జిల్లాను గంజాయి, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు.
జోగులాంబ గద్వాల 29 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాను గంజాయి, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఐ డి ఓ సి లోని తన ఛాంబర్ లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు నార్కోటెక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల సరఫరా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్ ను విక్రయించకుండా పూర్తి నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై జూన్ చివరి వారంలో ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మత్తు పదార్థాలను ప్రజలు వినియోగించకుండా, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఆర్.డి. ఓ రామ్ చందర్, డి. ఎస్. పి సత్య నారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, డీ. డబ్ల్యు. ఓ సుధారాణి, ఎఫ్.ఆర్.ఓ. దేవరాజు, డి.సి.పి.ఓ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.