గద్వాల్ అభివృద్ధికి మూడు కీలక డిమాండ్లు
సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి, మేళ చెరువు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి వినతి
జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్:. జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా మరియు వైద్య సౌకర్యాల కల్పన కోసం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే మోహన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత వెంకటాద్రి రెడ్డి సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున వినతి పత్రాలు అందజేశారు. గద్వాల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లకు గద్వాల్లో హాల్ట్ కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం అసోసియేషన్ కోరింది. ఈ మేరకు గతంలో 26-02-2024న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మెమోరాండం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ సమస్యపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 3,500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, స్టేషన్ ద్వారా రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ కల్పిస్తే గద్వాల్‌తో పాటు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు, పీజేపీ డ్యామ్ తదితర పర్యాటక ప్రాంతాలకు భక్తులు, పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా గద్వాల్ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని 100 ఎకరాల భూమిలో ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి నిర్మించాలని కోరారు. ఈ ఆసుపత్రి ఏర్పాటైతే గద్వాల్‌తో పాటు కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు మరియు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మరో కీలకమైన డిమాండ్‌గా మేళ చెరువు క్రాస్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మించాలని కోరారు. ఈ వంతెనను రాయచూర్ బైపాస్ రోడ్డు, మంత్రాలయం వైపు వెళ్లే రహదారులతో అనుసంధానం చేస్తే రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. రైల్వే సౌకర్యాల విస్తరణ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, ఆర్వోబీ నిర్మాణం—ఈ మూడు పనులు పూర్తయితే గద్వాల్ జిల్లా అభివృద్ధికి, పర్యాటక రంగానికి, వాణిజ్య కార్యకలాపాలకు మరియు ప్రజల సౌకర్యాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మోహన్ రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ అంశాలపై ప్రత్యేకంగా స్పందించి సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా గద్వాల జిల్లాకు తలమానికమైన జోగులాంబ ఆలయ అభివృద్ధి కొరకు అక్కడి ఆదాయ వనరులను పరిగణనకు తీసుకొని దేవస్థానం నిర్వహణ కొరకు డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖకు సిఫారసు చేయాలని, అలాగే ఇక్కడి నవబ్రమాలయాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున యునెస్కో గుర్తింపు కృషి చేయాలని కోరారు.