జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
జోగులాంబ గద్వాల 10 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. గురువారం ఐ.డి.ఓ.సి ఆవరణలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాలలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ గౌరీమాత పూజ నిర్వహించి, బతుకమ్మ వేడుకలను అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు రంగు రంగుల బతుకమ్మలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రజల బ్రతుకులు బాగుండాలని గౌరమ్మ తల్లిని వేడుకుందామన్నారు. మన పండుగ, మన సంస్కృతి ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక ఈ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకైక పండుగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ పండుగ మన వారసత్వాన్ని కాపాడే గొప్ప పండుగ అని అన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల అనంతరం, జిల్లా కలెక్టరేట్‌కు చెందిన మహిళా అధికారులు సంతోషంగా బతుకమ్మలను చేతబెట్టుకుని కలెక్టరేట్ కార్యాలయం నుండి తేరుమైదాన్‌కు వెళ్ళడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, ఆర్.డి.ఓ రామ్ చందర్, వివిధ జిల్లా శాఖల అధికారులు, మహిళ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.