అశ్వాపురం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు
పట్టించుకునే వారే లేరా...?
సామాజిక సేవకులు కర్నె బాబురావు
తహసీల్దార్, ఫారెస్ట్ డివిజనల్ అధికారికీ పిర్యాదు..
అశ్వాపురం మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసిన అధికారులు పట్టించుకోక పోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయని,సామాజిక సేవకులు కర్నె బాబురావు అన్నారు. మంగళవారం పలు గ్రామాల పరిధిలో కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కొనసాగుతున్నా బట్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తహసీల్దార్ మణిధర్,ఫారెస్ట్ డివిజనల్ అధికారికీ మసూద్, మండల పంచాయతీ అధికారి, విద్యుత్ శాఖ ఏఈ కీ పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాబురావు విలేకరులతో మాట్లాడుతూ,
తుమ్మలచెరువు సమీప గ్రామాలలో కొన్నేళ్లుగా పెద్దఎత్తున ఇటుకబట్టీలు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగ కొనసాగుతున్నాయన్నారు . ఇటుకబట్టీల ఏర్పాటుకు పలుశాఖల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడంలేదన్నారు. సంబంధిత అధికారులు కుమ్ముక్కవడం తో ఈ దందా మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతున్నదని ఆరోపించారు.ఇటుక బట్టీలకు ఉపయోగించి కలప, మట్టి కోసం బట్టీల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని,బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటుంటు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోగా, బట్టీల వద్దే అరకొర సౌకర్యాల మధ్య జీవనం సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడన్నారు.
అంతేకాకుండా సమీప అడవుల నుండి వందల కొద్ది చెట్లను నరికివేసి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయన్నారు. పట్టించు కోవాల్సిన ఫారెస్ట్ అధికారులు కనీసం బట్టీల వైపు చూడటం లేదన్నారు. కొన్ని బట్టీలు ప్రభుత్వ, అటవీ భూముల్లో కూడా నిర్వహిస్తున్నారని, అసైన్మెంట్ పట్టాల పేరుతో రైతుబంధును కూడా దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బోరు ఉండి వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ప్రభుత్వం ఉచిత కరెంట్ ను 24 గంటల పాటు అందిస్తోందని, ఇటుక బట్టీలకు కావాల్సిన బోరు నీటికి ఉచిత కరెంట్ మీటర్ ఉండడంతో వేలాది యూనిట్లు కరెంట్ వాడుతూ ప్రభుత్వంకు గండి కొడుతున్నారన్నారు. పేదల ఇళ్లలో ఒక్క రోజు బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేసే విద్యుత్ అధికారులు ఇటుక బట్టీలలో నిత్యం ప్రతి రోజు కరెంట్‌ను వేలాది యూనిట్లను వాడుతున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరెంట్ లోకల్ లైన్‌మెన్లకు నెల మామూళ్లు ఉండడంతోనే వాటి జోలికి వెళ్లడం లేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయన్నారు. క్షేత్ర స్దాయిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని,రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్లు , ఇతరత్రా వ్యవహా రాలతో క్షేత్ర స్దాయిలో ఎలా ఉంటున్నా తమకేమి సంబందం లేదనే తరహాలో వ్యవహరించడం తగదన్నారు.అటవీశాఖ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం ఏమిటని,ఏజెన్సీలో వాల్టా చట్టానికి కొందరు తూట్లు పొడుస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, పచ్చని చెట్లపై గొడలి వేటు పడుతున్నా ఫారెస్ట్ అధికారులకు ఏమి కనిపించడం లేదన్నారు. కొందరు మండల అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇటుక వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని బాబురావు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డ్, జిల్లా కలెక్టర్,తాహాసిల్దార్, ఇతర అధి కారులు నిబంధనలకు విరుద్ధంగా వెలిసి న ఇటుక బట్టీలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుని, సదరు కార్మికులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరారు.