తిరుమల లడ్డు కల్తీ అపచారంలో..
బిజెపికి భాగస్వామ్యం ఉన్నట్టేనా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.. టీటీడీ లడ్డు కల్తీ దురదృష్టకరం..
ఈ ఘటనపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలి..బాధ్యులను కఠినంగా శిక్షించాలి.. పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.. కేంద్రంపై బండి సంజయ్ ఒత్తిడి తీసుకురావాలి..
బిజెపి తరఫున టీటీడీ మెంబర్లుగా వ్యవహరించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించే బాధ్యత బండి సంజయ్ తీసుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ కరీంనగర్..
తిరుమల తిరుపతిలో లడ్డు కల్తీ జరగడం అత్యంత దురదృష్టకర మని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమలలో లడ్డు కల్తీ కావడం, దీనికి సంబంధించిన అపచారంలో బిజెపికి భాగస్వామ్యం ఉన్నట్టేనా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయని ఆరోపించారు.
సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ వ్యవహారం జరగడం దుర్మార్గమైన చర్యగా దుయ్యబట్టారు. గతంలో టిటిడి పాలకమండలి సభ్యులుగా 24 మందిని, ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని, నలుగురిని ఎక్స్ ఆఫీసియో మెంబర్లుగా నియమించారని చెప్పారు. ఇందులో ఎక్కువ శాతం కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్య మంత్రులు, బిజెపి నేతలు సిఫార్సు చేసిన వారిని నియమించారని ఆరోపించారు. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి, ఇతర సరుకుల కొనుగోలు ప్రక్రియ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తుంటారని, వారికి దానిపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. పర్యవేక్షణ లేకుండా కల్తీ వస్తువులతో లడ్డులు తయారు చేయడం దారుణమని పేర్కొన్నారు. టిటిడి బోర్డు మెంబర్లకు తెలియకుండా లడ్డు కల్తీ ఎలా జరిగిందో, దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అంటగాగిన విషయం ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలిలో బిజెపి వాళ్లే ఎక్కువ శాతం ఉన్నారని, నెయ్యి, ఇతర సరుకుల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాల్లో వీరిదే కీలక పాత్ర ఉంటుందని ఆరోపించారు. లడ్డు తయారీలో ఏమేం వాడుతున్నారో.. నాణ్యతగా తయారు చేస్తున్నారా.. లేదా.. పర్యవేక్షించాల్సిన బాధ్యత టిటిడి బోర్డు మెంబర్లకు ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. కనీసం దానిపై దృష్టి పెట్టకపోవడం అత్యంత దురదృష్టకరమని చెప్పారు. లడ్డు కల్తీ సంబంధించిన అపచారానికి బిజెపి పెద్దలు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా.. అని ప్రశ్నించారు. లడ్డూల తయారీలో నాణ్యత ప్రమాణంలో పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుందని పేర్కొన్నారు. ఆ సోయి అప్పటి అప్పటి వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం, బిజెపి పెద్దలకు లేకపోవడం వల్లే ఇలాంటి వ్యవహారం బయటకు వచ్చిందని తెలిపారు. భక్తుల ప్రజల మనోభావాలతో బిజెపి వాళ్లు ఆటలాడుకోవడం ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ లడ్డు కల్తీపై స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా, ఈ వ్యవహారంపై విచారణ త్వరగా జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఆ సమయంలో బిజెపి తరఫున టీటీడీ పాలకవర్గ సభ్యులుగా వ్యవహరించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించే బాధ్యత బండి సంజయ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డు కల్తీ వ్యవహారంలో వారి నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ఆరోపించారు. బండి సంజయ్ బిజెపి అధిష్టానంతో ఇలా చేయించే దమ్ము.. ఉందా అని ప్రశ్నించారు. దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని సూచించారు. లడ్డు కల్తి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర స్థాయిలో విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూనూ చివరకు కల్తీ చేయడం నీచమైన చర్య అని మండిపడ్డారు. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రముఖ ఆలయాల్లో లడ్డూలు, ప్రసాదం తయారీలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఘటన జరిగిన తర్వాత బాధపడడం కాకుండా, ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు. తిరుమలలో లడ్డు కల్తీ లాంటి ఘటనలు ఇకముందు రాబోయే రోజుల్లో జరగకుండా కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.