ప్రశాంతంగా ఎన్నికలు సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు ఈరోజు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహేశ్వరం జోన్, ఎల్బినగర్ జోన్, మల్కాజిగిరి జోన్, భోంగిరి జోన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్టు తెలిపారు. రాచకొండకు సంబంధించిన ఆరువేల మంది పోలీసు సిబ్బంది తోపాటు 2500 మంది అదనపు కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు విధులను నిర్వర్తిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
ముందస్తుగా తీసుకున్న భద్రత చర్యల వల్ల పకడ్బందీ ఏర్పాట్ల మూలంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని పేర్కొన్నారు. రాచకొండ ఐటీ సెల్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియను నిష్పాక్షికంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి ఎన్నికల అధికారులతో కలిసి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
కమీషనర్ గారి వెంట ఆయా జోన్ ల డీసీపీలు... యాదాద్రి భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర ఐపిఎస్, ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ సునీత, ఏసీపీలు మరియు ఇతర అధికారులు ఉన్నారు.