కూరగాయలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి 

Aug 18, 2026 - 18:59
Aug 18, 2026 - 19:18
 0  2
కూరగాయలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి 
కూరగాయలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి 
కూరగాయలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి 

నానో యూరియా అమ్మకాలు పెరగాలి. 

 ఆయిల్ పామ్ పంటలతో మంచి ఆదాయం 

 పామ్ తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేయొచ్చు 

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.


జోగులాంబ గద్వాల 18 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- యూరియాను అధిక మొత్తంలో వినియోగిస్తుండడంతో వ్యవసాయ క్షేత్రాలు సారవంతతను కోల్పోతున్నాయని, అన్నదాతలు నానో యూరియా ఎక్కువగా వినియోగించేలా వాటి అమ్మకాలు పెరగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లా పరిధిలోని మల్దకల్ మండల కేంద్రంలో మన గ్రోమోర్, రైతు అగ్రో ట్రేడర్స్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల విత్తనాలు, ఎరువుల విక్రయాలు, వాటి ధరల గురించి నిర్వాహకులతో మాట్లాడారు. వివిధ స్టాక్ రిజిస్టర్ లను, పెస్టిసైడ్స్ నిల్వలను పరిశీలించారు. రైతులు ఎక్కువగా నానో యూరియా వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా కురుస్తుండడంతో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలైన కూరగాయలు, తదితర సాగుపై ఎక్కువగా  దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. పెస్టిసైడ్స్, సీడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.

జిల్లా కలెక్టర్ అంతకుముందు మల్దకల్ పరిధిలోని అమరవాయి, పెద్దొడ్డి గ్రామాల్లోని పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో పామ్ మొక్కలను అధికారులతో కలిసి నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ క్షేత్రాల్లో అంతర పంటలుగా ఆరుతడి పంటలను సాగు చేసి కూడా అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. జిల్లాలో పామ్ పంటల సాగు పెరిగేలా సంబంధిత అధికారులు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ పామ్ పంటలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీపంలోని నీటి కుంట, డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను పరిశీలించారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్, రాజశేఖర్, ఆయిల్  ఫేడ్ కార్పొరేషన్ అధికారులు కరుణశ్రీ, మంజునాథ్, అమరవాయి సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రంగన్న, ఇతర అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State