చికిత్సలకు మాత్రమే కాదు  ఆరోగ్య పరిరక్షణ  సలహాలకు కూడా  అవసరమైన వైద్యుల సంఖ్య తప్పనిసరి

Oct 1, 2026 - 08:13
 0  0

.పేద దేశాల్లో  దుష్పరిణామాలకు తోడు  వైద్యుల సంఖ్య లోపించడం, అల్ప  బడ్జెట్  అనారోగ్య హేతువు కాదా?

-- వడ్డేపల్లి మల్లేశం

భయంకరమైన రోగాలు చుట్టుముట్టడంతో  పాటు  అనారోగ్య పరిస్థితులు,  సరైన వైద్య సౌకర్యాలు సిబ్బంది డాక్టర్లు లేకపోవడం,  అందుకు తగిన మందులు  సౌకర్యాల కల్పన కోసం  సరైన స్థాయిలో బడ్జెట్ కేటాయించకపోవడం  పేద దేశాలతో పాటు పెద్ద దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తున్న సమస్య. అయితే అంతో ఇంతో సంపన్న దేశాలు  ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుంటే  అల్పాదాయ అత్యంత పేద దేశాలు మాత్రం  కనీస జీవన ప్రమాణాలకు  సరిపోని బడ్జెట్ కారణంగా వైద్య రంగానికి ఆశించిన స్థాయిలో  కేటాయించకపోవడం పేద దేశాలలో విపత్ పరిణామాలకు  కారణమవుతుంది.  సంపదను సృష్టించడం ద్వారా  పేద దేశాలు కూడా  ఆర్థికంగా బలోపేతం కావడం లో భాగంగా  ఆరోగ్య వైద్య రంగానికి పెద్ద పీట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.  వాతావరణంలో వస్తున్నటువంటి  పరిణామాలు తద్వారా దుష్ప్రభావాలు  మనిషి ఆరోగ్యం పైన ప్రధానంగా  ప్రభావాన్ని చూపుతున్నాయి.  దానికి తోడుగా  క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గడం  అందుకు కారణమైనటువంటి కల్తీ  ఎరువులు పురుగు మందులు ఆహార పదార్థాలను వినియోగించడంతోపాటు  నిత్యజీవితంలో ఆహార పదార్థాలు కూడా కలుషితం కావడం  వ్యాపార ప్రయోజన రీత్యా కల్తీ కి పెద్దపీట వేయడంతో  పాలకులు కూడా ప్రతిఘటించలేని దుస్థితిలో ప్రజల ఆరోగ్యం  చిన్నాభిన్నమవుతున్న విషయం తెలుసు. నిలువ ఉంచినటువంటి ఆహార పదార్థాలు  ఉప్పు కలిపిన పదార్థాలు  తో పాటు అనేక రోజులుగా నిలువ ఉంచినటువంటి మాంసాన్ని  దొంగ చాటుగా అక్రమ రవాణా తో  అమ్మడం వలన  ఎంతోమంది ప్రజలు అనారోగ్యం బారిన పడక తప్పడం లేదు.  ప్రతిరోజు ఇలాంటి కల్తీ కి సంబంధించి అనేక ప్రసారాలను  ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేస్తున్నప్పటికీ  కల్తీ నూనె, ఎముకలతో తయారు చేసిన నూనె  చిరుతిన్లు, ఆహార పదార్థాలు,  నెయ్యి  అల్లం ఎల్లిగడ్డ పేస్ట్  కారం వంటి వాటిలో ప్రాణాంతకమైనటువంటి  వాటిని కలిపి లాభసాటి వ్యాపారం చేస్తున్నవారికి పాలకవర్గాలు  చురుకు పెడితే కదా  వాళ్లు  ప్రజల గూర్చి ఆలోచించేది. కల్తీ సామ్రాజ్యాన్ని కూలదోసేది.  ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి  ప్రలోభాలు రాజ్యమేలుతుంటే  ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించడం వలన ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనేక రోగాల బారిన పడి  లక్షలాది కుటుంబాలు చిన్నా చిన్నామవుతున్నాయి.  మనిషి తన స్వార్ధ ప్రయోజనం కోసం పర్యావరణాన్ని పరిసరాలను  ఇష్టం ఉన్నట్టుగా వాడుకోవడం  అధిక వాహనాల వినియోగం   ప్లో రో క్లోరో కార్బన్ల విడుదల  వాతావరణం అతిగా వేడెక్కడం వంటి  చర్యల కారణంగా కూడా ఆరోగ్యాలు  అభా సు పాలవుతున్నాయి.
    ఆరోగ్యకరమైన జీవన విధానాలకు  భిన్నంగా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిన కారణంగా కూడా  అనేక రోగాలు చుట్టుముట్టి 
పరిష్కారం లేని సమస్యలుగా  మిగిలిపోతున్నాయి. వీటికి తోడు  సరైన సంఖ్యలో వైద్యులు  ప్రభుత్వ రంగంలో అందుబాటులో లేకపోవడం  ఉన్న కొద్ది ప్రభుత్వ వైద్యశాలల్లో  సిబ్బంది  అరకొరగా ఉండడం  ప్రైవేటు ఆసుపత్రుల్లో  రోగాల చికిత్సకు భారీగా ఖర్చు కావడంతో పేద మధ్యతరగతి  వర్గాలకు తలకు మించిన భారం అవుతూ  కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గి పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు.  ఈ పరిస్థితులలో కొన్ని గణాంకాలను,  వైద్య రంగాన్ని సంస్కరించాల్సిన పరిస్థితులను కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా  ఏ రకంగా ఉందో పరిశీలిస్తే  తదనుగుణంగా  సిబ్బందిని, వైద్యశాలలను, అవకాశాలను, బడ్జెట్ను  అధిగమించడానికి  వీలు ఉంటుంది.

 కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం

 రోగాల నుండి కాపాడడానికి, చికిత్సలు అందించడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి,  అంతే స్థాయిలో ప్రజలను జాగృతం చే యడానికి తగిన స్థాయిలో వైద్య సిబ్బంది  కీలకం.   పాలకులు ఎప్పుడూ విద్యా వైద్యానికి అరకొరగా సిబ్బందిని బడ్జెట్ను కేటాయించి  తమ నిర్లిప్తతను చాటుకుంటున్న పరిస్థితులలో  భారతదేశం వంటి మధ్యతరగతి  అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు దిగువ   అల్పాదాయ  దేశాలలో ఏ మేరకు  డాక్టర్ల సంఖ్య అందుబాటులో ఉందో  అరకొర సిబ్బంది మధ్యన  ఎంత వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో  పరిశీలించవలసి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు 2026 నివేదిక ప్రకారంగా  2022లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 మంది ప్రజలకు సగటున 1. 9 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఈ సగటుతో పోల్చుకుంటే పేద అల్పాదా య దేశాల్లో వైద్యుల సంఖ్య మరింత తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం .పేద మధ్య  తరగతి దేశాలతో పోల్చుకుంటే సంపన్న దేశాలలో  ప దిరెట్టు ఎక్కువగా వైద్యులు ఉన్నట్లు  ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పొందుపరిచినది. వివిధ దేశాలలో ప్రతి వెయ్యి మంది  ప్రజలకు  సేవలందిస్తున్న డాక్టర్ల సంఖ్యను  ఒక్కసారి పరిశీలిద్దాం .
1)అల్పాదాయ దేశాలలో  డాక్టర్ల సంఖ్య  3.8 
2)మధ్య ఆదాయ దేశాలు        ""             2.5
3)  దిగువ మధ్య  ఆదాయ దేశాలలో  '"  0.7
4)అల్పాదాయ అతిపేద దేశాలు  "         0.4
    పై గణాకాలను పరిశీలించినప్పుడు  ఆదాయ వనరులు అధికంగా ఉన్నటువంటి దేశాలు తమ బడ్జెట్లో వైద్య రంగానికి  ఎక్కువగా కేటాయించడం వలన  ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సిబ్బంది  ఎక్కువగా ఉంది.  అల్ఫాదాయ దేశాలలో  కనీసమైన అవసరాలకు  నిధులు లేని కారణంగా వైద్యానికి కేటాయించలేని దుస్థితిలో  వైద్యుల సంఖ్యతో పాటు అవకాశాలు కూడా దారుణమే. ఈ లెక్కన పోల్చుకుంటే దిగువ మధ్యఆదాయ దేశముగానే భారతదేశాన్ని చూడవలసి వస్తుంది. వైద్యుల సంఖ్య  ఎక్కువగా ఉన్నట్లయితే అవసరమైన చికిత్సలతో పాటు  కౌన్సిలింగ్  రోగులకు ప్రత్యేకమైనటువంటి  శిక్షణ  ఆహార పదార్థాల యొక్క  వివరణ  ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడానికి సంబంధించి పరిజ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది.  కేవలం అల్లోపతిక్ విధానంలోనే కాకుండా ఆయుర్వేద హోమియో యునాని రంగాలలో కూడా  వంటిల్లును ఔషధశాలుగా మార్చుకోవడంతోపాటు  జీవనశైలిలో పెను మార్పులను  అందిపుచ్చుకుంటే  ప్రకృతిలోని  చెట్లు ఆకులు మూలికల్లో ఉన్నటువంటి శక్తిని  గ్రహించగలిగితే  రోగాలను రాకుండా అరికట్టడంతో పాటు  నివారణ కూడా సులభతరమవుతుంది. అలాంటి పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దానిని వినియోగించుకోవడం ద్వారా కూడా ప్రజలు  కొంత చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఉంది. పాలకులు కూడా  విద్యతోపాటు అంతకుమించిన స్థాయిలో వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం,  భారీ నిధులను మంజూరు చేయడం,  సిబ్బందికి హెచ్చు వేతనాలు ఇవ్వడం ద్వారా  ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా  తీర్చిదిద్దడం వల్ల  ఆరోగ్యానికి రక్షణ లేదు అనే అభిప్రాయం నుండి ప్రజలు  ఏ రాత్రి పగలైనా మాకు డోకా లేదు అని  ఆత్మస్థైర్యంతో ఉండే పరిస్థితులను కల్పించినప్పుడే  మానవ వనరులను కాపాడుకోవడానికి ఆరోగ్యంగా భావితరాలను తీర్చి దిద్దే  అవకాశం ఉంటుంది.  ప్రతి విషయంలోనూ ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించకపోతే పాలకులే  నిర్ణయాలు తీసుకుంటారని ఆశించడం  అత్యాశ అవుతుంది. పోరాటాలు లేకుండా  ప్రశ్నించకుండా పాలకులు ఎప్పుడూ కూడా  ప్రజల గూర్చి అంత తొందరగా పట్టించుకోరు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333