అవును కలిసి ఉద్యమిస్తే బీసీ సీఎం తప్పక అవుతారు.
అవును కలిసి ఉద్యమిస్తే బీసీ సీఎం తప్పక అవుతారు. మరి ఎక్కడ ఆగిపోతుంది?* అన్ని పార్టీలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీలు వర్గ ప్రయోజనాన్ని కోరుకోకపోవడం వల్లనే కదా!*చాకిరీకి,,మెప్పు పొందడానికి మాత్రమే జీవిస్తే అర్థం లేదు.* పిసిసి చీఫ్ అభిప్రాయంలో ఎంతో అర్థముంది.*
****************************************
---* వడ్డేపల్లి మల్లేషము 90142206412
---12....08....2025**************
"మెజారిటీ ఇస్ లా, పదిమంది అభిప్రాయానికే విలువ ఉంటుంది, నలుగురు చెప్పిందే న్యాయం, పదిమంది నడిస్తేనే బాటవుతుంది" అంటూ ప్రతి అంశానికి కూడా మెజారిటీ సభ్యుల మాటకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం నాటి నుండి నేటి వరకు గమనిస్తూ ఉన్నాం. అయితే నిత్యజీవితంలో ముఖ్యంగా రాజకీయ ప్రక్రియలో మెజారిటీ జనాభా ఉన్నటువంటి వర్గాలు రాజ్యాధికారంలో చోటు సాధించకపోవడం, లేదా మైనారిటీగా ఉన్నటువంటి వర్గాలే వారిని రాజ్యాధికారానికి దూరంగా పెట్టడం, మరొక మాటలో చెప్పాలంటే మెజారిటీ ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలు తమ మద్దతును అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ఆధిపత్య కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ప్రకృతి విరుద్ధమైన సహజ న్యాయానికి వ్యతిరేకమైన పద్ధతిలో రాజకీయాలు కొనసాగడం వల్ల నలుగురు నడిచిందే బాట అన్న సామెత చెల్లుబాటు కాకుండా పోతున్నది. ఒక్కరు నడిచి నలుగురిని ఆ బాటలో నిర్బంధంగా నడిపించి ఆ బాటకు చట్టబద్ధతను కల్పించి అదే నిజమని నమ్మించి మిగతా అందరిని కూడా తమ వైపు తిప్పుకోవడం వంటి ఆదిపత్య ధోరణులు ఈనాడు రాజకీయ ప్రక్రియలో కొనసాగుతూ ఉండడం వలన మెజారిటీగా ఉన్నటువంటి ముఖ్యంగా బీసీలు రాజ్యాధికారానికి తాము రాకపోవడానికి కారణం ఏమిటి అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు.ఆ భావన నుండి వచ్చినదే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలను బలోపేతం చేయడం, చీలికలైన అనేక సంఘాలు కూడా రాజ్యాధికారంలో తమ వాటా కోసం పోరాడ టం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే క్రమంలో రాజ్యాధికారమే తమ యజెండాని మిగతా వర్గాలకు హెచ్చరిక చేయడం కొంత శుభ పరిణామం ."కలిసి ఉద్యమిస్తే బీసీలే సీఎం అవుతారు" అనే మాట సాధారణ వ్యక్తి నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత వరకు కూడా తపిస్తే ఆ వైపుగా పురోగతి కనిపించడం లేదు అంటే ఆలోచించవలసిన తరుణం ఇప్పటికే మించిపోయింది సుమా! సుమారు 90 శాతం గా ఉన్నటువంటి మెజారిటీ బహుజనులు 10 శాతం కూడా లేనటువంటి ఆధిపత్య కులాలకు దాసోహం అవుతున్నటువంటి పరిస్థితిని ఇప్పటికీ వ్యతిరేకించకపోతే సహజ న్యాయానికి ద్రోహం ప్రకృతిని అపహాస్యం చేసినట్లే అవుతుంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం ఇతర ప్రజా ఉద్యమాలలో కూడా నాటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఒక్కటై తమ వ్యక్తిగతమైన డిమాండ్లను పక్కనపెట్టి పోరాడినారు కనుకనే లక్ష్యాన్ని సాధించుకోవడం జరిగింది. అదే ధోరణిలో తెలంగాణ సాధన కోసం జరిగినటువంటి తొలి మలి ఫైనల్ ప్రజా ఉద్యమాలలో ముఖ్యంగా తమ తమ డిమాండ్లను పక్కనపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఒక్కటే సొంత రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా సబ్బండ వర్గాలు ఒకటైతేనే కదా తెలంగాణ సాధ్యమైంది. ఇది ఒకరి నాయకత్వం వల్లనో మరొకరి బుజ్జగింపు వల్లనో సాధ్యమైనది కాదు అని తెలుసుకుంటే మంచిది. ఒక వ్యవస్థను ఆవిష్కరించుకోవడానికి పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం ద్వారా లక్ష్యం నెరవేరకపోతే నిరాశకు గురికాక తప్పదు అలాగే తెలంగాణ పోరాటంలో రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ గతంలో ఏ వర్గం అయితే వివక్షతకు అన్యాయానికి