విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన
మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్
జోగులాంబ గద్వాల 3 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల భవిష్యత్తు తరాల కోసం తమ జీవితాలను త్యాగం చేసి మహిళల విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే అని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా విద్యా వ్యాప్తికి అపార కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని జనవరి 3న మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గద్వాల్ జిల్లాను విద్యా, అక్షరాస్యతలో ముందంజలో నిలపడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల జీవితంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మార్గదర్శకత్వమే గుణం, స్వభావం, లక్ష్యసాధనకు బాటలు వేస్తుందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారాని అన్నారు. ఉపాధ్యాయులు బాల్య వివాహాలను నిరోధించి, మహిళా అక్షరాస్యతను పెంచి, ఉపాధి పెంచే విధంగా పని చేయాలన్నారు. ఉపాధ్యాయులు రోల్ మోడల్‌లుగా ఉండాలని అన్నారు. ఒక అమ్మాయి చదువుతో, ఆ గ్రామం మొత్తం విద్యావంతమవుతుందని, విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి, ప్రభుత్వం మహిళా టీచర్స్ డేను నిర్వహిస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం అన్ని రంగాలలో ప్రభుత్వం ప్రోస్తహిస్తుందని అన్నారు. మహిళలకు గౌరవం దక్కే విధంగా ఉపాధ్యాయులు ఫ్యాక్టరీలుగా పని చేస్తే చాలామందికి విద్యను అందించిన వారు అవుతారన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు విద్య ఎంతో అవసరమని, ముఖ్యంగా జిల్లాలోని గట్టు, కేటి దొడ్డి గ్రామాలలో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సావిత్రిబాయి పూలే అనుభవించిన కష్టాలు ఈ రోజులలో లేనందున, భవిష్యత్తులో జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలలో విద్యను వంద శాతం అభివృద్ధి పరచాలని కోరారు. డ్రాప్ అవుట్లు నివారించి, మహిళలను విద్య,ఉపాధి రంగాల్లో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగా రావు, గద్వాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల హనుమంతు, అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడప్ప, జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ గని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.