా చూడవచ్చు. ఇక మరికొందరు  పేరుకు ఉద్యోగస్తులు వ్యాపారులు భూస్వాములు అయితేనేమి  ఇంట్లో అవకాశం ఇవ్వకుండా కేవలం వాళ్ల బావి దగ్గర,  వ్యాపార సంస్థలు,  ఇతరుల ఇండ్లలో  ఉంచి తాత్కాలికంగా ఖర్చులు భరించి  వారికి ప్రత్యక్షంగా కొడుకు కోడలు సేవలు చేయకుండా తప్పించుకోవడాన్ని కూడా మనం గమనించవచ్చు.  "నిన్ను కనిపించిన నాడు  పెళ్లి చేసి  సంతోషంగా జీవితం గడపాలని పిల్లలతో హాయిగా ఉండాలని ఆశించిన వాళ్ళు...  అంతకుముందు బాల్యంలో  తాము తిన్నా తినకపోయినా ఉన్నంతలో పిల్లలకు కడుపునిండా పెట్టి  బడికి పంపి పెద్దవాడు కావాలని, ఉద్యోగి కావాలని,కలెక్టర్ కావాలని ఆశపడినందుకేనా ఈ ప్రతిఫలం... ఇంటి నుండి గెంటివేయడం". ఈ దుర్మార్గపు  సంస్కృతి ఇలాగే కొనసాగితే, రోజు రోజుకు బంధాలు మరింత బలహీనమైతే, తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదనే భావనలోకి కొడుకు కోడలు వెళితే  దాని పర్యవసానం వృద్ధులను మానసిక  క్షో భకు గురి చేయడమే. ఆ  బాధను తట్టుకోలేక పరిష్కారం దొరకక  చెట్టో, పుట్టో, చెరువో, వాగో చూసుకొని  లేదా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలోవున్న వేలాది మందిని  మనం గమనించవచ్చు. మన కళ్ళముందే ఎందరో నీటి పాలు, అగ్గి పాలు,  బుగ్గిపాలవుతున్న సందర్భాలు కూడా మనం గమనించని ది కాదు. తన దాకా వస్తే కానీ తెలియదు అనే మాట ఒకవైపు,  తెగేదాకా లాగితే ఏమవుతుందో అనే మాట మరొకవైపు మన అనుభవంలో ఉన్నప్పుడు  మృత్యుముఖంలోకి జారుకున్న తర్వాత "అయ్యో" అని అంటే ప్రయోజనం ఏమున్నది?  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే గాయాలు  కాకుండా ఉంటాయా?                                                  పంతాలు పట్టింపులు మాని చిన్నపిల్లలుగా భావిస్తేనే..
*-**************
  ఎక్కడో పుట్టి వచ్చిన కోడలు కాదు కడుపులోనే పుట్టిన కన్నకొడుకే  తల్లిని తo డ్రిని  నిందించడం, అవమానించడం, తప్పులు పట్టడం, పంతాలు పట్టింపులకు పోయి  లేనిపోని నేరాలు మోపడం  జరుగుతున్న సందర్భంలో  అదంతా వృద్ధుల బాధ్యతనుండి తప్పుకోవడానికే అని చెప్పక తప్పదు."ఆడలేక మద్దెల ఓడింది"అన్నట్లు అయ్యవ్వలతోకయ్యం పెట్టుకోవడం అవసరమా? "మనం చిన్న పిల్లలుగా ఉన్న నాడు చేయరాని నేరాలు ఘోరాలు తప్పులు చేసి ఉన్నాం.  తల్లి కడుపులో తన్నడం ప్రారంభమైన నుండి  కాటికి పోయే వరకు కూడా మనం హింసకు  పాల్పడుతూనే ఉన్నామంటే మనలోఎంత విషo గూడుకట్టుకొని ఉందొ  మనం వెనుదిరిగి చూసుకోవాలి.  చిన్ననాటి మన వెకిలి చేతులకు తల్లి ఏనాడైనా మనలను అవమానించిందా?  ఈ పిల్లవాడు బతకకూడదు అని  నేలకు విసిరి కొడితే నీ ఉనికి ఉండేదా?  