భూమి ఉన్న రైతులకు రైతు భరోసా, పంటకు బోనస్ ఇస్తున్నారు.
భూమిలే ని పేదలకు ఏ మిస్తున్నారు గుండుసున్న తప్ప. మిగులు భూమి పంపిణీ చేసి నిబద్ధత రుజువు చేసుకోవాలి. యాచకులుగా మార్చద్దు.
---వడ్డేపల్లి మల్లేశం
ఎన్నో ఆదర్శాలు వల్లించి కొన్ని ప్రజల కోసమే చట్టాలు చేసినట్లుగా నటించి ప్రజల్లో ప్రచారం చేసుకోవడమే తప్ప అవి కార్యరూపం దాల్చడం గగనం అవుతున్నది. చట్టాన్ని అమలు చేయమని పోరాటం చేయడం కంటే అమల్లో ఉన్నటువంటి హక్కులను హరించి వేసే క్రమంలో వాటిని కాపాడుకోవడం కోసమే పోరాటం చేయవలసి రావడం ఈ దేశంలో ప్రజల దౌర్భాగ్యం. ప్రజలు పోరాడకుండా ఉద్యమాలను అణిచివేయడం ద్వారా తా మిచ్చిన హామీలను తప్పించుకోవడానికి పాలకులు పన్నుతున్న పన్నాగం కూడా ఇది. ఏదో కావాలని ఏడుస్తున్న పసిపిల్లవాడికి భయపెట్టి దండించే ప్రయత్నం చేస్తే తన డిమాండ్ ను ఉపసంహరించుకొని ఏడవనని హామీ ఇచ్చినట్లు ప్రజలు పోరాటాలకు దిగితే అమానుషంగా నిర్బంధాలు విధించడంతో అనివార్యమైన పరిస్థితులలో తమను తమ కాపాడుకోవడం కోసం ఉద్యమాలను విరమింప చేయడం అనే దమన నీతి ఈ దేశంలో కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1973లో భూ పరిమితి చట్టం ద్వారా భూసంస్కరణలను అమలు చేసే ప్రయత్నం పేరుతో విస్తృత ప్రచారం జరిగినప్పటికీ ఆ అమల్లో అనేక లోపాల కారణంగా మిగులు భూమిని నిర్ధారించలేదు దానిని ఇతర పేద వర్గాలకు పంచినది కూడా లేదు అక్కడో ఇక్కడో కొన్ని ఉద్యమాల ద్వారా సంపాదించుకున్నది తప్ప. భూస్వాములు పెట్టుబడిదారులు జమిందార్లు తమకున్నటువంటి వందలాది ఎకరాల భూమిని పాలకుల మద్దతుతో తమ వారి పేరున చేసుకుని కాపాడుకున్న తీరు కారణంగానే మిగులు భూమి నిర్ధారించి పంపిణీ జరగలేదు. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పేరుతో అనేక దఫాలుగా ఉద్యమాలు జరిగినప్పటికీ 2014లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఉద్యమ భావజాలం గల విద్యార్థి పోరాటాలు ప్రజా పోరాటాలు సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ ఆ నినాదములో భూమి అనేది చోటు చేసుకోకపోవడం విచారకరం. హామీని ఇవ్వలేదు కనుక భూ పంపిణీ చేయవలసిన అవసరం లేదని సమర్ధించుకోవడానికి అవకాశం దక్కినట్లు ప్రధానమైన భూమి సమస్య అంత ప్రాధాన్యత కలిగిన అంశం పైన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దృష్టి సారించలేదు. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి అనే నె పంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ ఒక్క చోట కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవు నామమాత్రంగా తప్ప. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ప్రయోజనం ఏమిటి? మిగులు భూమిని నిర్ధారించి పేద వర్గాలకు పంపిణీ చేయాలి అనే ధ్యాస తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా లేకపోతే ఉమ్మడి పాలకులకు వీళ్లకు తేడా ఏముంది? ఈ తప్పులను స్వార్థ ప్రయోజనాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సంపదను కొన్ని వర్గాలకు కొంతమందికి బడా భూస్వాములకు కట్టబెట్టే క్ర మములో భాగంగా టిఆర్ఎస్ హయాంలో రైతుబంధు కార్యక్రమం చేపట్టి భూస్వాముల జేబులు నింపిన సంగతి మన అందరికీ తెలుసు. రోడ్లకు, గుట్టలకు, రహదారులకు కూడా రైతుబంధు పంపిణీ జరిగింది అంటే ప్రజా సంపద కొల్లగొట్టినట్లే కదా! అదే క్రమంలో భూమిలేని నిరుపేదలు మా సంగతి ఏమిటి అని ప్రశ్నించినప్పుడు దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పలేదు. భూమున్నవాడికి అదనంగా ప్రభుత్వ నిధులను పంపిణీ చేసినప్పుడు భూమి లేని పేద వర్గాలకు మీ వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తారు కదా ఆ ప్రశ్న ఆనాటి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఆ తర్వాత కూడా కొనసాగుతున్నది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు కానీ భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రం కొన్ని కిస్తులు తప్పిన వాళ్ల ఖాతాలలో నిధులు మంజూరు కావడాన్ని గమనిస్తే ఈ ప్రభుత్వం కూడా అంతో ఎంతో ఉన్నవాడికే సహకరిస్తుంది కానీ భూమి లేని వాడికి బుక్కడు అన్నం కూడా పెట్టని దౌర్భాగ్య పరిస్థితులను ఏమందాం? అలాంటప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ స్వరాష్ట్రానికి తేడా ఏముంది? లేనివాడు లేనట్లే ఉన్నవాడు ఆకాశానికి ఎదగడం ఖాయం అన్నట్లే కదా!
