రాబోయేది ఉద్యమాల యుగమే.
పేదవాడి కోపం పెదవికి చేటు కాదు కలవాడి పదవికి చే టు అనేది నగ్న సత్యం. భయపడితే భయపెడతారు. అదిమి పడితే అంతా విజయమే
---- వడ్డేపల్లి మల్లేశం
కలిసిపోతే బలపడతాo. ఐక్యంగా ఉద్యమిస్తే విజయ తీరాలను చేరుతాము సానుకూల దృక్పథంతో ప్రపంచాన్ని అర్థం చేసుకొని అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తే అందుకు ఆత్మస్థైర్యం తోడైతే అసాధ్యం అనేది లేదు అని విజ్ఞల అభిభాషణ. అందుకే "ఎవరేమన్నను తోడు రాకున్నను ఒంటరిగానే పోరా బాబుకు పో నీ దారి నువ్వే సాగిపో గమ్యం చేరుకో" అన్న సినిమా గీతం యాభై సంవత్సరాల క్రితమే మనకు ఒక సందేశాన్ని ఇచ్చింది. స్వార్థ చింతన పెరిగిపోవడం, ఐక్య ఉద్యమాలకు ఆరాటపడకపోవడం, తమ శక్తిని తామే నమ్మకపోవడం, సంపన్నుల ఆధిపత్యం రోజురోజుకు పెరిగిపోవడంతో బలహీనులు మరీ డీలా పడిపోతూ తోటి పెట్టుబడి వర్గాలకు పాలకులకు బానిసలుగా బ్రతకాల్సి వస్తున్నది. ప్రస్తుత విద్య వైద్య విధానాలు కూడా మనిషిని ఆరోగ్యంగా చైతన్యంగా ఉంచే బదులు లక్షలు కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల కూడా కుటుంబాల ఆర్థిక శక్తి గణనీయంగా తగ్గి కొనుగోలు శక్తి డీలా పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడం మరొకవైపు జరుగుతుంది. ఇదే క్రమంలో కార్మికులు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వాళ్ళు కూడా ఉపాధి కరువై జీవితం బరువై విద్యార్థులు కూడా చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక మార్కుల ఒత్తిడిలో తట్టుకోలేక ర్యాగింగ్ భూతం చేతిలో కూడా నష్టపోతూ మృత్యువాత పడడాన్ని కూడా మనం నిత్యం గమనించాలి. వీటి అన్నింటికీ తోడుగా డ్రగ్స్ పబ్బులు క్లబ్బులు ఈవెంట్లు, మందు ధూమపానం కూడా నేటి యువతను చిన్నాభిన్నం చేస్తూ ఉంటే జనాభాలో అగ్రభాగం చేతికి పోవడం బాధాకరం.
ఈ క్రమము నుండి మేలుకోవ డం కోసం సమాజాన్ని మేల్కొల్పడం మేధావులు బుద్ధి జీవులు సామాజికవేత్తల బాధ్యత అని తెలిసిపోతున్నది. వి చ్చిన్న మవుతున్న సామాజిక జీవితాన్ని కవులు రచయితలు కూడా దారిలోకి తెచ్చే ప్రయత్నంలో అనేక కథలు, కావ్యాలు, వ్యాసాలు, నవలలు, కవితలను రాస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు కళాకారులు కూడా. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమాలు కార్మిక రైతు ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలను కదిలించిన తీరు మనందరికీ తెలుసు. ఎక్కడ ఆవేదన ఆందోళన ఉంటుందో అక్కడ ఆత్మగౌరవం పౌరుషం తెగువ పోరాట స్ఫూర్తి తప్పక ఉంటుంది. కానీ మనం ప్రజలను పీడితులను బాధితులను ఎంకరేజ్ చేసే దృష్టిని బట్టి ఉద్యమాలు ఆధారపడి ఉంటాయి. "ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడి నుండే ఉద్యమాలు రావాలి అప్పుడే ఆ ఉద్యమానికి లోతు వాస్తవము పటిష్టత స్పష్టంగా కనబడుతుంది ఆ పోరాటాలకు ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయి. అలాంటి పోరాట రూపాలకు ఇటీవల కాలంలో కొత్త ఊపు వచ్చిన విషయాన్ని మనం గమనిస్తే బంతిని ఎంత గట్టిగా నేలకు కొడితే అంత పైకి లేస్తుందో అదే మాదిరిగా ప్రభుత్వాల అణచివేత ఎంత బలంగా ఉంటే అంతకు మించిన స్థాయిలో పోరాట స్ఫూర్తి నిలబడుతుందని నిలిచి గెలుస్తుందని మనం అంచనా వేసినప్పుడు మాత్రమే మన ఉద్యమాలు సఫలం అవుతాయి."
రాబోయేది ఉద్యమాలయుగమే-- పేదవాడి కోపం కలవాడి పదవికి చేటు జాగ్రత్త!
ఆదివాసీ ప్రాంతాలలో కోట్లాదిమంది ఇప్పటికి బయటి లోకంతో సంబంధం లేకుండా ఏ సౌకర్యాలకు నోచుకోకుండా అజ్ఞాత జీవితం గడుపుతూ అనామకులుగా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. వారికి ఆరోగ్య విద్యా సౌకర్యాలు రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు వారిని చైతన్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది. తమ అస్తిత్వం భూమి ప్రశ్నార్ధకమైనప్పుడు కచ్చితంగా పోరాటానికి సిద్ధపడతారు ఇటీవల కాలంలో తమ భూమి పైన తమకు హక్కుల కోసం పోరాటాలకు దిగిన సంఘటనలు అనేకం. అదంతా కూడా కాలక్రమ0లో చైతన్యానికి మరొక రూపమే కదా! ఇటీవలి కాలంలో విద్యార్థులు యువత మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త రూపంలో ఉద్యమాలను నిర్మించే ఒక ఆనవా యితే స్పష్టంగా భారతదేశంలో ఏర్పడింది. అది తొలిసారిగా కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఇంస్టాగ్రామ్ లో ఏర్పడి ప్రభుత్వాన్ని కదిలించిన తీరు యువశక్తి మీద మనకు ఆశలు రేకెత్తిస్తున్నవి. "" అవినీతి, అధిక ధరలు, పేదరికము,నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అసమానతలు అంతరాలు, దోపిడీ పీడన, సంపద కేంద్రీకరణ, సామాజిక రుగ్మతల వంటి అనేక అంశాలలో ప్రజలు సామాన్యులు అమాయకత్వంతో సంపన్నుల చేతిలో బలవుతున్నారు. ఆరోగ్యాన్ని కోల్పోతూ అనారోగ్యం బారినపడి మృత్యువాత పడుతూ కుటుంబాలు వీధిపాలు కావడాన్ని గమనిస్తే ఆందోళన ఆవేదన నుండి ఆక్రోషం ఉద్భవించాలి, ధైర్యం దారి తెచ్చుకోవాలి, ఉద్యమ స్ఫూర్తి ఊపందుకోవాలి, బుద్ధి జీవులు మేధావులు సామాజికవేత్తలు పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా!"" ఇటీవల కాలంలో ప్రభుత్వాల యొక్క ఆధిపత్య ధోరణి నియంతృత్వము కొంత ఆందోళనకు గురిచేసినప్పటికీ ఐక్యత అనేది అద్భుతమైన శక్తి అని గడ్డి పోసలతో తాడు తయారు చేసినట్లు ప్రజల ఐక్యత పాలకులను కూడా నిలదీస్తుంది అని చెప్పే అనేక ఉదాహరణలు దృష్టాంతాలు మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్న మాట వాస్తవం కాదా! తల్లిదండ్రులుగా మన పిల్లలకు ధైర్యాన్ని నూరిపోసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడేలా తయారు చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలలో ఉన్న విద్యార్థులకు కేవలం విద్య అభ్యసనమే వాళ్ళ బాధ్యత కాదని సామాజిక స్ఫూర్తిని పెంపొందించుకోవడం సమాజాన్ని తీర్చిదిద్దడం కూడా విద్యార్థుల కర్తవమని బోధించే పద్ధతులు రావాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచి పోషించాలి. పాలకుల బలహీనతలు అసమర్థత నేరాలు అవినీతిని పెంచి పోషిస్తున్నటువంటి అరాచక వాదుల కుట్రలను చే దించడానికి సిద్ధపడితే తప్పకుండా తమ లొసుగులు లోపాలను సవరించుకోవడానికి పాలకులు కూడా తలవంచక తప్పదు. అలాంటి తప్పులను సమాజం ముందు నిలబెట్టాలి దోషులుగా నిగ్గు తేల్చాలి. కోట్లాదిమంది ఎలాంటి నేరం చేయకుండా శిక్ష అనుభవిస్తున్నటువంటి పాశవీక పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నది తీరాదశాబ్దాల తర్వాత నిర్దోషి అని బయటపడితే వాళ్లు అనుభవించిన శిక్షకు పరిహారం ఏది? ఇలాంటి తప్పుడు పద్ధతులకు ఆస్కారమిస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వ విధానాల పైన కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదే స్థాయిలో ""రాజ్యాంగంలోని లక్ష్యాలు ఆదర్శాలు ప్రాథమిక హక్కుల అమలు విషయం లోపల కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రశ్నించకుండా కొనసాగితే అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. రాజ్యము లోసుగులు లోపాలను ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలే పాలకులు ప్రభువులవుతారు"". ఈ సామాజిక వాస్తవాన్ని గుర్తించి యువత విద్యార్థులు ప్రజానీకం చైతన్యవంతమైనటువంటి సమాజం మార్పు దిశగా ప్రజల పక్షాన నిలబడాలి పాలకులను ఎదిరించాలి పాలకులను పశ్చాత్తాప పడేలా ప్రశ్నించినప్పుడు మాత్రమే నూతన భారతావని ఆవి ర్భవిస్తుంది. ఉద్యమాల యుగం ఇది ఉద్యమిస్తే జయం మనదే అనే నినాదంతో అన్ని రంగాలలోనూ ఉద్యమాలు రావాలి ప్రజా సంపదను కొల్లగొడుతున్న వారి పైన ఉక్కు పాదం మోపాలి. అంతిమంగా సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడాలి. అదే కదా మనం ఆశించేది కోరుకునేది." అంతేకాదు విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి అనే ప్రధానమైన డిమాండ్ తో యువత విద్యార్థులు పోరాటం చేయడం ద్వారా దానిని అమలు చేసినట్లయితే రాబోయే కాలంలో సమాజం మరింత చైతన్యవంతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ ప్రయాణం కోసమే నేటి యువత పోరాటాలు దిక్సూచిలా పనిచేస్తాయి, చేయాలి కూడా ."
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)