సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన కలెక్టర్.
జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.
మొదట ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కుడి, ఎడమ కాలువలను అలాగే సమాంతర కాలువను కలెక్టర్ పరిశీలించారు. కృష్ణ బేసిన్ లో ఉన్న పలు ప్రాజెక్టులను గురించి మొదలుకొని జిల్లాలోని పలు రిజర్వాయర్ల నీటి సామర్థ్యం, ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసే ఆయకట్టు వివరాలను జిల్లా కలెక్టర్ కు అధికారులు సమగ్రంగా వివరించారు. జూరాల ప్రాజెక్టుకు వర్షాకాలంలో 3 లక్షలకు పైగా వరద వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, జల విద్యుత్తు ఉత్పత్తి, తదితర విషయాల గురించి తెలిపారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల గురించి విపులంగా వివరించారు. స్కాడో రూంలో ప్రాజెక్టు గురించి మ్యాప్ ద్వారా అధికారులు కలెక్టర్ కు వివరించారు. డ్యామ్ గేట్లు, ఇతర నిర్మాణాలను కలెక్టర్ సీసీ కెమెరాల ఫుటేజీలో పరిశీలించారు.
అనంతరం గుడ్డెందొడ్డి పంపు హౌస్ కు వెళ్లే గ్రావిటీ కాలువను కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి గుడ్డెందొడ్డి లిఫ్ట్ వన్ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళిన కలెక్టర్ ప్రాజెక్ట్ మోడల్ డయాగ్రమ్స్ ను, ఆపరేటింగ్ గదులను పరిశీలించారు. అక్కడ నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలియజేశారు. అలాగే ర్యాలంపాడు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న కలెక్టర్ కు 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారని, సుమారు 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు. రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులు, గ్రామస్తులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ అధికారులతో మాట్లాడారు.
ఈ పర్యటనలో పీజేపీ ఎస్ఈ రహీముద్దీన్, ఈఈలు జుబేర్ అహ్మద్, శ్రీనివాసులు, పలువురు డీఈలు, ఇతర ఇరిగేషన్ అధికారులు, తదితరులున్నారు.