ఏరులైన మద్యం..!! నాలుగు నెలల్లో రికార్డ్ స్థాయి అమ్మకాలు
* నిమిషానికి 1,600 లీటర్ల లిక్కర్
* నిమిషానికి 5,200 బాటిళ్ల అమ్మకం
* నాలుగు నెలల్లో రూ.14,668 కోట్ల ఆదాయం
తెలంగాణలో మద్యం వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పండుగైనా, పబ్బమైనా, సంతోషమైనా, బాదైనా సరే మద్యం సీసా తెచ్చుకోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జులై వరకు 4 నెలల్లో ఏకంగా మందుబాబులు 28.4 కోట్ల లీటర్ల మద్యాన్ని తాగేశారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం నిమిషానికి 3600 బాటిళ్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), 1600 బీర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. లీటర్ల లెక్కన చూస్తే నిమిషానికి 1600 లీటర్ల మద్యం అమ్ముడవుతోంది. వాటి విలువ రూ.14,688 కోట్లు అని అబ్కారీశాఖ వెల్లడించింది. గడిచిన 4 నెలల్లో 3.5 కోట్ల కేసుల (2.21 కోట్ల బీర్ కేసులు, 1.29 కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు) విక్రయాలు జరిగాయి. ప్యాకింగ్ సైజులను బట్టి గణిస్తే ఈ నాలుగు నెలల్లో 91.5 కోట్ల బాటిళ్లు.. అంటే 28.4 కోట్ల లీటర్ల మద్యం మందుబాబులు తాగేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్ర ఖజానాకు, లిక్కర్ వ్యాపారానికి కలిపి రూ.14,668 కోట్ల మేర ఆదాయం సమకూరింది...