నీ భార్య పిల్లలతో  ఇంత బరితెగించి  కు లికే వాడివా ఒక్కసారి ప్రతి వాళ్లo కూడా ఆలోచించుకోవాలి." .ఉన్న కొడుకులంతా వంతుల వారీగా పోషణ చేయడానికి ఒప్పందం చేసుకుంటే అందులో అంగీకరించని వాళ్ళు కొందరు, ఆచరించని వాళ్ళు మరి కొందరు,  మాటలు తీయగా ఉంటాయి చేతలు కటిక చేదుగా ఉంటాయి. "చేతగాని వయస్సులో పిడికెడు మెతుకులు  పళ్లెంలో వేస్తే తిని  పూట గడుపుకోవడానికి ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులతో  పంతాలు పట్టింపులతో వ్యవహరించే బదులు  ప్రేమగా ఆత్మీయంగా  వ్యవహరిస్తే వాళ్ల జీవితం మరికొంత కాలం హాయిగా జరిగేది కదా?  వృద్ధాప్యంలో వాళ్ళు పెద్దగా నీ నుండి ఏమి ఆశిస్తూ లేరు. పిడికెడు మెతుకులతో పాటు ఆదరణ, ప్రేమ, ఆత్మీయత, పలకరింపు,  చేతగాక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఓదార్పు మాత్రమే.  ఈ మాత్రము దానికే  సిద్ధంగా లేక చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేస్తూ,  వయసులో ఉన్ననాటి కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ,  లేనిపోని ఆరోపణలు వృద్ధుల పైన చేయడం ఇటీవల కాలంలో  ఒక హక్కుగా ఫ్యాషన్ గా మారిపోయింది. ఆ దుర్మార్గపు సంస్కృతి నుండి  కొడుకు కోడలు పిల్లలు బయటపడవలసినటువంటి అవసరం ఉంది."  ఇదే సందర్భంలో చట్టాలను గౌరవించడం,  అంతకుమించి తల్లిదండ్రులను ప్రేమించడం  నేర్చుకోవాలి." చట్టాలను సామాజిక నిబంధనలను సహజ న్యాయ సూత్రాలను గౌరవించకుండా ఇష్టమొచ్చినట్టుగా ఒంటెద్దు పోకడలో పోతే సమాజం అయినా  ఆ కుటుంబాన్ని చీ త్కరించాల్సినటువంటి అవసరం ఉంది.అలాంటి సంఘటనలు ఇప్పటికీ అక్కడక్కడా జరుగుతున్నాయి కూడా.నిలదీసి ప్రశ్నించి హెచ్చరించే వాళ్ళు కొంతమంది బుద్ధి జీవులు ఉన్నారు కూడా  అలాంటి వాళ్లతో కూడుకున్నటువంటి స్వచ్ఛంద  కమిటీలను ప్రభుత్వాలు నియమించడం ద్వారా సామాజిక  మానవ  సంబంధాల విచ్చిన్నాన్ని పరిరక్షించడానికి,  రెచ్చిపోతున్న కొడుకు కోడలు పిల్లల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రేమ లేకుంటే  దాని స్థానంలో ధ్వేషo ఆవరించినట్లు  కొడుకులు కోడండ్లు ఆత్మీయంగా పలకరించకపోతే చట్టం కొరడా జులిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా వుంది.  ఏది ఏమైనా  చట్టానికి అతీతంగా ఆత్మీయతలను పంచడం ద్వారా  తమ బాధ్యతలను గుర్తించడమే నిజమైనటువంటి పరిష్కారం అని భావించాలి. ఎందుకంటే తాము కూడా ఒకనాడు ఆ స్థితిలోకి వృద్ధాప్యంలోకి అభద్రతలోకి వెళ్లి పోవాల్సిందే అనే ఇంగిత జ్ఞానం మనకు మధ్య వయస్కులకు ఉంటే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333