విత్తనాల కొనుగోలు రైతులు జాగ్రత్తగా పాటించాలి...... వ్యవసాయ అధికారి అనిల్ కుమార్

May 24, 2024 - 19:00
 0  5
విత్తనాల కొనుగోలు రైతులు జాగ్రత్తగా పాటించాలి...... వ్యవసాయ అధికారి అనిల్ కుమార్

మునగాల 24 మే 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

విత్తనాల కొనుగోలులో రైతులు పాటించవలసిన జాగ్రత్తలలో భాగంగా గణపవరం మరియు తిమ్మరెడ్డి గూడెం గ్రామాల్లో రైతులు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి SK ముస్తఫా అవగాహన సదస్సు నిర్వహించారు దానిలో భాగంగా రైతులకు ఈ కింది సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది .

 లైసెన్సు కలిగిన విత్తన డీలర్ల వద్దనే కొనుగోలు చేసుకోవాలి. ఇలా కొనడం ద్వారా ఒకవేళ పంటనష్టం జరిగినపుడు రైతులు వ్యవసాయ ఉన్నత అధికారులను సంప్రదించి ఆ డీలర్ ద్వారా కంపనీ నుండి నష్టపరిహారం పొందవచ్చు.విత్తనాలు ఉన్న సంచులు సరైన పాకింగ్, సీలు మరియు లేబుల్ ధృవీకరణ పత్రంతో ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై విత్తనరకం, ల్యాబ్ నంబర్, గడువు తేది తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకొన్న తరువాత మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత డీలర్ నుండి బిల్లుపై (రశీదు) సంతకం తీసుకోవాలి.హైబ్రిడ్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తనరకం, భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యుపర నాణ్యతను లేబుల్ మీద ఉన్నాయో లేదో గమనించి కొనుగోలు చేయాలి.విత్తనాన్ని దుకాణదారుని నుండి కొనుగోలు చేసిన తర్వాత ఇంటివద్దనే రైతే స్వయంగా విత్తన మొలకశాతాన్ని (కనీసం 75 శాతం ఉండాలి) పరీక్షించుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంటే మాత్రమే పొలంలో విత్తుకోవాలి. ఒకవేళ విత్తనంలో మొలకశాతం తక్కువగా ఉంటే కొనుగోలు చేసిన దుకాణదారుని దగ్గరకు తీసుకవెళ్లి పరిస్థితిని వివరించి ఆ విత్తనాలు ఇచ్చేసి వేరే విత్తనాన్ని తీసుకోవాలి. విత్తనంలో గల లోపాన్ని వివరించిన తరువాత కూడా దుకాణదారుడు సరైన విధంగా విత్తనాన్ని మార్చి ఇవ్వకపోతే సదరు డీలర్పై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా చేసిన యెడల విత్తన పరిహారం పొందే హక్కు రైతులకు ఉంటుంది. పంటకు నష్టం జరిగితే రైతుకు నష్ట పరిహారం రావాలి అంటే, పంట కాలం పూర్తయ్యే వరకు విత్తన బస్తాపై ముద్రించిన ధ్రువపత్రం, కొనుగోలు చేసిన బిల్లును (రశీదును) మరియు విత్తనపు సంచి/ బస్తాను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.పాకింగ్ లేని, సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయరాదు. విత్తనాన్ని కొనుగోలు చేసే క్రమంలో విత్తన సంచి బరువు తక్కువగా అనిపిస్తే డీలర్ ముందు తూకం వేయించి తక్కువగా ఉన్న విత్తనాన్ని డీలర్కు ఇచ్చి కొత్త విత్తనాన్ని తీసుకోవాలి. విత్తనాలను వాటిపై ముద్రించిన MRP ధర కంటే ఎక్కువ ధర కి కొనకూడదు తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయి కదా అని పక్కనే ఉన్న రాష్ట్రాల నుండిగానీ, వాళ్ళు బిల్ ఇచ్చినా కూడా కొనుగోలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా పంట నష్టం జరిగితే పక్కన రాష్ట్రాల నుండి రైతుకు ఎలాంటి నష్ట పరిహారం ఇప్పించడం కుదరదు. విత్తన మొలకథలో, పూత థలో పంటల ఎదుగుదల సరిగా లేకపోతే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు తెలియచేసి క్షేత్రానికి తీసుకవెళ్ళి చూపించాలి.విత్తనం ఎక్కడ తయారీ అయ్యిందో ఏ కంపెనీ వారు పంపిణీ చేసారో, విత్తనం అమ్మిన దుకాణదారుడి ద్వారా తెలుసుకోవాలి.ప్రత్తి విత్తనాలు కొనేటప్పుడూ BT-1 మరియు BT-2 విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది కాబట్టి వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి.BT-3 లేదా రౌండప్ BT విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదు కావున రైతులు ఎట్టి పరిస్తితుల్లో వాటిని కొనకూడదు. ఎవరైనా BT-3 విత్తనాలు అమ్ముతున్నట్లయితే వ్యవసాయ శాఖ అధికారికి లేదా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి.గ్రామాల్లో రాత్రి వేళల్లో, ఎలాంటి బిల్లులు లేకుండా, మధ్యవర్తుల ద్వారా వాహనాల్లో విత్తనాలను అమ్ముతున్నట్లుగా, ప్రయివేట్ వాహనాల్లో విత్తనాలను తరలిస్తున్నట్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారికి లేదా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. ఒక రైతు ఎట్టి పరిస్తితుల్లో వేరే రైతు తెచ్చుకున్న విత్తనాలను లేదా బిల్ లేకుండా వేరే రైతు ఇచ్చిన విత్తనాలను లేదా బిల్ లేకుండా వేరే రైతు ద్వారా తెప్పించుకున్న విత్తనాలను తీసుకోవద్దు. ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ఈ రైతు పేరుతో బిల్ లేకపోవడం వలన ఈ రైతుకి నష్ట పరిహారం రాదు.ఈ కార్యక్రమంలో రోండు గ్రామాలకు సంభందించిన రైతులు పాల్గొనటం జరిగింది .

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State