బస్సు బంద్.. ఆటోలే దిక్కు
నాలుగు రోజులుగా బిజ్వారం విద్యార్థుల అవస్థలు.. గద్వాలకు ఆటోల్లో ప్రయాణం
జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలం పరిధిలోని బిజ్వారం గ్రామానికి గత నాలుగు రోజులుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గద్వాల పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతిరోజూ బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సమయానికి బస్సు రాకపోవడంతో ఆటోల్లో గద్వాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆటో ఛార్జీల భారం పడటంతో పాటు, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే వాహనంలో ప్రయాణించాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా బిజ్వారం గ్రామానికి బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించి, ఉదయం వేళల్లో నిర్ణీత సమయానికి బస్సు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.