సంతాప సభలు మొక్కుబడి కాకూడదు మానవ తప్పిదాల సంస్కరణకు కొంతైనా తోడ్పడాలి
జీవిత వాస్తవాలను తప్పులను కరాకండిగా ప్రస్తావిస్తేనే పశ్చాత్తాపం సాధ్యపడుతుంది. ప్రయోజనం లేని ఏ పని అయినా వృధానే కదా!
---వడ్డేపల్లి మల్లేశం
ఆలోచనలు కార్యశీలత ఆచరణ జీవన గమనానికి తప్పని అడుగులు మనిషి పుట్టుకతోనే మంచి చెడు ప్రస్తావన ఉద్భవించి ఉంటుంది. కాకపోతే సైగల తర్వాత మాటలు నేర్చే సంఘజీవనానికి అలవాటు పడి కొన్ని అనుభవాలు గడిచిన తర్వాత కానీ ఈ మంచి చెడులను బేరీజు వేసే శక్తి సామర్థ్యాలు రాకపోవచ్చు. మంచి చెడుల నిర్ధారణ మానవ విలువల నిర్ణయానికి సక్రమ జీవన గమనానికి దారి తీసినది. ఆ క్రమంలోనే కుటుంబ సామాజిక జీవితాల పరిశీలినలో మంచి చెడులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మానవీయ విలువలను కొన్నింటిని ప్రతిపాదించి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళపై దుష్ప్రచారాన్ని కొనసాగించడం ద్వారా చెడును తుంచి మంచిని పెంచే ప్రయత్నం క్రమంగా జరుగుతున్నది. అయితే చెడు వైపే మెజారిటీ ప్రజల ఆలోచనలు స్వార్థ ప్రయోజనాలు తక్షణ ఫలితాలు ఉండడం వలన చెడుపై పోరాటం ఉదృతం చేయక తప్పలేదు. ఆ క్రమంలోనే సమాజంలో సందర్భోచితంగా మంచి చెడుల ప్రమేయం ప్రస్తావన ఉదృతంగా ఊపు అందుకున్నది. వ్యక్తి జీవించి ఉన్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మంచి చెడుల ప్రస్తావన కొనసాగడం అనేది మనిషి మనుగడ కొ లమానానికి నిదర్శనంగా భావించాలి. అందుకే కేవలం ఉనికి కోసమే కాకుండా విలువల కోసం జీవిత సార్థకత కోసం బ్రతికి ఉన్నప్పుడు పనిచేయవలసి ఉంటుంది అని నొక్కి చెప్పే ప్రయత్నాలు ముమ్మరమైనవి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చనిపోయిన తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు విగ్రహాలను ఏర్పాటు చేయడం వారి పేరు న దానధర్మాలు చేయడం శాశ్వత నిర్మాణాలు కొనసాగించడం వంటి నిర్ణయాలు బహుళంగా వ్యాపించినవి. వీటికి తోడుగా సాధారణ కుటుంబాలలో సైతం సంతాప సభలను ఏర్పాటు చేసి వాళ్ల అనుభవాలు జ్ఞాపకాలను కుటుంబ సభ్యులతో పాటు చనిపోయిన వారితో సంబంధం ఉన్నవాళ్లు నెమరు వేసుకుంటూ జీవితం కేంద్రంగా కొంత చర్చ జరగడాన్ని ఇటీవల కాలంలో ఎక్కువగా చూడవచ్చు. ప్రముఖులు రాజకీయ నాయకులు ఉన్నత స్థానాలలో ఉన్న వారికి మాత్రమే ఇలాంటి అవకాశాలు అలవాట్లు ఉండేవి కానీ ఇటువంటి కాలంలో సాధారణ కుటుంబాలకు కూడా వ్యాపించిన ఈ లక్షణం సామాజిక స క్రమ జీవన వ్యాప్తికి, మానవ విలువల పునరుద్ధరణకు, పశ్చాత్తాపానికి, తప్పులను సవరించుకోవడానికి, సక్రమ జీవితాన్ని కొనసాగించడానికి కొంతవరకైనా ఉపయోగపడితే అంతకుమించిన ప్రయోజనం మరొకటి ఉండదు. వేగవంతమైన జీవన గమనంలో మనిషిని మనిషి పలకరించడమే కష్టమైన సందర్భంలో కుటుంబాలలో మాత్రం వివాదాలు, ఘర్షణలు జగడములు, వివక్షత అవమానాలు, ఈసడింపులకు అయితే ఇటీవల కాలంలో కొదవ లేదు .ఇలాంటి దుష్కృత్యాలకు చరమగీతం పాడడానికి సంతాప సభలు ఏమేరకైనా తోడ్పడితే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ముఖ్యంగా సామాజికవేత్తలు మానవతావాదులు సామాజిక ప్రశాంతతను కోరుకునే బుద్ధి జీవులు సాధారణ ప్రజలు కూడా ఇటీవల కాలంలో ఈ వైపు మొగ్గు చూపడాన్ని అభినందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది
.మొక్కుబడి వద్దు-- సంస్కరణలే ముద్దు :-
"చనిపోయిన నుండి ఏదో ఒక రూపంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకాలను నె మ రు వేస్తూ వారి పేరు న కొంత మందికి అన్న దానం చేస్తూ 10 నుండి 12 రోజుల మధ్యన కుటుంబ సభ్యులు తమ బంధుమిత్రులను స్నేహితులను ఇరుగుపొరుగు వారిని పిలిచి చనిపోయిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. చివరి రోజున కానీ లేక మధ్యలోనైనా చనిపోయిన వాళ్లను స్మరించుకోవడానికి వాళ్ల మంచి చెడులను ప్రస్తావించడానికి కుటుంబ సభ్యులతోనూ సమాజంలోని భిన్న వర్గాలతోనూ వారికి ఉన్నటువంటి సంబంధాన్ని చర్చించుకోవడానికి ప్రవర్తించిన తీరు వ్యక్తిత్వము మనస్తత్వము పైన 10 మంది సభ్యులు కలిసి మాట్లాడుకోవడం సంతాప సభల పేరుతో నిర్వహించుకోవడం కేవలం మొక్కుబడిగా కాకుండా ప్రయోజనకరంగా లోపాలను సవరించుకునే పశ్చాత్తాప సందర్భాలుగా తోడ్పడితేనే ఈ సభలకు అర్థం ఉంటుంది. " కానీ చనిపోయిన వారి గురించి అతిగా పొగడడం మాత్రమే ఈ సభల ఉద్దేశం కాకూడదు. కొన్ని లోటుపాట్లు మంచి ప్రవర్తన పరోపకార ఆలోచన ఇరుగుపొరుగుతో సంబంధాలు వారి నుండి నేర్చుకోవాల్సిన లక్షణాలు నిర్మోహమాటంగా చర్చించడంతోపాటు పదిమంది నోళ్ళలో నానడానికి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత మరింతగా గుర్తింపు రావాలంటే వాళ్లలో లోపించిన లక్షణాలను కూడా నిర్మోహమాటంగా సభలకు హాజరైన వాళ్ళు చర్చించినప్పుడు మాత్రమే మానవ జీవితానికి అత్తవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒకరితో మరొకరు పోల్చుకోవడానికి స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగా ఒక వ్యక్తి ప్రవర్తనను చర్చించడం అంటే మామూలు విషయం కాదు. కొందరు బాధపడే సందర్భము మరికొందరిలో దుఃఖం ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ నిర్మోహంగా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పించగలిగితేనే ఈ సభలు ప్రయోజనకరంగా ఉంటాయి. హాజరైన వాళ్ళు కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులు ఎవరైతే నేమి తమ తమ పొరపాటు గుర్తించి మార్చుకోవడానికి వీలుంటుంది. కొందరు అదే సందర్భంలోనే తమ లోపాలను ప్రస్తావించి చనిపోయిన వారిలో ఉన్నటువంటి గుణగణాలను ప్రశంసించడం ద్వారా మానసిక పరివర్తనకు దోహదపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాప ప్రసంగాలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాల వంటివి కూడా నిర్వహించడం ద్వారా పుట్టుకతో పాటు చావు కూడా అనివార్య మైన సన్నివేశమని అది కూడా అర్థవంతంగా ముగిసిపోవాలని ఆ రకంగా పదిమంది సమక్షంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తులే నిజమైనటువంటి అర్హులని ఇలాంటి సభలకు మనం మరింత వన్నె తేవడానికి పూనుకుంటే తప్ప వీటి ప్రయోజనం శూన్యమే. అహంకారము గర్వం స్వార్థము తప్పిదాలను కూడా పక్కనపెట్టి మంచిని ప్రశంసించడం లోటుపాట్లను ప్రస్తావించడం నిర్మోహమాటంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది.ఇక కుటుంబ సభ్యులు చనిపోయిన వారితో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ప్రస్తావించడం ద్వారా వారు చూపిన బా ట ఏ రకంగా తమ ఎదుగుదలకు దోహ దపడిందో ప్రస్తావించడంతోపాటు తమ పిల్లలను కూడా అదే బాటలో తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. మంచి అంత తొందరగా వ్యాపించకపోవచ్చు కానీ చెడు మాత్రం తొందరగా ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అందుకే చెడును సమూలంగా నిర్మూలించడానికి, దూర తీరాలకు పారదోలడానికి, మంచిని విశ్వ వ్యాప్తం చేయడానికి ఇలాంటి సందర్భాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా లోతుగా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో కన్న తల్లిదండ్రులను కుటుంబ సభ్యులు సరిగా పోషించకుండా, గుర్తించకుండా, గౌరవించకుండా, అవమానించి, ఇబ్బందులకు గురిచేసిన తీరును కూడా నిర్మోహమాటంగా చర్చించడం ద్వారా తమ తప్పిదాలకు కుటుంబ సభ్యులు తలవంచుకునేలా చేయడం కూడా ఈసంతాప సభల యొక్క ఉద్దేశం కావాలి .
సభ్య సమాజానికి విజ్ఞప్తి :-
సంతాప సభలు అంటేనే డబ్బున్న వాళ్ళు సంపన్నులు ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని అనుకునేవాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కానీ వ్యక్తిత్వం మానవత్వమే కొలమానం కానీ సంపద డబ్బు కొలమానం కానేకాదు వ్యక్తి జీవితానికి. ఈ ప్రాతిపదికన ఇలాంటి సంతాప సభలను ప్రతి కుటుంబంలోనూ సభ్యులు చనిపోయినప్పుడు నిర్వహించుకోవడం ద్వారా మన లోపాలను మంచిని చర్చించుకోవడానికి ముందు వరుసలో నిలబడాలి కానీ తమ తప్పులు బంధువులకు ఇరుగుపొరుగుకు తెలుస్తాయని అనుకోకూడదు. అప్పుడే మనం నిజమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతాము లేకుంటే మన లోపాలను దాచుకోవడానికి తప్పులను తెలవకుండా ఉంచడానికి మన దుర్మార్గాలను ఇతరులకు తెలవకుండా దాచడానికి మాత్రమే మనం ప్రయత్నిస్తున్నట్లుగా లోకం అనుకుంటుంది. అయితే ఇరుగుపొరుగు లోకం బంధువులు అందరికీ కూడా ఆ కుటుంబ సభ్యుల యొక్క లక్షణాలు ప్రవర్తన తెలుసు. " భవిష్యత్తులోనైనా తమ కుటుంబ సభ్యులు అలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా తప్పుడు విధానాలను ప్రోత్సహించకుండా మానవతా విలువలతో తోటి మనిషిని సాటి మనిషిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల పైన ప్రేమ అనురాగము ఆత్మీయత ఆదరణ చూపడానికి వ్యక్తులకు శిక్షణ ఇచ్చే వేదికగా కూడా ఈ సంతాప సభలు ఉపయోగపడాలి. ఆ రకమైన సంఘసంస్కరణ ఆశించే వాళ్ళందరూ కూడా ఈ సభలను ప్రోత్సహించడం నిర్మోహమాటంగా ప్రస్తావించడం ద్వారా అడుగంటుతున్న మానవ విలువల పునరుద్ధరించడానికి తోడ్పడుతారని ఆశిద్దాం. "
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )