పొదుపు మoత్రం ఆవశ్యకత ఇప్పుడు తెలిసిందా?
దశాబ్దాలుగా సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు పాటిస్తే ఎంతో అర్థం ఉండేది కదా!
పాలకులు ఎవరైతే నేమి? ఇప్పటికైనా వేతనాలు, ఖర్చుల్లో కోత విధించుకొని చిత్తశుద్ధిని చాటుకోవాలి!
---- వడ్డేపల్లి మల్లేశం
నూ టికో కోటికో ఒకరోజు పేదవాడు వాంతులు చేసుకుంటే అత్యాశతో అంత దిగమింగుడు అవసరమా? అని ఎద్దేవా చేస్తారు. పేదలు అల్పాదాయ వర్గాలు తమ నిజ జీవిత అవసరాలను తీర్చుకోలేని పరిస్థితులలో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడం కానీ హామీలతో ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేసినప్పుడు పేదలకు ఈ ఉచితాలు అవసరమా? అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో బడా పెట్టుబడిదారీ వర్గాలు ప్రభుత్వ బ్యాంకులకు కాయలా పడిన రుణాలను తీర్చే క్రమంలో లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వము మాఫీ చేసిన తీరును గమనిస్తే ఎవరు తిండిపోతులో ఎవరు పేదవర్గాలో ఆకలితో అలమటించేది ఎవరో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆకలి కేకలు ఒకచోట ఉంటే అన్నపురాశులు మరొకచోట దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇంత అసమానతలతో కూడుకున్న భారత దేశంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు సంపన్న వర్గాలు పారిశ్రామికవేత్తలు ప్రజాధనాన్ని తమ సంపదగా భావిస్తూ విచ్చలవిడిగా ఖర్చు చేస్తూనే ఉన్నారు. పేదలు మాత్రం తమ చెమట చుక్కల ఫలితాన్ని కనీసం గా అనుభవించడానికి అర్హత కోల్పోతున్నారు ఇది భారతదేశంలో భిన్నమైన విచిత్ర పరిస్థితులకు తార్కానo, భారతదేశం 1991 లో ఆర్థిక సంక్షోభo లో కూరుకుపోయింది అయితే ఆ పరిస్థితులు ఒకనాటితో ఉద్భవించినవి కావు ప్రభుత్వాల యొక్క బాధ్యతారాహిత్యం తప్పట డుగులు, స్వప్రయోజనాలు, కుంభకోణాల ఫలితంగా ఏర్పడిన దుస్థితికి అది పునాది కాగా ఆనాటి నుండి అమలు చేసిన అనేక సంస్కరణల కారణంగా కొంతవరకు ఆర్థిక పరిస్థితి చక్కబడినా క్రమక్రమంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ప్రైవేటుపరమైనవి అనడంలో సందేహం లేదు. గత పది సంవత్సరాలలో మరింత వేగంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటుపరం కావడాన్ని మనం గమనించవచ్చు. అంటే పాలకులు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ తమ బాధ్యత నుండి తప్పుకుంటూ ప్రజల సొమ్మును మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి ఒక దుస్స o ప్రదాయం క్రమంగా వేలునుకున్న ఫలితంగానే నేడు పొదుపు మంత్రాన్ని పాలకులు జపించవలసి రావడం అని అర్థం చేసుకుంటే మంచిది. స్వాతంత్రం వచ్చిన తొలినాల్ల లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించి వాటిని పెంచి పోషించినటువంటి పరిపాలన సరళీ క్రమంగా తిరోగమనములో గత పదేళ్ల లోపల భారీగా దుస్థితికి చేరుకోవడాన్ని సామాజిక విశ్లేషకులు, రాజకీయ నిపుణులు తప్పు పడుతున్నారు. దానివల్లనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పేదలు మధ్య తరగతి అట్టడుగు వర్గాలకు అవకాశం లేకపోవడం రిజర్వేషన్ ఫలితాలు వర్తించకపోవడం వల్ల అవకాశాలు అన్నీ కూడా మళ్లీ సంపన్న వర్గాలకే దక్కడాన్ని గమనించవచ్చు. ఇంత విచిత్రమైన పరిస్థితుల మధ్యన దేశం ఆర్థిక సంక్షోభంలోకి క్రమంగా వెళ్లి పోతూ ఉంటే భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక స్థాయికి చేరుకున్నదని ప్రభుత్వాలు గొప్పగా చెబుతూ ఉండడం ఏ రకంగా సబబు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన సందర్భాన్ని గతంలో మేధావులు ఎన్నోసార్లు ప్రశ్నించినారు. ఇటీవల పచ్చిమాసియా లో సంభవించిన యుద్ధం కారణంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నట్టు అనివార్యమైన పరిస్థితిలో పెంచక తప్పలేదని ప్రభుత్వాలు చెప్పడం అవకాశాలను సొమ్ము చేసుకోవడమే. అంతకు మించిన స్థాయిలో ప్రభుత్వాల ఖర్చులు భారీగా పెరగడం, ఆడంబరాలకు పాకులాడడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ నేపద్యాన్ని మరిచి ఇటీవల హైదరాబాదులో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి గారు బంగారం ఒక సంవత్సరం వరకు కొనుగోలు చేయకుండా కట్టడి పాటించాలని, పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ లాంటి ఆయిల్ వినియోగం పొదుపు చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కడానికి తోడ్పడాలని, మంత్రులు కూడా తమ ఖర్చులు భారీగా కోతగించుకోవడం ద్వారా ఆచరణలో చూపాలని చేసిన సూచనలు కొన్ని ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవడం అమలు చేయడం కోతలు విధించుకోవడం కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించి ప్రధానమంత్రిని అనుకరించిన స్థితిని గమనించవచ్చు.
