ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.
లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: అదనపు కలెక్టర్ మధుమోహన్.
జోగులాంబ గద్వాల 20 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని చెనుగోనుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రైతులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి నిర్దిష్టంగా సమీపంలోని మిల్లులను కేటాయించి, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యమును లారీల్లో తరలించాలన్నారు. కేంద్రాల వారీగా అవసరాన్ని అంచనా వేసి సరిపడా గన్నీ సంచులను పంపిణీ చేయాలని సూచించారు. రిజిస్టర్లలో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు, మిల్లులకు రవాణా చేసిన వివరాలు, ఫోన్ నంబర్లు, తదితర తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి రోజూ కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలు, తేమ శాతం వచ్చిన పరిమాణం, పంపిన లోడ్ల వివరాలను నమోదు చేసి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే అధికారిక వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేసి సంబంధిత ఉన్నతాధికారులతో తక్షణ పరిష్కారం పొందాలని ఆయా కేంద్రాల ఇన్చార్జిలకు, అధికారులకు సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షం పడితే తడవకుండా సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు టార్పాలెన్స్ కప్పి వెళ్లాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, అవకతవకలకు పాల్పడితే సంబంధిత కేంద్రాల ఇన్చార్జిలు, అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ తనిఖీలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్, ఏఈఓ ఉషశ్రీ , ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
............................................