చెట్టును ఢీకొట్టిన కారు ఇద్దరు యువకులు మృతి
ఇద్దరికీ తీవ్ర గాయాలు
వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన గురువారం మధ్యాహ్నం సూర్యాపేట సమీపంలోని రాయిని గూడెం గ్రామ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజుగారి తోట హోటల్ దాటిన తర్వాత రాయినిగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి 65 రోడ్డుపైన కేతేపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ చింతపల్లి ధనుష్ సూర్యాపేట వైపు నుండి కేతేపల్లి కి వెళ్ళుచు కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన గల చెట్టుకు బలంగా ఢీకొట్టడం జరిగింది. కారు ప్రమాదానికి గురవడంతో కారులో ప్రయాణిస్తున్న విద్యార్థి జటంగి సాయి(17)అంతటి నవీన్(20) లకు తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న అబ్బూరి గణేష్, కావటి శివలకు దెబ్బలు తగిలి రక్త గాయాలు అయినవి. మిగతావారు మరగోని మహేష్, ఉదయ్, కారు డ్రైవర్ చింతపల్లి ధనుష్ అక్కడి నుంచి పారిపోయారని, అబ్బూరి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సూర్యాపేట రూరల్ ఎన్ బాలు నాయక్ తెలిపారు.