ప్రజలు, కార్మికులను రోడ్డుపైకి తీసుకురావడమే ధర్మమా.CPM
జోగులాంబ గద్వాల 20 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల చట్టాలను నిర్విర్యం చేసి ప్రజలను, కార్మికులను రోడ్డుపైకి తీసుకురావడమే బిజెపి చెబుతున్న ధర్మమా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం తో పోరాడి వలసలను నివారించేందుకు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలకు, కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు వామపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు.ఈ చట్టం వల్ల పనికి స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా సమాన పని వేతనం లభించిందని అన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గా అండ్ అజీవిత మిషన్ ద్వారా స్త్రీ పురుష సమానత్వాన్ని నిరోధించిందని అన్నారు. గత చట్టం ప్రకారం ఉపాధి పొందడం ప్రజల హక్కుగా ఉండేదని కానీ నేటి పథకం ప్రకారం అది కేవలం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే విధంగా తయారు చేసిందని అన్నారు. కరోనా,ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారి గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రజలకు పని లభించేదని,అమలు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉండేదని అన్నారు. బడ్జెట్ ను బట్టి కాక డిమాండ్ ను బట్టి బడ్జెట్ ను కేటాయించి పని దినాలను పెంచాలని పోరాటం జరుగుతుంటే నేడు కేంద్ర ప్రభుత్వం దీనిని ఒక పథకంగా మార్చి ప్రజలు కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ సంపదను తన వద్ద కేంద్రీకరించుకొని రాష్ట్రాలపై భారాల మోపడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. పథకం గురించి నీతులు చెప్పే నాయకులు పనిగంటలను పెంచుతున్నామని బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సనాతన ధర్మం గురించి నీతులు చెప్పే బిజెపి నాయకులు ప్రజలకు పని లేకుండా చేసి,చేసిన చట్టాలను నిర్వీర్యం చేసి,ప్రజలను కాలే కడుపులతో రోడ్లపైకి తీసుకురావడమే మీరు ఆచరించే ధర్మమా అని ప్రశ్నించారు.దేశంలో ప్రజలు పోరాటాలతో సాధించుకున్న చట్టాలకు సవరణలు చేస్తూ చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థల అవహేళన చేస్తున్న బిజెపికి పాలించే అర్హత లేదన్నారు.దేశంలో ధర్మం,దేశభక్తి పేరుతో బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని, సంఘటీతంగా పోరాడి ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ,కార్మికులు రంగన్న, నరేష్, కళ్యాణ్, భాస్కర్, బాబన్న,బాలు,గజేంద్ర, రామాంజనేయులు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.