కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల వీరేశం ధ్వజం
అధికారం పోయినా అహంకారం తగ్గలేదు
నకిరేకల్ 06 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కొద్దిసేపటి క్రితం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ "కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒంటి నిండా అహంకారంతో మాట్లాడినట్టు ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. పాలనకు పనికిరారని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా మీకు అహంకారం తగ్గలేదు" అని ధ్వజమెత్తారు.
"వరంగల్‌లో శృతి ఎన్‌కౌంటర్ చేసింది నువ్వు కదా. ‘వరి వేస్తే ఊరి’ అని చెప్పింది మీరు కాదా? రుణమాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేస్తే, మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి చూపించింది. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చిన ఘనత మీదే" అని విమర్శించారు.
"కేసీఆర్ ఒక్కనాడైనా అసెంబ్లీకి వచ్చారా? ప్రజా సమస్యల మీద మాట్లాడారా? సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే నువ్వు మంత్రివి అయ్యావు. లేకుంటే ఏమయ్యేవాడివి? ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. దొర అహంకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నడూ క్షమించదు" అని అన్నారు. "రామారావు నువ్వు పెద్ద డ్రామా రావు. అధికారం లేక పిచ్చి కూతలు కూస్తున్నావు. నేడు మేము ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి నల్ల చట్టం వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది" అని ఆయన పేర్కొన్నారు.