బి.సి ల కోసం బి.సి న్యాయవాదులు పోరాడాలి

ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్
సూర్యాపేట బార్ లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ
బి.సి హక్కుల కోసం చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు పోరాడాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు. బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యపేట బార్ అసోసియేషన్ లో బార్ ప్రధానకార్యదర్శి డి మల్లయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగా జనాభా కలిగిన బి.సి ప్రజలను ఇంకా మనుషులుగా గుర్తించడం లేదని, జనగణన కోసం 70 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ బి.సి జనాభా లెక్కలు చేయడం లేదని, జనాభా లెక్కలు చేయకుండా బి.సి లకు రిజర్వేషన్లు పెంచి కోర్టులల్లో వీగిపోయేలా చేస్తున్నారని అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన తర్వాత ఇప్పటికీ జనగణన జరగలేదని, కుల జనగణన, చట్టసభల్లో బి.సి వాటా సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కుల జనగణన - ఒబిసి ల అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు - సామాజిక న్యాయం, మహిళా కోటాలో బి.సి మహిళా వాటా, బి.సి ఓటర్ల బానిసత్వం - పాలక వర్గాల ధోరణి అనే నాలుగు అంశాలపై ప్రముఖులైన బి.సి కమీషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణ మోహన్, కర్ణాటక హై కోర్టు న్యాయవాది ఎస్ బాలన్, పూనే న్యాయవాది వాసంతి నల్వడా, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ న్యాయవాది వినాయక్ ప్రసాద్ లాంటి వారు ఈ సదస్సులో బి.సి ల స్థితిగతులు, భవిషత్ ఉద్యమం పట్ల ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యపేట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి మల్లయ్య మాట్లాడుతూ దేశంలో దోపిడీకి గురవుతున్న మెజార్టీ సమాజం ఐక్యతతో ముందుకు సాగినప్పుడే హక్కుల సాధించవచ్చని ఆ దిశగా ఐ ఎల్ పి ఎ చేస్తున్న కృషి చాలా గొప్పదని అన్నారు. ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు ఒబిసి న్యాయవాద సదస్సులో న్యాయవాదులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది హస్సేన్ మాట్లాడుతూ బహుజన సమాజంలో మెజార్టీ ప్రజలైన బి.సి హక్కుల కోసం ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని నివేదికలు సమర్పించినా, ప్రధాన రంగాలైన న్యాయ వ్యవస్థ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో నేటికీ బి.సి లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయ సమరంలో న్యాయవాదులు ముందుండాలని, బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారి వాటా వారు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు మాధవ కృష్ణ, పూస మల్లేష్, భిక్షమయ్య, సూర్యాపేట న్యాయవాదులు టి హాసేన్, రేగటి శంకరయ్య, వి సత్యనారాయణ పిళ్ళై, కాకి రాంరెడ్డి, కొంప్లెల్లి లింగయ్య, కోక రంజిత్ కుమార్, బి అనిల్, ఎల్ సుభాషిణి, చందన, అశోక్, అనిల్ కుమార్, సుధాకర్, పరమేష్, బాగాల నరసింహ, బి వెంకట్ రత్నం, ఎ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు