తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో హిజ్రాల వీరంగం
రెండు గ్రూపులుగా విడిపోయి విచక్షణ రహితంగా దాడి చేసుకున్న హిజ్రాలు.
సినిమాను తలపించిన హిజ్రాల ఘర్షణ.
తుంగతుర్తి :మర్చి18 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రెండు హిజ్రాల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.తుంగతుర్తిలో తిరుగుతూ ప్రతి దుకాణంలో యాచిస్తూ ఒక హిజ్రాల గుంపు జీవనం సాగిస్తున్నారు.
కానీ హోలీ పండుగ సందర్భంగా మరొక హిజ్రాల గుంపు తుంగతుర్తికి వచ్చి యాచిస్తుండడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది.
దీంతో రెచ్చిపోయిన హిజ్రాలు వీరంగం సృష్టించారు. విచక్షణ రహితంగా ఒక గుంపు పై మరో గుంపు దాడి చేసుకున్నారు. ఈరోజు సోమవారం సంత కావడంతో మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు వారం సరిపడా సరుకులు, కూరగాయలకు తుంగతుర్తి కి వచ్చి తీసుకెళ్తారు. ఈ కిటకిటలాడుతున్న జనం మధ్య హిజ్రాల గుంపులు వీరంగం సృష్టించడంతో విస్తుపోయి తదేకంగా చూశారు. వారు చేసుకునే వాగ్వాదం, వారి చేష్టలు చూస్తూ ముక్కున వేలేసుకున్నారు. అనంతరం రెండు గుంపులు పోలీస్ స్టేషన్ కు చేరుకోగా పోలీసులు వారిని మందలించి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. వారిని శాంత పరిచేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పని అయింది. ఆ తర్వాత రెండు గుంపులు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.