ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి డిమాండ్
నూతనకల్, 10 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- నీళ్లు లేకఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని శిల్పకుంట్ల గ్రామంలో దాసరి మల్లయ్య ఎండిపోయిన వరి పంటలను తెలంగాణ రైతు సంఘం నూతనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం పాటు శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక రకాలుగా ఆందోళన గురవుతున్నారని పేర్కొన్నారు. కిష్టమైన పరిస్థితులలో రైతులు నిర్భరంగా ఉండాలని రైతులను కోరారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే ఎండిపోయిన పంటలను సందర్శించి సర్వేనెంబర్ ఆధారంగా నష్టం పరిహారం అంచనా వేసి ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పొలాలు పొట్ట దశలో ఉన్నాయని ఎస్సారెస్పీ ద్వారా వెంటనే నీటిని విడుదల చేస్తే రైతులు ఊపిరి పీల్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కూసు సైదులు ,తొట్ల లింగయ్య , అలిపురపు శ్రీనివాసరెడ్డి, ఉప్పుల వెంకన్న, తొట్ల అన్వేష్ ,బద్దం నరేష్, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు