చెత్త పై పన్నును ఉపసంహరించుకోవాలి:సిపిఎం
జోగులాంబ గద్వాల 16 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పట్టణం పట్టణ సంస్కరణల లో భాగంగా మునిసిపాలిటీలో ప్రజలపై చెత్తపై పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలను మోపుతున్న పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒకవైపు నిత్యవసరాల వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు ప్రజలకు ఉపాధి లేక ఆదాయాలు తగ్గి కొనుగోలు శక్తి తగ్గుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆదాయాలను పెంచవలసింది పోయి గోరుచుట్టుపై రోకలి పోటుల వారిపై అదనపు బారాలు మోపడం సరైనది కాదన్నారు, పట్టణ ప్రజలకు ఏ మౌళిక సదుపాయాలు కల్పించారని ప్రజలపై పన్నులు వేస్తున్నారని ప్రశ్నించారు,పట్టణం లో విపరీతంగా ఆక్రమణలు పెరిగాయని, దోమల బెడద వల్ల ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగితూ తమ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఇప్పటికి అనేక వార్డ్ లలో రోడ్లు, మంచినీరు, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకోవడానికి సేకరించిన చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చి ఆదాయంగా మార్చుకోవచ్చని,దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నును వసూలు వంటి తదితర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని,అంతేకాని ప్రజలపై భారాలను మోపి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు, పట్టణంలో అనేక మంది అక్రమార్కులు ప్రభుత్వ భూములను, 10% భూమిని దర్జాగా ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారని వారి వైపు కన్నెత్తి కూడా చూడని అధికార యంత్రాంగం పేద ప్రజలపై మాత్రం ఏదో ఒక రూపంలో సంస్కరణ ల పేరుతో దోపిడికి గురి చేస్తున్నదని ద్వజమేతారు,ఇప్పటికే వివిధ రకాల పన్నుల ద్వారా ప్రజలపై భారాల మోపుతున్న అధికార యంత్రాంగం మళ్లీ చెత్త పన్ను విధించి, ప్రజల నుంచి 60 నుంచి 100 రూపాయలు వసూలు చేయడం సరైనది కాదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధత విధానాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికే వలసలు వెళ్తున్నారని, అటువంటి సమయంలో ఈ అదనపు పన్నులతో వారి ఆర్థిక స్థితి మరింత దిగజారే పరిస్థితి వస్తుందని అన్నారు ప్రజలు సంఘటితమై తిరుగుబాటు చేయకపోతే వీధిదీపాలపై, రోడ్లపై, మనిషి చనిపోతే పుడ్చే స్మశాన వాటికపై కూడా పన్నులు వేస్తారని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ వెంటనే చెత్త పై పన్ను రద్దు చేసే విదంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.చెత్త పై పన్నును ఉపసంహరించుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని విస్తృత స్థాయి ఉద్యమానికి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్మన్, BS కేశవ్,మేనేజర్ ఎల్లారెడ్డి కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ,నాయకులు వెంకటేష్,రంగన్న, రామకృష్ణ, కళ్యాణ్, వీరేష్, గోకరన్న, అశోక్, నరేష్, కృష్ణ, పరమేష్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.