ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

Aug 23, 2025 - 18:50
 0  7
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు 
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

 సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశంలో జిల్లా  కలెక్టర్ బి.యం.సంతోష్ 

  జోగులాంబ గద్వాల 23 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల  ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నందున జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెన్స్, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కృష్ణా నది (బీచుపల్లి), జమ్మి చెడు, నది అగ్రహారం, జూరాల  పరీవాహక ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనం రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. సోమవారం రోజు అధికారులందరూ క్షేత్రస్థాయిలో సందర్శించుకుని ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు.  ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు ముదిరించిన పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించాలి అనే పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

    జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి చెరువుల కొండలు నిండుగా ఉన్నాయని, నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా చెట్లకు తొలగించాలని అన్నారు. నిమజ్జనం స్థలాల వద్ద బ్యారికేడ్ లతో పాటు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్ - నబీ పండుగలు ఒకేసారి వస్తున్నందున ముందస్తు చర్యలలో భాగంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు. 

      సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏఓ భూపాల్ రెడ్డి, డి.ఎస్.పి మొగులయ్య, జిల్లా వైద్యాధికారి సిద్ధప్ప, ఇరిగేషన్ అధికారి శ్రీనివాసరావు, మత్స్య శాఖ అధికారి షకీలా భాను, విద్యుత్ శాఖ అధికారి తిరుపతిరావు, తహసిల్దార్లు ఆర్ అండ్ బి, ఫైర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------------------------------

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333