భూ పోరాటాలు రావాల్సిందే :-
ఈ దేశంలో సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడాలి అనే నినాదంతో భూమిలేని రెక్కల కష్టముతో బతుకుతున్నటువంటి నిర్భాగ్యులు భూ పోరాటాలకు ముందుకు రావాల్సిందే. విద్యా వైద్యం సామాజిక న్యాయం ఈ దేశంలో ఏ రకంగా ఎండమావిగా మిగిలిపోయిందో భూ పంపిణీ కూడా ఆచరణకు నోచని హామీగా మిగిలిపోవడం విచారకరం. ఈ రెండు డిమాండ్లు పరిష్కరించబడినప్పుడు ముఖ్యంగా రైతులు కార్మికులు పేదవర్గాలు దినసరి కూలీల వెతలు తగ్గే అవకాశం ఉంటుంది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు ఏదో స్వయం ఉపాధి పేరుతో పనులు చేసుకొని బ్రతుకుతూ తమ పిల్లలను చదివించుకోలేక వైద్య సౌకర్యం పొందలేక అరకొరగా సంపాదించిన ఆదాయంలో అగ్ర భాగం ఖర్చులకే పోతుంటే కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గి ఈ దేశంలో పేదరికం మరీ పెరిగిపోతుంటే పాలకులు తమకేమీ బాధ్యత లేనట్లు ఈ ప్రజలు తమ దేశ పౌరులు కానట్లు వ్యవహరించడం అంటే ఉన్నత వర్గాల కొమ్ము కాయడమే. సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడే పోరాటం ఉద్భవించినట్లయితేనే సమస్య మూలాలు దొరు కు తాయి. పరిష్కారానికి పాలకుల పైన ఒత్తిడి తీసుకు వస్తే తప్ప స్వయంగా పట్టించుకునే దాఖలాలు లేవు. ఉద్యోగులు కూలీలు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళువిద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా తమ హక్కుల రక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు .అదే మాదిరిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పండించిన పంటకు బోనస్ పేరుతో ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది కానీ ఇచ్చిన హామీ మేరకు భూమి లేని వాళ్లకు ఒక్క నయా పైసా కూడా చెల్లించడం లేదు. ప్రధానంగా వాళ్ళకు కావాల్సింది భూమి కానీ చేతి బిచ్చం అవసరం లేదు. చైనా మాదిరిగా కాకుండా ఈ దేశంలో భూమి ప్రైవేటు యాజమాన్యంలో ఉండడం సంపన్న వర్గాల ఆధిపత్యంలో భూమిని ప్రభుత్వాలు రక్షించడం భూమిలేని నిరుపేదల గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వాళ్లని ఈ దేశ ప్రజలుగా గుర్తించకపోవడం ఏ రకంగా సబబు పాలకులు ఆలోచించాలి. కడుపు నిండిన వాడికి ముద్దలు కలిపి పెట్టి ఆకలితో కడుపు ఎండిన వాడికి ఆశ చూపించడం లాగా ప్రభుత్వ విధానం ఉంది. ఈ పరిస్థితులలో భూమిలేని కార్మికులు నిరుపేదలు ఈ దేశ పౌరులుగా ప్రజాసంపదలో భాగస్వాములుగా భూమిని డిమాండ్ చేయడం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైతు చట్టాలను పోరాడి రద్దు చేయించిన రైతులకు వుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో 10లక్షల భూమి స్వాదినంచేసుకొని ప్రజలకు పంచిన అనుభవం వుంది. అదే స్ఫూర్తితో ఒకవైపు ఆదివాసులు తాము అనాదిగా చేస్తున్నటువంటి సాగు భూములను తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ కొనసాగించడం ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ ఉన్నప్పటికీ ఆచరణలో మోసగించడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మిగులు భూముల పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా