ఉగాది పచ్చడి, ప్రకృతి సౌరభాలు ఇచ్చే జీవిత నిర్వచనాన్ని  నిజ జీవితంలో అనుభవిస్తున్నామా?

Mar 20, 2026 - 19:53
 0  0

 యాంత్రిక యుగంలో  పండుగల ప్రాధాన్యత  తగ్గుతున్న మాట వాస్తవం కాదా?

 పరిగెత్తి పాలు తాగాలనే  అత్యాశ,  బాధ్యతారాహిత్యం,  స్వార్థం ఈ  దుస్థితికి కారణాలు.

పండుగలకు, ప్రతి సందర్భంలోనూ ఇచ్చే నిర్వచనానికి ఉండే  వాస్తవ అర్థం వేరు ఉంటే  నిజ జీవితంలో దానికి భిన్నమైనటువంటి  అనుభవాలు జ్ఞాపకాలను  మనం కల్లారా చూస్తూ బాధ్యతను విస్మరిస్తున్నాము. స్వార్థ చింతనకు బలైపోతున్నo. కాయకష్టం చేసుకుని బ్రతికే కార్మికులు, కర్షకులు,  పేదలు, అట్టడుగు వర్గాల వారికి శ్రమ ఔన్నత్యం తెలుసు కనుక  శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించే వ్యక్తులుగా  నాగరికతను పది కాలాలపాటు పదిలపరుస్తారు అనడంలో సందేహం లేదు. కానీ మధ్యతరగతి ఉన్నత, సంపన్న వర్గాలతో పాటు బాగా చదువుకున్నమని చెప్పుకునే వాళ్లు కూడా  పండుగలకు ఉన్నటువంటి శాస్త్రీయపరమైన పరిశోధన ప్రాశస్యాన్ని విస్మరిస్తూ  తీరిక లేదంటూ,  తన కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో  మాటకూ కూడా నోచుకోవడం లేదంటే ఇది ఏ రకమైనటువంటి  సంస్కారమో అర్థం చేసుకోవచ్చు.

"సంస్కారం,  నాగరికత, పరోపకారం, సేవా తత్పరత,  తోటి వాళ్లను సాటివాళ్ళుగా చూడడం వంటి  మానవీయ విలువలకు భిన్నంగా నడుచుకునే వాళ్లు ఎంతటి విజ్ఞలు చదువుకున్న వాళ్లు సంపన్నులైనా  నిష్ప్రయోజనమే."  ఈనాడు ఉగాది తో సహా  జరుపుకునే ప్రతి పండుగ రోజున కూడా  ఆ పండుగలకు ఉన్న శాస్త్రీయ సాంస్కృతికపరమైన అర్థాలను పరమార్థాన్ని విస్మరించి  తీరిక లేదని  డబ్బు సంపాదనకే మరిగి  కన్నవాళ్ళతోనే కూడా కలిసిపోవడానికి సిద్ధపడటం లేదు.  భారతీయ సంస్కృతికి  ఈ దుర్గతి పోవాల్సిన అవసరం ఉంది.  స్వేచ్ఛగా ఎగిరే పక్షులు,  వంకలు తిరిగే వాగులు సెలయేర్లతో పాటు  జీవరాసులన్నీ కూడా  తమ సహజత్వాన్ని ప్రదర్శిస్తూ  ప్రకృతికి అందాన్ని తెస్తుంటే  అన్నీ ఉన్న మనం మాత్రం ప్రకృతిని  విషపూరితనం చేస్తు స్వార్థానికి బలిచేస్తున్నాం.  ఇక్కడే మనం ప్రకృతితో పరీక్షించుకోవాల్సిన అవసరం,  మనం చేసే తప్పులను సమీక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే .

ప్రధానంగా ప్రతి పనిలో కూడా ప్రకృతి పరమైనటువంటి  అవకాశాలు అవసరాలను అంతరార్థంగా కలిగి ఉండి  స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు సంతోష సంబరాలను కొనసాగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కలిసిమెలిసి ఉండడం ఉల్లాసంగా  ఊరేగడం వంటి అంశాలు ప్రధానంగా పండుగలోనే సాధ్యం.  అలాగే ఉగాది పండుగ కూడా  చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే సందర్భంలో ప్రకృతిలో వచ్చే నూతన మార్పులు  వసంత రుతు ఆగమనముతో పక్షుల కిరకిల రావాలు  చిగురుటా కులు  చెట్ల నిండా పచ్చని  రంగుల పొదలు  మనసులో ఉల్లాసానికి కారణం.  పౌరాణిక గాధ ప్రకారంగా  సృష్టికి ఆదిరోజైనటువంటి చైత్ర శుద్ధ పాడ్యమి  రోజున బ్రహ్మదేవుడు సృష్టిని  ప్రారంభించినాడని  కథనం ఒకవైపు కొనసాగుతూ ఉంటే  ప్రచారంలో ఏదైతే నేమి   ఆ పండుగకు మాత్రం అనేకమైన విశిష్టతలు ఉండడాన్ని మనం గమనించాలి.  

పంచాంగ శ్రవణం పేరుతో రాబోయే సంవత్సరంలో జరగబోయే మంచి చెడుల ఫలితాలను పండితులు విశ్లేషిస్తుంటారు  అందులో నమ్మకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా యువత ప్రజలు  తమ యొక్క బాధ్యతలను గుర్తించుకుంటూ,  కష్టాలను తలుచుకుంటూ,  మరింత కష్టపడి సంవత్సరం పని చేయాలనేటువంటి  నిర్ణయానికి మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది.  అదే సందర్భంలో  కేవలం జాతకాన్ని పట్టుకొని  మౌనంగా ఉండకుండా శ్రమించాలి  విజయం సాధించాలి అనే పట్టుదల కూడా  ఈ పండుగ రోజున నిర్ణయం తీసుకోవడం జరుగుతా ఉంటుంది. కారము ,తీపి, పులుపు, వగరు,  చేదు, ఉప్పు వంటి షడ్రుచులు  సమ్మేళనంతో మామిడి  కాయలు వేప పూతతో  పచ్చడి చేసుకుని  జీవితానికి ఆనవాళ్లుగా కష్టసుఖాలను పోల్చుకుంటూ  పచ్చడి తాగి  మరింత ధైర్యాన్ని కొనితెచ్చుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను  సమానంగా స్వీకరించడానికి ఉద్యుక్తు లవుతారు. ఇక పండుగ రోజు ఉదయం పూటనే లేసి  స్నానం చేసి ఇంటిని మామిడి ఆకులతో  అలంకరించుకొని  కృత్రిమ ప్లేట్లు ఇతర గ్లాసులకు బదులుగా  ఆకులను వాడుకొని ప్రకృతి పైన తమ మమకారాన్ని ప్రదర్శిస్తారు. బెల్లం, చర్కర తో కూడినటువంటి భక్షాలను ఆరగించడం ద్వారా  తమ భవిష్యత్తు అంతా తీపిగా జరగాలని,  కష్టాలు తొలగిపోవాలని,  సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా  ప్రకృతిని తమకు నచ్చిన ఇష్ట దైవాలను ప్రార్థించి  మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటారు. 

లక్ష్యాలు నిజజీవితంలో సాకారమవుతున్నాయా?

కలిమిలేములు కష్టసుఖాలు  దనిక ఆ పేద తేడా లేకుండా అందరూ కలిసి జీవించడం  చేదు కష్టాలను స్ఫూర్తిగా తీసుకోవడం  పరస్పర సహకారంతో జీవితాలను కొనసాగించాలని అటువంటి లక్ష్యం ప్రధానంగా ఉగాది పండుగలో మనకు కనపడుతూ ఉంటుంది.  అయితే నిజ జీవితంలో  ఆ రకమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నామా?  పండుగ రోజు ఒక్కనాడు మాత్రం  చేసిన వంటకాలను ఆరగించి తృప్తిగా గడిపి  తెల్లవారి మళ్లీ మన వేగవంతమైన జీవితంలోకి వెళ్లిపోతున్నా0.  ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లోని సభ్యులతో కూడా మాట్లాడటానికి  సమయం ఇవ్వడం లేదు  విసుకుంటున్నాము, కసురుకుంటున్నాము, కోపగించుకుంటున్నా0,  కుటుంబ సభ్యుల మధ్యన కలతలు కన్నీరు హత్యలు ఆత్మహత్యలు  దాడులు  ప్రతి దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.

పేద కుటుంబాలలో అనుకుందామా అంటే కాదు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలలో కూడా...  కారణాలు ఏమైతేనేమి  అమానవీయ సంఘటనలు అత్యంత పేద కుటుంబాల కంటే సంపన్న కుటుంబాలలోనే గమనిస్తే మన ఆలోచన మన ఆచరణ ఎంత  హీనంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.  అహంభావం, ఆధిపత్యం,కోపం,  ఇతరుల పట్ల డాంబికం  ప్రదర్శిస్తున్న కారణంగా ఈ దుర్మార్గ  లక్షణాలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ లక్షణాలకు ఆజ్యం పోసే పరిస్థితులు నిజజీవితo తో పాటు టీవీ ప్రసారాలు సీరియల్ సినిమాలలో మరిన్ని రెచ్చగొడుతున్న సందర్భాలు అనేకం.  

ముఖ్యంగా ఈ సంఘటనలు సన్నివేశాలకు స్త్రీలు ప్రధానంగా ప్రేరేపితులు కావడం  కుటుంబ బాధ్యతల్లో కొంత విసుగు కారణంగా కూడా  లేనిపోని ఆగ్రహానికి ఆవేశాలకు గురి అయ్యి  విపత్కర పరిణామాలు చోటు చేసుకోవడాన్ని  మనము గమనించవచ్చు.  ఉగాది  నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ గొప్పగా చెప్పుకుంటాము అదే రోజు రాత్రి తెల్లవారు ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది.  ప్రియు ని చాటున భర్త హత్య,  ఉన్మాది  పసి పాపపై దాస్తీకం,  భర్త పిల్లలను వదిలి పరాయి మొగుడితో సహవాసం  ఇలాంటి ప్రకటనలు ప్రతిరోజు వింటూనే ఉన్నాo.  మన అక్షరాస్యత, నేర్చిన చదువు, అభ్యసించిన సంస్కారము,  సంపాదించిన డబ్బు,  ఇతరులతో చేసిన సహవాసం ఇక్కడ ఏమైంది?  ఎందుకిలా ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతున్నాం? ఆర్థిక అంతరాలు,  కుల విద్వేషాలు,  బంధుత్వంలో పేదరికం,  అక్షరాస్యత లేని   కుటుంబాలతో సహవాసం  వంటి అంశాలతో పాటు కుటుంబంలో భార్యాభర్తల యొక్క సామాజిక  కుటుంబ పరమైన ఆలోచన ధోరణులు  ఆడంబరాలు కూడా ఇలాంటి అనర్థాలకు కారణం అవుతున్నాయి.

పండుగల రోజున అయినా,  సభలు సమావేశాలలోనైనా,  కథలు గాథలు చెప్పే వాళ్ళముందై నా,  కార్మిక కర్షక సభల  ప్రసంగాల ద్వారానైనా, లోతైన అవగాహన కలిగిన పాత సినిమాల ద్వారా  అయినా  ప్రజలు తమ జ్ఞానాన్ని   విశాల హృదయాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్వార్థాన్ని తరిమికొట్టాలి.  పండుగల యొక్క ఆదర్శం ఒకనాటికే కాకుండా  జీవితాంతం అనే సోయి తెచ్చుకోవాలి.  ముఖ్యంగా ఉగాది నూతనత్వానికి,  మార్పుకు, చైతన్యానికి,  ప్రాకృతిక జీవితానికి  సంకేతం కనుక  ఉగాది పండుగ రోజు నుండి అయినా నూతన తత్వాన్ని  అలవర్చుకొని  చైతన్యాన్ని పెంచుకునే క్రమంలో మూఢత్వాలను విసర్జించి  ఆదర్శం పేరుతో  అహంకారం ఆదిపత్యాలను  కాల్చివేసి  మానవతా  కుసుమాలను పూచే  మొలక లాగా నూతన జీవితాన్ని ప్రారంభించడం  అభ్యుదయ భావజాలంతో  పరస్పరం స్ఫూర్తిని పొంది  అసమానతలు అంతరాలను  వైరుధ్యాలను  అంతం చేసి  సమానత్వాన్ని సాధించే క్రమంలో  నూతన వ్యవస్థను ఆవిష్కరించుకోవడానికి  పాలకులతో సహా ప్రజలుగా పౌర సమాజంలో భాగంగా   మనము కంకణం కట్టుకుందాం.   అక్కడక్కడ కర్తవ్యాన్ని బాధ్యతను విస్మరిస్తున్న పాలకులను ప్రశ్నించుదాం.

---- వడ్డేపల్లి మల్లేశం.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333