పొదుపు సర్వత్ర అవసరమే పాలకుల నుండి రావాలి
ప్రజల కష్టార్జితాన్ని తమ విలాసాలు ఆడంబరాలకు ఖర్చు చేస్తున్న పాలకులు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత ఇప్పుడు పొదుపు మంత్రాన్ని పాటించడం ఏ మేరకు సమంజసం? ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు గతంలో లేవా? విలాసాలకు ఆడంబరాల తో పాటు మంత్రులు అధికారుల ప్రయాణ ఖర్చులు వేతనాలు ఇతర సౌకర్యాలకు భారీగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేసిన విషయం నిజం కాదా? చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు మంత్రులు ప్రధాని ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా తమ వేతనాలలో భారీ కోతను విధించుకోవడం ద్వారా తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటవరసకైనా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు తమ వేతనంలో సగానికి సగం కోత విధించుకోవడం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది ఒక్క నెలతో మాత్రమే సరిపోదు అవసరమైతే నిరంతరం కంటిన్యూ చేయడం ద్వారా పరిస్థితులు చక్కబడే వరకు ఆ సూచన పాటిస్తే తప్పేం లేదు అప్పుడు తెలంగాణ దేశానికి ఆదర్శం అవుతుంది. ఇక ప్రధానమంత్రి బంగారం రేటు భారీగా పెరిగిన0దున సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నదని అవసరాలను తగ్గించుకోవడం ద్వారా కొనుగోలు చేయకుండా ఉంటే ఆర్థిక పరిస్థితికి వూ తమిచ్చిన వాళ్ళు అవుతారని చేసిన సూచన ఉన్నత వర్గాలకు ఏ రకంగానూ ఇబ్బంది కలగదు కానీ పేద మధ్యతరగతి వర్గాల వారికి కనీస సౌకర్యాల కోసం కొనుగోలు చేయక తప్పని పరిస్థితులలో కావాలని ప్రభుత్వమే రేట్లను పెంచి నష్టపరిచినట్లు కాదా? దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం ద్వారా బంగారానికి వేల రూపాయల అదనపు ధర పెరిగినటువంటి సందర్భాన్ని గత రెండు మూడు రోజులుగా గమనిస్తే ఇది ఏ వర్గ ప్రయోజనం కోసం చేసిన చర్యనో అర్థమవుతుంది. నిజమైన ప్రజా నాయకునికి ఏ రక్షణ కూడా అవసరం లేదు కాన్వాయ్ పేరుతో మంత్రులకు శాసనసభ్యులకు భారీ మొత్తంలో వాహనాలను సమకూర్చి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని ముమ్మరం చేసిఆర్ధిక భారాన్ని ప్రజల మీద మోపుతున్న తీరు ప్రధానమంత్రి తో సహా పాలకులందరికీ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల, దేశాల పర్యటనలు చేస్తున్న సందర్భంలో కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు అర్థమవుతూనే ఉంది. ఇక సభలు సమావేశాలకు అధికారిక కార్యక్రమాలకు ఆడంబరాల కోసం వెచ్చిస్తున్న ఖర్చులకు అంతే లేదు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా పేద విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో విలాసాలకు మాత్రం నిధుల కొరత లేకపోవడాన్ని మనం దేశ వ్యాప్తంగా గమనించవచ్చు. ఇక పేద వర్గాలకు విద్యా వైద్యం కూడా అందని ద్రాక్షగా మిగిలిన సందర్భంలో ప్రైవేట్ రంగంలో చికిత్సలు చేయించుకోవడం చదువులు చదువుకోవడం వల్ల పేద