గురైందో ఆ వర్గాల యొక్క దోపిడీ పీడన అణచివేత అలాగే కొనసాగినప్పుడు అల్ప సంఖ్యాకులుగా ఉన్నటువంటి ఒకటి రెండు కులాల వాళ్లే రాజ్యాధికారాన్ని చేపట్టి మిగతా సమాజం మీద స్వారీ చేసినప్పుడు మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరే ఆస్కారం ఉండదు కదా! ఏ వర్గాల ప్రయోజనం కోసమైతే పోరాటం జరిగిందో ఆ వర్గాల నుండి నాయకత్వానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫలితం సాధ్యమవుతుంది అనే కనీస మైనటువంటి సోయి సామాన్యులు, బిసి వర్గాలకు లేకపోవడం వల్ల దానిని అల్పసంఖ్యాకులు పావుగా వాడుకొని బానిసలుగా చూస్తున్న విషయాన్ని గమనించాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చినటువంటి నాటి తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టినారే కానీ అధికారాన్ని మాత్రం ఆ వర్గాలకు ఇవ్వలేదంటే దీని అంతరార్థం ఏమిటి? 0.4 పర్సెంట్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని అదుపులో పెట్టుకుంటే మెజారిటీ వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది? బానిసలుగా బతకడం తప్ప.అదే నమూనా దేశవ్యాప్తంగా కూడా అమల వుతున్నప్పుడు కూడా బీసీ వర్గాలు మేలుకోకపోతే ఎలా?
తెలంగాణ పిసిసి చీఫ్ వ్యాఖ్య కార్యరూపం దాల్చాలి :
********************************************
మెజారిటీ వర్గాలు అన్ని రాజకీయ పార్టీలలో అనుచరులుగా జెండాలు మోసే వ్యక్తులుగా మాత్రమే మిగిలిపోవడం వల్ల తమకు ఏనాడైనా పదవులు రాకపోతాయా? చిన్న బాధ్యతలు అప్పగించకపోతారా? నాయకులు సంపాదించే అక్రమ సంపాదనలో తమకు కొంచమైన అందక పోతుందా? అనే ఆశతో ఆయా రాజకీయ పార్టీలను పట్టుకుని సామాన్యులు ఊగిసలాడుతుంటారే కానీ తమ స్వయం ప్రతిపత్తిని సాధించుకోవడానికి, ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని తిరగడానికి మాత్రం సంకోచిస్తారు. అందువల్లనే రాజ్యాధికారానికి ఈ వర్గాలు దూరంగా ఉంటున్నాయి.10, ఆగస్టు 2025 ఆదివారం రోజున సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వారోత్సవాలు హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రారంభమైన సందర్భంగా
తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను కీలకమైనవిగా భావించాలి. అవి మెజారిటీ వర్గాలకు సూచనగా సంకేతంగా హెచ్చరిక కూడా భావిస్తే తప్పులేదు. "దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి అయినారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు, గౌడులు ఇతర బీసీ సామాజిక వర్గాలు కలిసి ఉద్యమిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని, సందేహం లేదని" పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింప తగినవి. "ఒక రాజకీయ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని పార్టీ కొనసాగుతూ ఉంటే ఆ సిద్ధాంతం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, ఒకే వర్గాన్ని పెంచి పోషించినప్పుడు,ఇక మిగతా వర్గాలకు ప్రాధాన్యత కల్పించనప్పుడు కచ్చితంగా ఆ వర్గాలు ఉద్యమించాలి. తమ హక్కులను సాధించుకోవాలి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి." అనే భావన పిసిసి చీఫ్ వ్యాఖ్యలలో ఇమిడి ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు .తమ ఆత్మ గౌరవం కోసం పార్టీ నాయకత్వాన్ని కూడా ధిక్కరించినటువంటి అనేక మందిని ఆయా రాజకీయ పార్టీలు బహిష్కరించిన సందర్భం లేకపోలేదు ఇటీవల బీసీ ఉద్యమాన్ని ప్రభావితం చేసి మద్దతు పలికినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రకంగా ఆత్మగౌరవంతో ప్రతిఘటించే వాళ్లను బహిష్కరించడం మిగతా వాళ్లను బానిసలుగా తయారు చేయడా న్ని ఆధిపత్యంలో కొనసాగుతున్న నాయకత్వాలు అనుసరిస్తున్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలలో తలవంచి బానిసలుగా జీవించడం అవసరమా? అనే సందేహం కూడా ఈ వ్యాఖ్యలో ఇమిడి ఉన్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలు చాకిరీ చేయడంలో మెప్పు పొందడంలో ముందువరుసులో ఉన్నంతవరకు వాళ్ల ప్రయోజనాలు నెరవేరవు. ఏ రాజకీయ పార్టీ నాయకత్వం కూడా పిలిచి మెజారిటీగా ఉన్నారు కదా మీకు అధికారం కట్టబెడతామని అనరు. కనీసం టిక్కెట్ల కేటాయింపులో కూడా సామాజిక వర్గాలను విస్మరించి డబ్బున్న వాళ్ళు గొప్ప కులాలకు మాత్రమే టిక్కెట్ ఇచ్చిన అవినీతి ఆశ్రిత పక్షపాతం మనకు తెలియదా? అంత ఎందుకు నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది మెజారిటీ బీసీ వర్గాలకు, ఇతరులకు న్యాయం జరిగిందో చూస్తే అర్థమవుతుంది. "అధికారం, అవకాశం నీవు ఇచ్చేది ఏమిటి? రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని మా సమైక్యతను మా సమన్వయాన్ని జోడించుకుంటే భవిష్యత్తులో అధికారమంతా మాదే కదా! మీకు సుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు మాత్రమే మిగిలిపోతాయి అని బీసీ వర్గం ఎస్సీ ఎస్టీల సహకారంతో గనుక హెచ్చరిస్తే ఆధిపత్య వర్గాలు అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి అధికారంలో కొనసాగుతున్న ఆధిపత్య వర్గాలు తోక ముడుచుకొని పోవాల్సిందే అనే భావన కూడా పీసీసీ చీఫ్ మాటల్లో ఇమిడి ఉన్నది అని గుర్తిస్తేనే మనమంతా ఒక్కటి కావాలని, ప్రశ్నించాలని, ప్రతిఘటించాలని, హక్కుల కోసం నిలదీయాలనే భావన అందరిలో అంకురిస్తుంది. అదే రేపటి భవిష్యత్తుకు అధికారానికి శోదక శక్తిగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు." అయితే ఒకే కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వంటి దుష్టచేస్తులకు రాజకీయ పార్టీలు సంస్థలు బిసి ఇతర ప్రజా సంఘాలు పూనుకుంటే మాత్రం అది వివక్షతకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ సంస్థలు ప్రారంభమవుతున్న పరిణామాన్ని సమాజం గమనించాలి,. విద్యావంతులు బుద్ది జీవులు మేధావులు పరిశీలించాలి, పరిశోధించాలి, ఆ సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పడం చాలా ప్రాధాన్యత గల అంశం. జనాభా దామాషాలో చట్టసభల్లో బీసీలకు 56% వాటా కావాలని డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలలో 42%కోట అమలుకు తీర్మాణం చేస్తే కేంద్రం స్పందించడం లేదు. అంటే తమ అధికారం ఎక్కడ జారిపోతుందో అనే ఆవేదన, అధికారాన్ని వదలని స్వార్థ ప్రయోజనం అర్థమౌతుంది. పోరాటమే పరిస్కారం అనే భావనతో బీసీలు ముఖ్యంగా మిగతా వర్గాలను కలుపుకొని సమైక్యంగా ఉద్యమిస్తే తప్పకుండా సీఎంతో సహా మంత్రివర్గంలో మెజారిటీగా బీసీలు అధికారానికి రాక తప్పదు. 2.4% ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కీలక పదవుల్లో కొనసాగుతూ నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమ వర్గం వారికే పెద్ద పీట వేయడం అంటే ఏ వర్గం అధికారంలో ఉంటే ఆ వర్గ ప్రయోజనాలకే పనిచేస్తారని అర్థమవుతుంది. అలాంటప్పుడు 90% గా ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు అధికారంలో ఉంటే ఆ వర్గాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడతాయి అనే సోయి ఈ వర్గాలకు ముఖ్యంగా బీసీ కులాలకు లేకపోతే ఎలా? ఆయా రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నటువంటి మెజారిటీ వర్గాల కార్యకర్తలు తమ హక్కుల రక్షణ కోసం ఆ రాజకీయ పార్టీల్లో అంతర్గతంగా పోరాడాల్సిందే.రాజకీయ పార్టీ అనుమతించనప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు, వివక్షతకు గురి చేస్తే ఆ పార్టీలను వదిలిపెట్టి ప్రజా ఉద్యమంగా రావాల్సిందే,కలిసి ఉద్యమాన్ని చేపట్టాల్సిందే, బీసీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టవలసిందే. "మైనారిటీగా ఉన్నటువంటి వాడు రాజ్యమేలినప్పుడు మెజారిటీగా ఉన్న ప్రజల తరఫున బీసీలు రాజ్యమేలుతే నేరమా? దీనిని అంగీకరించడానికి ఆధిపత్య వర్గాలు ఎందుకు సిద్ధంగా లేవు అన్నది ఉమ్మడిపోరాటం ద్వారా తెలిపోతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )