ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు అన్నారు.శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధికారులు,సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేశారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని,ప్రతి ఎన్నికలలో తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు.ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయవచ్చన్నారు. ప్రపంచ దేశాలలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి పైనా ఉన్నదన్నారు. ప్రజలను చైతన్యం చేయడం, వారికి ఓటు విలువ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలంతా ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వై.మోగిలయ్య, సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఏ . ఓ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆర్.ఐ లు వెంకటేష్, హారీఫ్, కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.