ఎన్డీయే ఎంపీల భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీయే కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ బీజేపీ సీనియర్ లీడర్ రాజ్‌నాథ్ సింగ్ప్ర తిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలు అందరూ ఆమోదం తెలిపారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.
మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు
నరేంద్ర మోదీ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికారని, ఆయన నరేంద్ర మోదీ అని చంద్రబాబు పొగిడారు. నరేంద్ర మోదీకి విజన్, ఉత్సాహం ఉన్నాయని, పరిపూర్ణ కార్యదక్షత కలిగిన నాయకుడని అన్నారు. తన విధానాలన్నింటినీ నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం భారత్‌కు చాలా మంచి అవకాశమని, ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ నష్టపోతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు: చంద్రబాబు
‘‘ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎన్డీఏ అద్భుత మెజారిటీ సాధించింది. ఎంతోమంది నేతలను చూశాను కానీ మోదీ లాంటి పవర్‌పుల్ నేతలను ఎక్కడా చూడలేదు. ఏపీలో మోదీ కీలక ప్రచార సభలకు హాజరయ్యారు. మేకిన్ ఇండియా విజన్‌తో దేశాన్ని ముందుండి నడిపించారు. మోదీ విజన్ వల్లే దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్ పేరు ప్రఖ్యాతులను మోదీ ఇనుమడింపజేశారు’’ అని చంద్రబాబు ప్రశంసించారు.
మోదీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి మోదీ ఎన్నో అద్భుత విజయాలు అందించారని, దేశంలో యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందని ప్రస్తావించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోదీ నాయకత్వం వహిస్తున్నారని, ఏం సాధించాలన్నా ఒక విజన్ ఉండాలని, మోదీ విజన్ ఉన్న నాయకుడని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు అందరినీ ఆయన అభినందించారు..