కుటుంబాల పైన అంతులేని భారం పడి పేదలు మరీ పేదలుగా మారుతుంటే ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచించినాయా? ఇరాన్ అమెరికా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఇది ఒక మార్గమని ప్రధాని ప్రకటించగానే అందరూ ఆమోదించడం వెనక అర్థం ఏమిటి? యుద్ధంతో సంబంధం లేకుండా ఖర్చులను భారీగా చేసి ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన సందర్భంలో ఈ పొదుపు జ్ఞాపకం రాలేదా? పాలనా వ్యవస్థ నిర్వాహనకు హెచ్చు ఖర్చులు కావడం వల్ల మౌలికమైన విద్యా వైద్యం గృహవసతి తాగునీరు నాణ్యమైన రోడ్లకు నిధులు లేకపోవడం ఒకవైపు అయితే ప్రభుత్వం పేరుతో నిర్మాణం చేసినటువంటి రోడ్లపైన వెళ్తున్న వాహనదారుల నుండి టోల్ టాక్స్ రూపంలో కోట్లాది రూపాయలను దశాబ్దాల పాటు వసూలు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వమే రోడ్లను నిర్మించినప్పుడు ప్రైవేటు వారికి పనులు చెల్లించడం అంటే సామాన్య దృష్టిలో విచిత్రంగా ఉన్నది కదూ!
ఒక మంత్రి వెళుతూ ఉంటే పదుల కొద్ది కార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి సంవత్సరంలో డజన్ల కొద్ది ప్రయాణాలు పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు యొక్క వేతనాలతో పాటు వారికి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు రాజబోగాలకు అంతే లేదు. కనీసం ఈ సందర్భంలోనైనా పేదల యొక్క దుస్థితి ఇల్లు లేక రోడ్లమీద ఉన్న వాళ్ళ యొక్క అవసరాన్ని దుస్థితి అర్థం చేసుకునే మనసు పాలకులకు ఉందా? గమ్మత్తు ఏమిటంటే ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత అనేది వేతనంతో కూడుకున్న ఉద్యోగం కాదు అది సేవా రంగానికి సంబంధించిన అంశం మాత్రమే. అలాంటప్పుడు ఉద్యోగుల లాగా వీరికి పెన్షన్స్ సౌకర్యం ఉండడం నేరమని ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదిm ఆ చర్చ విస్తృతం కాకముందే న్యాయస్థానాలకు వెళ్ళకముందే ప్రభుత్వాలు ఆలోచించి పెన్షన్ సౌకర్యాన్ని ఉపసంహరించుకునేలా చేయడం సంతోషం అని సామాజిక రాజకీయవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎన్ని పదవులు చేస్తే అన్ని రకాల పెన్షన్లకు అర్హులని చెప్పడం మరింత మూర్ఖత్వం అవుతుంది. అందిన కాడికి అందుకోవడం అనే సామెత లాగా ఈ దేశ సంపదను చేతనైనవాడు,సమర్థుడు,మోసగాడు, పెట్టుబడుదారుడు, మాటకారి ఎంతైనా దోచుకోవచ్చుననే దానికి ఆనవాళ్లు ఈ దేశంలో ఎన్నో కనిపిస్తున్నాయి. నిజాయితీ గల ప్రభుత్వ వర్గాలు ఈ అసమానత్వాలను అంతం చేసే క్రమంలో ప్రభుత్వ వర్గాలు కేవలం ప్రజా సంపదకు కాపలాదారులుగా మాత్రమే భావించి తమ విలాసాలను కుదించుకోవడం ద్వారా కనీసం ఒక్క వాహనానికే పరిమితం చేసుకునే విజ్ఞతకు అలవాటు పడితే కోటానుకోట్ల రూపాయలను పొదుపు చేయవచ్చు. ఆ డబ్బుతో ఎంతోమంది పేదలకు సకల సౌకర్యాలు కల్పించవచ్చు అది ఒక్క రోజుతో వచ్చిన ఆలోచన కాకుండా నిరంతరం కొనసాగే ప్రక్రియగా అమలవుతూ ఉండాలి .
(ఈ వ్యాస సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )