జూరాల వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:-మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల వరద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కర్ణాటకు జలాశయాల నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి వచ్చి చేరుతోంది. మంగళవారం మధ్యాహ్నం కర్ణాటక లోని ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 96,781 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 1.16లక్షలు క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 125.47 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.35లక్షల క్యూసెక్కులు ఉండగా.. 25 గేట్లు తెరవగా.. అవుట్‌ఫ్లో 1.41 లక్షల క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ 29.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కర్ణాటక జలాశయాల నుంచి
జూరాలకు భారీగా వరద ప్రవాహం పెరగడంతో పాటు జూరాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 1,80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా జూరాల 39 గేట్ల తెరిచి దిగువకు 1,58,925 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.651 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 30,148 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, క్యూసెక్కులు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 485 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జూరాల నుంచి 1,91,534 క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.