విత్తనాలు కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం
జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్
జోగులాంబ గద్వాల 25 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి తమ పొలంలో నాటినప్పుడే మంచి పంట దిగుబడులు వస్తాయని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. శనివారం గద్వాల మండలం చెనుగోనుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన ఆధీకృత డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విడిగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయరాదని, సంబంధిత కంపెనీ లేబుల్ ఉన్న ప్యాకెట్లను కొనాలని తెలిపారు.
కొనుగోలు చేసిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను, బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకుంటే ఒకవేళ నకిలీ విత్తనాల కారణంగా దిగుబడి రానప్పుడు సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి గురించి రైతులు, ఇతర పౌరులు ఎవరైనా సరే సమాచారం ఇస్తే వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ యంత్రాంగం సహాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాలు నాటితే పంట కోసం నాలుగైదు నెలలు పొలంలో కష్టపడి ప్రయోజనం ఉండదన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యవసాయ అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమానికి వచ్చిన రైతులందరూ తమ గ్రామంలోని మిగతా రైతులకు కూడా ఇక్కడ తెలియజేసిన అంశాలు చెప్పి అందరూ మంచి పంటలు సాగు చేసుకునేలా సహకరించాలని కోరారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు విత్తనాల కొనుగోలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, ఏ డి ఓ సంగీతలక్ష్మి, ఏవో ప్రతాప్ కుమార్, ఏఈఓ లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.