సంపద సృష్టించడంలో తమ బాధ్యత కొనసాగుతుందని ప్రభుత్వాలకు స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పనంగా దేశ సంపదను వివిధ రకాల పథకాలతో కట్టబెట్టే బదులు భూమి పంపిణీ చేయడం ద్వారా పంట ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. దున్నేవాడికే భూమి అని నినాదం అమల్లో ఉన్నప్పటికీ అది అనుకున్న స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి కూడా భూమి కలిగిన భూస్వాములు కూలీల ద్వారా తమ పనులను తీర్చుకుంటూ సంపద పైన మాత్రం వాళ్లే అధికారం కలిగి ఉంటే అనేక సందర్భాలలో పేదలు అప్పులపాలై తమకు ఉన్నటువంటి అంతో ఇంతో చిన్న కమతాలను కూడా అప్పు కింద కోల్పోయి తమ భూమిలో తామే కూలీలుగా మారవలసి వచ్చిన పరిస్థితులు ఈ దేశ దౌర్భాగ్యానికి అద్దం పడుతున్నాయి. ""ప్రజలందరి బాగోగులు చూడాల్సినటువంటి ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అందించడంతోపాటు మిగులు భూములను నిర్ధారించి అందుకు సంబంధించిన స్పష్టమైనటువంటి చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలందరికీ భూములు చట్టబద్ధంగా కట్ట పెట్టినప్పుడు మాత్రమే పాలకులు తమ సామాజిక బాధ్యత నిర్వహించినట్లు. భూ పంపిణీ జరిగితే ప్రజలందరికీ హక్కులు లభిస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆదాయం వస్తుంది. పాలకుల పైన ఆధారపడకుండా తమ స్వయంకృషిని నమ్ముకుని ఉత్పత్తులు పెంచుతారు ప్రభుత్వాలకు చేదోడు వా దోడుగా ఉంటారు." ఏనాడో భూములను కొన్ని తప్పుడు విధానాల ద్వారా తమ సొంతం చేసుకున్నటువంటి భూస్వాముల నుండి శాస్త్రీయంగా తగిన ఆధారాల ద్వారా మిగులు భూమిని గుర్తించడం ద్వారా మాత్రమే భూమిలేని నిరుపేదలకు భూమిని పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. దీనిని ఒక సామాజిక బాధ్యతగాపాలకులు, భూస్వాములు గుర్తించినప్పుడే సహకరించినప్పుడే అందరికీ భూమి అనేది కార్యరూపం దాలుస్తుంది. అయితే పేదలు భూమిలేని కార్మికులు డిమాండ్ చేయకుండా పోరాటాలకు కార్యరూపం ఇవ్వకుండా ప్రభుత్వాలను కదిలించకుండా పాలకులే భూమిని చేతిలో పెడతారు అనుకోవడం అత్యాశ అవుతుంది. బాధ్యతలకు నిలబడడం ద్వారా హక్కుల కోసం కలబడినప్పుడే అది నిజమైన పౌర ఉద్యమం అవుతుంది. ఇప్పటికే ఈ దేశంలో సంపద, భూమి కొద్ది మంది చేతుల్లోనే నిక్షిప్తమై ఉంది ఇది నిజంగా రాజ్యాంగం లోని నియమాలకు విరుద్ధం. విరుద్ధమైనటువంటి సంపద కేంద్రీకరణ నేడు చట్టబద్ధమైనది అంటే ప్రస్తుత ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లే కదా! ప్రజలందరికీ ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉచిత సామాజిక న్యాయాన్ని అందించవలసిన కర్తవ్యం ప్రభుత్వాలపైన ఉంది. అందుకు ప్రధానమైనటువంటిది ఈ దేశంలో భూ సమస్య.
"భూమిని పంపిణీ చేయడం ద్వారా భూస్వామ్య ఆగడాలను అధిగమించడానికి, అందరికీ ఉపాధి కల్పించడానికి, సమానత్వాన్ని సాధించడానికి వీలు పడుతుంది. రాజ్యాంగంలోని ప్రవేశికలో సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం మాట బలంగా వున్నా ఆచరణలో చూపకపోతే పాలకులు తమ నిబద్ధతను మరిచినట్లే .""
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )