పట్టపగలే ఇళ్లల్లో వరుస చోరీలు.. పోలీసుల అదుపులో నిందితులు
జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కేటీ దొడ్డి:-పట్టపగలో ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన జోగులాంబ జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని యర్సన్‌దొడ్డి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని రైతులు ఆదివారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరిన మల్లయ్య, కుర్వ కిష్టప్ప, రాజు, తదితర ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో దాచి ఉంచిన బంగారు అభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు గుర్తించారు.ఈ మేరకు వారంతా కలిసి కేటిదొడ్డి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్సై శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్‌టీం సాయంతో వేలి ముద్రలను సేకరించారు. కాగా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అనుమానస్పదంగా తిరుగులాడుతుండగా గ్రామస్తులు ఆ వ్యక్తిని విచారించారు. గతంలో జిల్లాలో గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడిన నిందితులు (కుర్వ మహేష్) ఇంకో వ్యక్తి ఇద్దరు యర్సన్‌దొడ్డి గ్రామంలో చోరీకి పాల్పడినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోని నిందితుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.